Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 60


    తనకి ఎంత డబ్బు ఉన్నా.


    ఎంత పేరు ఉన్నా ఆ విషయం మరుగున పర్చలేడు.


    ఈ పెళ్ళితో తనకి చెడ్డపేరు వస్తుంది.


    చెడ్డపేరు రాకుండా, ఇందూ ఇష్టంమీదే ఈ పెళ్ళి జరిగినట్లుగా అందరికి తెలిసేలా చెయ్యాలి.


    కృష్ణమౌళి ఆలోచనలు ఒక దారికి రావటంలేదు.


    ఉపాయంకోసం ఆలోచిస్తూ.


    పెళ్ళి చూస్తూ ఎల్లుండి రాత్రి రెండున్నర గంటలకు ముహూర్తం.


    ఒక్కోరోజు గడిచిపోతుంది.


    ఎలా! ఎలా ఏమిటి చెయ్యటం!


    అని ఆలోచిస్తుండగా అతని గదిలోకి మణి వచ్చి చెప్పింది?


    ఇంద్రసేన రాత్రినుండి భోజనం చెయ్యటంలేదు అని.


    అతనికి ఒళ్ళు మండిపోయింది.


    "నేను వస్తాను ఉండు" అంటూ అతను అక్కడనుండి ఆమె గదిలోకి వెళ్ళాడు. గదిలోకి అడుగుపెట్టగానే ఇందూ అతనివైపు చివ్వున తలత్రిప్పి చూచింది.


    ఆమె చూపులు ఒక శత్రువుని చూసినట్టుగా అనిపించసాగాయి అతనికి.


    కృష్ణమౌళి మనసు వెంటనే చివుక్కుమంది.


    ఏమి ఆశించి తను ఆమెను కోరి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాడు!


    ప్రేమా! ఆదరణా! అభిమానమా! అనురాగమా!


    భార్యనుండి ప్రతి మగవాడూ ఆశించేది ఏమిటి?


    అతని గుండెలు ఒక్కసారి బరువెక్కాయి.


    సూటిగా ఆమెవైపు చూస్తూ అడిగాడు.


    "రాత్రి భోజనం చేశావా?"


    ఆమె మాట్లాడలేదు.


    "ఉదయం కాఫీ త్రాగావా?"


    అప్పటికీ ఆమె మాట్లాడలేదు.


    "మాట్లాడవేం!" కోపంగా గద్దించేడు.


    అంతే! అతని కేకకు ఛర్రున లేచి నిలబడుతూ.


    కాలితో నేలను బలంగా ఒక్క తన్ను తన్నింది. "మీరు నన్ను అధికారంతో ప్రశ్నించటం ఏమిటి! మీరు ఎవరు! నేను ఎవరు!" అంది మహాకోపంగా.


    "ఇందూ!" గట్టిగా కేక పెట్టాడు.


    "మీరు ఎంత అరిచినా నేను ఏం భయపడను. అరవండి ఇంకా గట్టిగా అరవండి" అంది మహాకోపంగా.


    "నేను మంచివాళ్ళకి మంచివాడను కాని కోపంవస్తే మాత్రం" అంటూ ఆగాడు.


    "ఏం బెదిరిస్తున్నారా!" సూటిగా ప్రశ్నించింది.


    "బెదిరిస్తే నువ్వు బెదురుతావు అనే" అంటూ అదోలా నవ్వాడు.


    ఆమె మాట్లాడలేదు నిర్లక్ష్యంగా ముఖం తిప్పుకుంది.


    "ముందు నువ్వు కాఫీ త్రాగి టిఫిన్ తిను."


    "నేను తినను"


    "తినవా!" సూటిగా ప్రశ్నించాడు.


    తల తిప్పింది తినను అన్నట్టు.


    "తినకపోతే చచ్చి ఊరుకుంటావు" కోపంగానే అన్నాడు.


    "మరీ మంచిది. సగం చచ్చి ఈ యింట్లో బ్రతికేకంటే పూర్తిగా చావటం మేలు" అంది కసిగా.


    "నువ్వు అనుకున్నంత సులభంగా నిన్ను చావనివ్వను."


    "మౌళీ" అంది కోపంగా.


    "ఏం నీ కేకలకి నేను జడిసిపోతాననా నీ ఉద్దేశ్యం? అలా జడిసే వాడ్ని అయితే ఇంతదూరం నేను నడిచి ఈ బాటను వచ్చేవాడ్నికాదు. నా దారి నేను చూసుకునే వాడ్ని. నేను మర్యాదగా చెపుతున్నాను. నువ్వు కాఫీ త్రాగుతావా లేదా."


    "నేను త్రాగను" మొండిగా అంది.


    "త్రాగవూ" అంటూ ఆమె చెయ్యిపట్టి ఒక్క గుంజు గుంజాడు.


    ఆ గుంజటంలో తూలి అతనిపై పడింది.


    "ఛీ" అంటూ అతన్ని వదిలించుకుని దూరంగా వెళ్ళబోయింది.


    అతను వదల్లేదు.


    మౌళి కళ్ళల్లో కోపం, కసి, కక్ష రగలసాగింది. "నేను అంత చేతకాని వెధవను అనుకుంటున్నావేమో! నేను తల్చుకున్నాను అంటే ఏమయినా చేస్తాను. మీ నాన్నకు మీ అన్నకు ఊళ్లోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడా నీళ్ళు పుట్టకుండా చేయగలను."


    "అంతేకాదు నీవు నీ అందం చూసుకుని మహాగర్వపడి మురిసి పోతూన్నావే ఆ అందాన్ని నీ వయసునూ, నీ ఒయ్యారాన్ని, నీ గర్వాన్ని నేను దోచుకుని నిన్ను ప్రాణంలేని కట్టెగా చేసి ఒదిలి పెట్టేవాడ్ని. అప్పుడు నువ్వు" అంటూ అదోలా నవ్వాడు.


    "అందం, వయసూ దోచుకోబడ్డ స్త్రీకి పుట్టింటకూడా నిలవ నీడ లభించదు. ప్రాణం ఉన్నా ప్రాణంలేని కట్టెగానే మిగులుతుంది. అప్పుడు ఆ పొగరు, ఆ విసురు ఏమవుతాయో ఆలోచించుకో స్త్రీ స్త్రీయే."


    "మగవాడితో ఎప్పుడూ సరిరాదు పోటీకాదు."


    "మగవాడు మగవాడే."


    "మగవాడితో పోరాడి గెలిచిన స్త్రీ లేదు."


    "హు" అంటూ నిరసనగా చూసింది.


    "ఏ విషయంలో? రాజ్యాలు ఏలిన స్త్రీలు లేరా?" అడిగింది కోపంగా.


    "ఉన్నారు రాజ్యాలు ఏలిన స్త్రీలు ఉన్నా ఆ స్త్రీలకు భర్తలు ఉన్నారు. ఆ భర్తలకు తలవంచారు. గౌరవించి కాని నీకు ఆ గౌరవం లేదు. ఆ మర్యాద లేదు. అది నీ తప్పుకాదు నీ తండ్రి తప్పు. నీ తండ్రి బుద్ధులే వచ్చాయి నీకు"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS