"ఈరోజు కాకపోతే రేపు ప్రచురించవచ్చు".
"ఏమో! రేపు మీ పత్రిక రాకపోవచ్చు"
లోహియా మొహంలో నవ్వు మాయమైంది. "ఎలా ఆగిపోతుంది?" అనడిగాడు.
"ఫైర్ ఆక్సిడెంట్ జరగవచ్చు. లేబర్ స్ట్రయిక్ జరగవచ్చు" అంటూ అతడు లేచాడు. "లేకపోతే లోహియా మరణానికి సంతాపసూచకంగా ఒకరోజుపాటు పత్రిక ఆగిపోవచ్చు" అన్నాడు.
లోహియా బిగ్గరగా నవ్వి "గుడ్, గుడ్" అన్నాడు. "అందుకే నువ్వంటే నాకిష్టం. మీ నాన్న నిన్ను సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. నా దగ్గిరకి వచ్చేయకూడదూ. మీనాన్నయితే ఏముంది? రాష్ట్ర స్థాయే. నాతో అయితే దేశమంతా నీపేరు మార్మోగేలా చేస్తాను".
"మిస్టర్ లోహియా! ఇదంతా ఆప్యాయత అని నమ్మటానికి నేను భరత్ ని కాను. సమయం దొరికితే నన్ను ఖండ ఖండాలుగా నరికి పోగులు పెట్టటానికి మీరు వెనక్కి తగ్గరని నాకు తెలుసు. అలాగే మా నాన్న తరఫున మిమ్మల్ని సర్వనాశనం చేయటానికి నేను ప్రతిక్షణం ఆలోచిస్తూ వుంటానని మీకూ తెలుసు. మనం ఇక ఈ హిపోక్రసీ మానేసి అసలు విషయానికి వద్దామా".
లోహియా వెంటనే మాట్లాడలేదు. అతి కష్టంమీద తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడని స్పష్టంగా తెలుస్తూంది. కాసేపటికి "వెల్" అన్నాడు. "ఆ ఫోటోలు నెగిటివ్ లతో సహా తిరిగి ఇచ్చేయటానికి నా షరతుగ నేను 'నిన్ను శాశ్వతంగా కావాలన్నాన' నుకో మీ నాన్న ఏమంటాడు?"
అతడు కూర్చుంటూ తాపీగా సిగార్ వెలిగించి "కూతురి ఫోటోలు మీ పత్రికలో వేసుకోండి అంటాడు. కావాలంటే మరిన్ని న్యూడ్ ఫోటోలు విదేశీ పత్రికలకి కూడా పంపమంటాడు" అన్నాడు.
"అంతేకానీ నిన్ను వదులుకోడంటావ్... కరెక్ట్! కరెక్టుగా చెప్పావ్".
"ఈ మాత్రం మీరు ఆలోచించి వుండరని నేననుకోను కాబట్టి అసలు విషయం చెప్పండి".
కొంచెంసేపు నిశ్శబ్దం. లోహియా లేచి వచ్చి అతడి పక్కన సోఫాలో కూర్చుంటూ "సరే, అసలు విషయానికి వద్దాం" అన్నాడు.
"నీకు తెలుసుకదా, కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య సంబంధాలు అసలు బాగాలేవని, మన ముఖ్యమంత్రయితే కేంద్రంలో వున్న పార్టీని తిట్టటం మానేసి, కేంద్ర ప్రభుత్వాన్నే ఏకంగా తిడుతున్నాడు".
"మిస్టర్ లోహియా! హిపోక్రటిక్ గా మాట్లాడవద్దని నేను ముందే చెప్పాను. అయిదు రూపాయలు లాభం వస్తుందంటే మీరు దేశం కాదు కదా, ప్రపంచ విచ్చిన్నానికి కూడా వెనుదీయరన్న సంగతి నాకు తెలుసు. నాకేకాదు ఆ విషయం మీకూ తెలుసు. కాబట్టి ఉపోద్ఘాతం మానెయ్యండి".
"సరిగ్గా చెప్పావ్" అంటూ లేచి ఒక ఫైలు తీసుకుని అతడి దగ్గిరకి వచ్చి తిరిగి కూర్చున్నాడు. "ఇట్సాల్ బిజినెస్! నీకు హత్యలు చేయటం ఎలా బిజినెస్సో, మాకు రాజకీయాలు అలా బిజినెస్. నువ్వన్నట్టు ఇట్సాల్ బిజినెస్".
అతడు తలూపుతూ క్లుప్తంగా, "రాజకీయాల్ని హత్యలతో పోల్చటం నాకు సంతోషంగా వుంది" అన్నాడు.
లోహియా ఆ మాటలు విననట్టు నటిస్తూ ఫైలు విప్పాడు. విప్పుతూ అన్నాడు. "నీకు తెలియనిదేముంది. ఈ పార్టీని ఎలాగైనా అధికారంలో నుంచి పడగొట్టటం మా ఆశయం! అది తీరేవరకూ విశ్రమించం. అందుకు ముఖ్యంత్రి ఏం తప్పు చేస్తాడా అని వేచి వున్నాం ఇంతకాలం. ప్రజలకి మరీ మేలు చేయాలన్న తపన ఇతడిది. సరిగ్గా దాన్నే కాష్ చేసుకోవాలనుకుంటున్నాము".
అతడు వింటున్నాడు.
"కొన్ని రోజుల క్రితం ఒక సభలో మాట్లాడుతూ, డాక్టర్లు మరింత శ్రద్ధతో పనిచేస్తే సామాన్య ప్రజానీకం సగం మంది రోగాల నుంచి బయటపడతారని ఒక మాట అన్నాడు. అతడే ఉద్దేశ్యంతో అన్నా ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బంబాట్ చేశాయి. డాక్టర్లు ఈ స్టేట్ మెంట్ కి సర్వత్రా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద చాలా గొడవ జరిగింది. అదంతా పేపర్లో చదివే వుంటావ్".
"అవును. 'మీ' పేపరుతో పడినదంతా చదివాను" అక్షరాన్ని వత్తుతూ అన్నాడు.
"దీని నుంచి బయటపడటానికి అతడు చాలా కష్టపడవలసి వచ్చింది. ఇదిగో ఇక్కడే మేము ట్రిక్ ప్లే చేశాము" అంటూ లోహియా నవ్వాడు. "మన ముఖ్యమంత్రి లంచగొండి కాదు. కానీ అందరినీ తనలా వుండమని శాసించలేడు కదా. అతడికి కావలసిన ఒక ముఖ్యమైన వ్యక్తిని మేము కోనేశాము. మీ తెలుగువాళ్ళు భారతం చదువుతారో లేదో నకు తెలీదు. ప్రతీవాళ్ళూ తప్పక చదవవలసింది 'శల్యసారధ్యం'. ఇతడి మాట విని- ఒక కమిటీని నియమించాడు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం గత అయిదు సంవత్సరాల్లో ఆస్పత్రుల్లో అవుట్ పేషంట్ల సంఖ్య మూడు రెట్లయింది. ఈ విషయం అసెంబ్లీలో ప్రకటించి, తను అంతకుముందు సభలో చెప్పిన వ్యాఖ్యని సమర్ధించుకుంటున్నాడు ముఖ్యమంత్రి. కానీ ఇక్కడే సరిగ్గా మా వలలో పడ్డాడు" రాయల్ సెల్యూట్ గ్లాసులో వంపుకుంటూ అతను కొనసాగించాడు.
"ప్రజల అనారోగ్యానికి కారణం పాలక పక్షమే అన్న ఒక అనూహ్యమయిన విషయాన్ని లిమ్నాలజీ డిపార్ట్ మెంట్ బైటపెట్టింది. వాళ్ళు చెప్పిందే నిజమై ప్రభుత్వం గానీ ఏ చర్యా తీసుకోకపోతే, హైదరాబాద్ లో యాభై సంవత్సరాల తరువాత మనిషంటూ మిగలడు".
వింటున్న అతడు ఉలిక్కిపడ్డాడు.
లోహియా ఫైలు ముందుకు తోస్తూ చెప్పాడు.
"హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ కి ఒక సంవత్సరం పాటూ వచ్చిన రోగుల్ని పరిశీలిస్తే, అందులో 90 శాతం ఈ క్రింది వ్యాధుల్తో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చారు. టైఫాయిడ్... కలరా... డయేరియా... మలేరియా... ఫైలేరియా.. వీటన్నిటికీ కారణం ఒకటే...నీళ్ళు! విజయవాడలో అయితే జాండిస్! తెలంగాణాలో అయితే ఫ్లోరోసిస్!! సంవత్సరం మీద సంవత్సరం ఈ రేటు దారుణంగా పెరిగిపోతోంది. యుద్ధ ప్రాతిపాదిక మీద దీన్ని ఎదుర్కోకపోతే మనుష్యులు- ముఖ్యంగా బీదవాళ్ళు నల్లుల్లా మాడిపోతారు..." ఇలా వుంది ఆ రిపోర్టు. ఇదంతా చూసి మన ముఖ్యమంత్రికి హృదయం ద్రవించింది. ఎంత ఖర్చు అయినాసరే తన ఆంధ్రుల్ని రక్షించుకుంటానని నిండుసభలో వాగ్దానం చేశాడు. ఈ సమస్యని కూలంకషంగా పరిశీలించటం కోసం అమెరికా నుంచి డాక్టర్ ఫాస్టస్ ని పిలిపించాడు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో అతడు మన ప్రభుత్వానికి సలహా ఇస్తాడన్నమాట" అంటూ లోహియా లేచాడు. కిటికీ దగ్గిరకి వెళ్ళి బయట చీకటిలోకి చూస్తూ తాపీగా అన్నాడు.
"ఇక్కణ్నుంచే నీ పని ప్రారంభం అవుతుంది! అతడు మన ప్రభుత్వానికి వారం రోజులు అతిధిగా వుండి ఇచ్చే రిపోర్టులకి బదులు ఇదిగో ఈ ఫాల్సు రిపోర్టు ప్రభుత్వానికి చేరాలి" అంటూ వెనక్కి వచ్చి కవరు అతడి ముందుకు తోశాడు.
అతడు దాన్ని అందుకోకుండా "ఇందులో ఏముంది?" అన్నాడు.
"ఈ నీటిలో డి-ఆలమ్ ఒక రకమైన పటిక. చాలా ఖరీదైనది కలపటం ఒక్కటే దీనికి పరిష్కారం అని చెప్పే రిపోర్టు ఇది. దీన్ని మేము తయారు చేశాము".
"కానీ డి-అలమ్ నీటిని కొంతవరకే శుభ్రపరుస్తుంది తప్ప పూర్తిగా కాదే...."
