Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 59


    అంతే.


    అతని కళ్ళు అగ్నిగోళాల్లా మారిపోయాయి.


    క్రోధావేశాలతో కంపించిపోయాయి.


    ఆమె చెంపలు అదిరిపోయాయి.


    ఇంద్రసేన చెంపలపై చేతులు ఆన్చుకుంటూ అలా నిలబడిపోయింది.


    ఆమె చెంపలు ఎర్రాగ కందిపోయాయి.


    అతని చేతివేళ్ళు ఆమె లేత చెంపపై అట్టులా తేలిపోయాయి.


    "మా అమ్మ మీకు వంటమనిషా! మళ్ళీ ఆ మాట అను" అంటూ ఆమె భుజాలపై చేతులువేసి గుచ్చిపట్టుకుంటూ కోపంగా అడిగాడు.


    అతని ముఖం చూస్తూనే ఆమె నిజంగా భయపడిపోయింది.


    నోటిమాట రాలేదు. కళ్ళనీళ్ళు ధారలు కట్టసాగాయి అతని దెబ్బలకి తట్టుకోలేనట్టుగా.


    "చెప్పు మా అమ్మ మీకు వంటమనిషా? ఆ మాట అనడానికి సిగ్గులేదు! మా డబ్బు ఉన్నప్పుడు మానాన్న ఉన్నప్పుడు మీనాన్న మా ఇంటికి కుక్కలా పదిసార్లు తిరిగేవాడు. మా అమ్మ దగ్గర మానాన్నగారి దగ్గర చేతులు కట్టుకుని పనివాడిలా నిలబడేవాడు అలాటివాడి కూతురిని పెళ్ళి చేసుకోవడానికి నేను సిద్ధపడుతున్నందుకు నేను సిగ్గుపడాలి. అందుకు ఊరు ఊరు అంతా విరగబడి నవ్వి తిరగబడాలి అర్ధం అయిందా!"


    "మా నాన్నగారు పోవటంతో ఆస్తి కరిగిపోవటంతో మీ పంచన దురదృష్టం కొద్దీ చేరవలసి వచ్చింది. నాలుగు డబ్బులు సంపాయించటం నేర్చుకున్నాక మీ నాన్న అప్పటికే తల ఎగరేశాడు. తోడబుట్టిన చెల్లెలు అని పుట్టెడు దుఃఖంతో పుట్టినింటికి వచ్చింది అని కనికరం లేకుండా పనిమనిషిగా చూశాడు! అందుకు మీరంతా సిగ్గుపడాలి. మా అమ్మ నన్ను కష్టపడి పెంచిందేగాని ఒకళ్ళ సొమ్ము కాజేసి ఆ డబ్బుతో నన్ను పెంచలేదు. అందుకు నేను చాలా గర్వ పడుతున్నాను" అంటూ క్షణం ఆగి చెప్పాడు.


    "నువ్వు ప్రతీసారీ ఏదో విధంగా నన్ను అవమానిస్తూనే ఉన్నావు" "నేను భరిస్తూనే ఉన్నాను. ఈ అవమానం భరించలేనిది. అందుకే నేను నిన్నిప్పుడు మీ నాన్నతో అన్న మాటలు నిలబెట్టుకుంటాను. నిన్ను ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకుంటానని చెప్పాను. నిన్ను యిప్పుడు యెత్తుకు వచ్చాను."


    "రేపే మన పెళ్ళి."


    "నీ కిష్టం ఉన్నా లేకపోయినా నీ మెడలో మూడుముళ్ళు వేసి తీరతాను అదే నా పట్టుదల."


    "పెళ్ళికి ముహుర్తం పెట్టించి మళ్ళీ వచ్చి చెపుతాను" అంటూ మరోమాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయాడు.


    ఇంద్రసేన కుప్పకూలి పోయింది.


    ఏమిటి యితని మొండి పట్టుదల!


    అతను అన్నంతపనీ చేస్తాడా!


    నిజంగా తనని బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా! భయంతో కంపించిపోయింది.


    
                                  63


    కృష్ణమౌళి కోపంతో ఒక నిశ్చయానికి వచ్చేశాడు ఎన్నాళ్ళు ఇలా!


    ఎన్నాళ్ళు అయినా ఈ కోపం ఈ కక్ష ఇలా కొనసాగుతూనే ఉంటాయి.


    ఇందులో మార్పురాదు.


    అందుకే ఏమయితే అయింది అని పెళ్ళి ముహూర్తం పెట్టించేశాడు.


    మర్నాటికే ముహూర్తం పెట్టమంటే


    ఆ మర్నాడే ముహూర్తం కుదరలేదు!


    రెండురోజుల తరువాత ముహూర్తం కుదిరింది.


    ఎవ్వరికీ తెలీకుండా పెళ్ళి ఏర్పాట్లు చేయించసాగాడు.


    అంబికకు ఫోన్ చేసి చెప్పాడు!


    "అంబికా! మా పెళ్ళికి రెండురోజుల తరువాత ముహూర్తం పెట్టించాను"


    "అలాగా ఇందూ బాగానే ఉందా! ఆమె ఇష్టపడిందా" అడిగింది.


    "ఇందూ ఇష్టపడుతుందా! ఆమెలా మార్పా!" అన్నాడు అదోలా.


    "అదేమిటి!" ఇందూలో మార్పు వచ్చింది అని చెప్పారు.


    "అవును చెప్పాను నన్ను ఆడిస్తుంది."


    ఆమె మాట్లాడలేదు వింటుంది.


    "యికమీదట నేను ఆమెను ఆడిస్తాను"


    "అసలు ఏం జరిగింది! మిమ్మల్ని ఏమన్నా అన్నదా!"


    "ఎందుకు అనదు! కళ్ళు నెత్తిమీదకు వెళ్ళిపోతే అనదు! ఆకలి అయినప్పుడల్లా పాపిష్టి సొమ్ము నమిలి మింగుతుంటే మంచిబుద్ధులు మంచి మాటలు ఎలా వస్తాయి!" అంటూ ఇందూ తన మనసుని ఎంత గాయపరిచిందో తల్లిని ఏమన్నాదో చెప్పాడు.


    ఆయన మాటలు వింటూనే అంబిక అంది.


    "ఇందూ నోరు ఎలా అయినా జోరే ఏమాట ఎప్పుడు మాట్లాడాలో తెలీదు,"


    "తెలీదుకదా! తెలియచేస్తాను చూడు" అన్నాడు కోపంగా.


    "ఇయితే ఇప్పుడు ఏమిటి ఆలోచించుకున్నారు!"


    "ఆమెను బలవంతంగా పెళ్ళి చేసుకోవాలనే అనుకుంటున్నారా!"


    "అంతే మకి ఆమె విననప్పుడు ఏం చేస్తాను! బలవంతంగా పెళ్ళి చేసుకొని ఆవిడగార్కి తండ్రికి, అన్నకు సమాధానం చెపుతాను" అన్నాడు. అంబిక మాట్లాడలేదు!


    మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు.


    పెళ్ళి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి.


    ఆ ఊరి చివరగా ఉన్న వెంకటేశ్వరస్వామి కోవెలలో పెళ్ళి.


    అతను ఆలోచిస్తున్నాడు.


    ఈ పెళ్ళికి ఇందూ ససేమిరా ఒప్పుకోదు సరికదా ఆ విషయం అందరికీ తెలిసేటట్లుగా ప్రవర్తిస్తుంది.


    అలా అయితే గొడవ అవుతుంది కూడా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS