Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 5

    "ప్లాస్క్ టీతో పదిరూపాయలకు ఇచ్చాడంటే అందులో ఓనర్ లాభం ఉంది కదా! అటువంటప్పుడు నీకు ఇంకా ఎక్కువ ఆదాయం రావాలి. అబద్దం చెప్పావు కదూ" అడిగాడు రామకృష్ణ.
    అతను చిన్నగా నవ్వేశాడు.
    "నిజమే. వందరూపాయలు అమ్మితే యాభై రూపాయలు మిగుల్తుంది. నాలుగు వందలు అప్పుచేసి ప్లాస్కులు కొన్నాను. ఓనర్ దగ్గర నుండి ప్లాస్క్ తీసుకుని అమ్ముతుంటే ఎంతొస్తుందో అంతమాత్రమే తీసుకుని మిగతా లాభాన్ని అప్పుకి కట్టేస్తాను. మరో పదిరోజుల్లో ఈ ప్లాస్క్ లు నా స్వంతమవుతాయి" చెప్పాడు మెరుస్తున్న కళ్ళతో.
    "నీకు ఆశిరయ్య తెలుసా?"
    "తెలుసండి. నాకు పదిరూపాయలు ఇవ్వాలి....."
    "ఆ డబ్బులు నేనిస్తాను...." చెప్పాడు రామకృష్ణ.
    "మనిషే పోతే, బాకీ ఏమిటండి?"
    గోడౌన్ లోకి వెళ్ళడానికి లేచి అన్నాడు రామకృష్ణ.
    "అతనికి నేను చాలా ఋణపడుతున్నాను. కొద్దిగా తీర్చుకోనివ్వు....."
    ఆ కర్రవాడు అక్కడే నిలబడి గోడౌన్ లోకి వెళుతున్న రామకృష్ణని తదేకంగా చూడసాగేడు. నెలంతా టీ త్రాగి డబ్బులు ఇవ్వడానికి బాధపడతారు చాలామంది. మరికొంతమంది అబద్దం చెప్పి డబ్బులు ఎగ్గొడతారు. అటువంటి అనుభవాలు రుచి చూపించిన మనుషుల మధ్య చనిపోయిన మనిషి బాకీ తను తీరుస్తాననే వ్యక్తిని చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. నెమ్మదిగా అక్కడనుంచి మరో గోడౌన్ వైపు నడిచాడు ప్లాస్కుల సంచి భుజానికి తగిలించుకొని, క్రొత్త వ్యక్తిని చూసాననే ఆలోచన మనసులో నింపుకుని.
    గోడౌన్స్ లో పనిచేసే కూలీల జీవితాలు చిత్రంగా ఉంటాయి. నెలకి నాలుగైదు వేలు వరకూ సంపాదిస్తారు. అయినా ఎప్పుడూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నట్టు కలిపిస్తారు. బరువైన పని చెయ్యటం వల్ల అలసి పోయిన శరీరం సేదతీరడానికి త్రాగి ఇంటికెళతారు. తీరిక సమయంలో పులి మేక వంటి జూదాలు ఆడతారు. వాటికి కోసం అప్పులు చేసి వాటికి వడ్డీలు కడతారు. ఒక్కక్కరికి గంపెడు సంసారం ఉంటుంది. వ్యసనాలు లేని కొద్దిమంది వడ్డీ వ్యాపారం చేస్తారు.
    రోజుకి మూడు షిఫ్టులుగా పని జరుగుతుంది. ఒక్కొక్క షిఫ్టులో పనికాలం ఎనిమిది గంటలు. గోడౌన్స్ లో మొత్తం పదిహేను గ్యాంగులు ఉన్నాయి. ఒక్కొక్క గ్యాంగుకి ఇరవైమంది కూలీలు ఉంటారు. ప్రతి కూలీకి వారంలో ఒకరోజు శెలవు. గ్యాంగుకి మేస్త్రీ ఒకతను ఉంటాడు. అతని ఆధ్వర్యంలో కూలీలు పనిచేస్తారు.

                                                                                    3
    ఉదయం తొమ్మిది గంటలకు టూ టౌన్ పోలీసు స్టేషన్ బస్ స్టాప్ లో ఆగిందో సిటీ బస్సు. జనంలేని ఆ బస్సులోంచి శివరావు క్రిందకు దిగాడు. బస్సు వెళ్లేవరకూ ఆగి రోడ్డుపైన కనిపిస్తున్న షర్టు గుండీ అందుకుని జేబులో వేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ వైపు నడిచాడు.
    స్టేషన్ లోపల గుమ్మం దగ్గర స్టూలుమీద కూర్చుని ఉన్నాడు సెంట్రీ. సివరావుని చూసి అతను పలకరింపుగా నవ్వాడు.
    "మా వాడు ఉన్నాడా?" సెంట్రీని అడిగాడు శివరావు.
    అతను తలూపాడు.
    "ఏరోయ్! ప్రొద్దునే ప్రత్యక్షమయ్యావ్?" శివరావుని గమనించి నవ్వుతూ అన్నాడు రైటర్ సీటులో కూర్చున్న స్నేహితుడు.
    "మార్నింగ్ షో కి వెళదామని వచ్చాను...."చెప్పాడు కూర్చుని.
    అతను చిన్నగా నవ్వాడు. పెన్ కి క్యాప్ పెట్టేసి టేబుల్ మీద పడేసి అన్నాడు.
    "రా, టీ త్రాగొద్దాం....."
    శివరావు గుండుసూది ఒకటి అందుకుని గుండీ ఊడిపోయినచోట పెట్టుకున్నాడు. ఇద్దరు బయటకొచ్చారు. ప్రక్కనే ఉన్న టీ కొట్టుకి వెళ్ళి టీ తీసుకున్నారు.
    ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఉద్యోగాలు వేరైనా వారానికి రెండు మూడు సార్లు కలుసుకుంటారు. అతను సిటీలో ఏ స్టేషన్ కి ట్రాన్స్ ఫర్ అయినా వాళ్ళ కార్యక్రమంలో మాత్రం మార్పుండదు. అతను ఒక్కడే శివరావుకి చెప్పుకోతగ్గ స్నేహితుడు.
    "రాత్రి తోమిదికి రూం కి రా....." చెప్పాడతను.
    "సినిమాకి రావా?" అడిగాడు శివరావు.
    "కుదర్దు, పనుంది...."
    ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ టీ త్రాగారు. శివరావు ఓ అరగంట అక్కడా గడిపి తిన్నగా థియేటర్ కి వెళ్ళాడు. బుకింగ్ ముందు పెద్ద క్యూ చూడగానే అతను ఆలోచనలో పడ్డాడు.
    ఆ జనంలో టిక్కెట్ సంపాదించడం అసాధ్యమని అర్ధమయింది. లోపలకు నడిచి అద్దాల్లో పెట్టిన స్టిల్స్ చూడసాగేడు. కొద్దిసేపు అలా చూసి బయటకొస్తుండగా, "ఎవరైనా టిక్కెట్ ఇస్తే బాగుండును...." అని ఓ యువకుడు అనటం శివరావుకి వినిపించింది. ఆ యువకుడ్ని పరీక్షగా చూసి శివరావు అడిగాడు.
    "మీకు టిక్కెట్ కావాలా?"
    ఆ యువకుడు శివరావు వంక చూశాడు. అతనిలో ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. అలాంటి వ్యక్తులు థియేటర్ల వద్ద బ్లాక్ లో టిక్కెట్లు అమ్మడం క్రొత్తేమీ కాదు.
    "ఎంత?" అడిగాడతను.
    "ఎంతేమిటి?" శివరావు ఆశ్చర్యంగా ప్రశ్నించాడు.
    "అదే, టిక్కెట్ ఎంతకిస్తారు?"
    శివరావు పెదవులపైన చిరునవ్వు చోటు చేసుకుంది.
    "మీకు టిక్కెట్ కావాలా అని అడిగాను తప్పితే నా దగ్గర టిక్కెట్ ఉందని దానిని మీకు అమ్ముతానని నేను అనలేదు...."
    ఆ యువకుడు విస్తుపోయాడు. అతని దగ్గర టిక్కెట్ లేకపోతే, కావాలా, అని ఎందుకడిగినట్టు? అదే అడిగాడు శివరావుని.
    "మీకు టిక్కెట్ కావాలంటే ప్రయత్నిస్తాను..."
    "ఇప్పుడెలా దొరుకుతుంది?"
    "నాతోరండి చెబుతాను..." అని బయటకు నడిచాడు శివరావు. ఆ యువకుడు అతన్ని అనుసరించాడు. ఇద్దరూ రోడ్డు దాటి అవతలికి వెళ్ళారు.
    శివరావు పబ్లిక్ టెలిఫోన్ బూతులోకి వెళ్ళి ఒక నెంబరు తిప్పాడు. అటువైపు రిసీవర్ ఎత్తిన శబ్దం విని చేతిలోని నాణేన్ని బాక్స్ లో వేశాడు.
    "జగదాంబ థియేటర్?" అడిగాడు, ఎదురుగా కనిపిస్తున్న ఆ థియేటర్ వైపు చూసి.
    "...................."
    "టూ టౌన్ సబ్ యిన్ స్పెక్టర్ని మాట్లాడుతున్నాను...."
    ".............."
    "మార్నింగ్ షోకి రెండు టిక్కెట్లు కావాలి...."
    "..............."
    "ఇద్దర్ని మీ దగ్గరకు పంపుతాను. వాళ్ళు నా పేరు చెబుతారు. టిక్కెట్లు ఇచ్చేయండి..." అని రిసీవర్ పెట్టేశాడు శివరావు.
    ఆ యువకుడు తనవైపు కంగారుగా చూడటం గమనించి చిన్నగా నవ్వి అన్నాడు.
    "పదండి, టైమ్ అవుతోంది....."
    ఇద్దరూ తిరిగి రోడ్డు దాటి థియేటర్ లోకి వచ్చారు. మేనేజర్ రూమ్ తలుపు మూసి ఉండటంతో తట్టాడు. అది తెరుచుకుంది.
    "టూ టౌన్ యస్సైగారు పంపారు." చెప్పాడు శివరావు.
    అతను రెండు టిక్కెట్లు ఇచ్చాడు. శివరావు వాటికి  డబ్బులు చెల్లించాడు. ఆ యువకుడ్ని తీసుకుని హాలులోకి ప్రవేశించాడు. ఇద్దరూ చెరో సీటులో కూర్చున్నారు.
    "మీ పేరు?" అడిగాడు శివరావు.
    "రామకృష్ణ."
                                                            *      *      *      *
    రూమ్ కి తాళంవేసి రోడ్డు మీదకు వచ్చాడు రామకృష్ణ. సాయంకాలం అయితే చాలు వీధులు జనంతో హడావిడిగా ఉంటాయి. సినిమాహాళ్ళ  దగ్గర ఇసుకవేస్తే రాలనట్లు ఉంటారు జనం. సిటీ బస్సుల్లో ప్రయాణం ఇబ్బందిగా ఉంటుంది. అయినా కూడా ఇరవై కిలోమీటర్ల దూరం నుండి సినిమాకొస్తారు. జీవితంలో బ్రతకడానికి ఎంతో శ్రమపడే మనిషి, సినిమా చూడటానికి అంతకంటే ఎక్కువగా శ్రమపడుతున్నాడు.
    రామకృష్ణ ఆలోచిస్తూ నడుస్తున్నాడు. పావుగంట తరువాత పాత పోస్టాఫీసు వద్దనున్న సిటీబస్సు కంట్రోలు రూమ్ చేరుకున్నాడు. రోడ్డు ప్రక్కన సిటీ బస్సులు నిలబడి ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు కంట్రోలు రూము ముందున్న బల్లపైన కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. కొంతమంది టీ దుకాణాల దగ్గర, కిళ్ళీషాపుల దగ్గర ఉన్నారు. కంట్రోలర్ తలొంచుకుని ఏదో రాస్తున్నాడు.
    "ఎక్స్ క్యూజ్ మీ...."
    కంట్రోలర్ తలెత్తాడు. ప్రపంచంలోని విసుగంతా అతని మొహంలోనే గూడుకట్టినట్టుంది.
    "ఈ నెల నాలుగవతేదీ మధ్యాహ్నం రెండున్నరకి పాతపోస్టాఫీసు నుండి గాజువాక వెళ్ళిన పార్టీటూ సిటీబస్సు కండక్టర్ పేరు చెప్పగలరా?" అడిగాడు.
    "దేనికి?"
    "కొత్త రోడ్డు దగ్గిర ఆ బస్సు ఎక్కుతూ నా సర్టిఫికెట్లు ఒకతని కిచ్చాను. అతను వాటిని కండక్టర్ కిచ్చాడేమో తెలుసుకోవాలి....."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS