అతను నవ్వాడు.
ఆమెకూడా నవ్వింది.
"మీ పెళ్ళి త్వరగా చేసుకుని ఇద్దరూ కలిసి యింటికి రండి యేం."
"అలాగే"
అంబిక చెప్పి ఫోన్ పెట్టేసింది.
అతను క్షణంసేపు ఆలోచనల్లో పడిపోయాడు.
అంతకుముందు ఇంద్రసేన తనతో మంచిగా మాట్లాడినట్టు నటించింది.
అది నటన అని అప్పుడే గ్రహింపు అయిపోయింది.
కాని ఇప్పుడు!
నటన కాదు అని తెలుస్తుంది.
అతనికి మనసు అంతా సంతోషంగా అనిపించసాగింది.
తను కోరుకునేది అదే.
ఆమె తనని మనసారా ఇష్టపడి పెళ్ళి చేసుకోవాలని.
అదే ఇప్పుడు జరగబోతుంది.
ఇంద్రసేన తనని పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఇది ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి.
ఇన్నిరోజులు ఆమె తను అంటే అయిష్టత చూపించింది.
ఇప్పుడు మనిషి పూర్తిగా మారిపోయింది.
అంతలో ఒక ఆమె అక్కడికి వచ్చి-
"ఏమండీ" అంటూ పిలిచింది.
ఏమిటి అంటూ చూశాడు ఆమెవైపు.
ఇంద్రసేనగారు భోజనం చెయ్యటంలేదు.
"ఎందుకట!"
"ఏమోనండి నాకు తెలీదు. ఎంత బ్రతిమాలినా తిననుగాక తినను అని మొండికేసి పడుకున్నారు."
అతని కనుబొమ్మలు ప్రశ్నార్ధకంగా ముడుచుకున్నాయి.
"సరే నువ్వు వెళ్ళు నేను వచ్చి కనుక్కుంటాను" అంటూ చెప్పి ఆమెను అక్కడనుండి పంపించేశాడు.
ఆమె అలా చెప్పి వెళ్ళిపోయాక ఆలోచనల్లో పడ్డాడు. మళ్ళ ఏమిటి
ఈ అమ్మాయికి తిక్కా ఏమిటి!
కొంతసేపు కోపంగా ఉంటుంది.
మరికొంతసేపు శాంతంగా ఉంటుంది. ఏమిటి కథ!
ఆలోచిస్తూ అనుకున్నాడు.
తొందర పడకూడదు.
విషయం ఏమిటో నెమ్మదిగా అడిగి తెలుసుకోవాలి అనుకుంటూ అక్కడినుండి ఇంద్రసేన గదివైపుగా వెళ్ళాడు.
తలుపులు మూసి ఉన్నాయి.
తలుపు తట్టాడు.
చాలాసేపు తరువాతగాని తలుపు తియ్యలేదు.
తలుపు తెరిచింది.
కృష్ణమౌళి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె కూడా క్షణంసేపు అలాగే చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయి అక్కడ సోఫాలో కూర్చుంది అటుతిరిగి.
అతనికి అర్ధంకాలేదు.
ఆమె మళ్ళి ఎందుకు కోపం వచ్చిందో.
తన పేరు కృష్ణుడు అయినందుకు-
ఆ సత్యభామాదేవిని బ్రతిమాలుకోవాలి కాబోలు మనసులో నవ్వుకుంటూ.
ఆమె దగ్గరగా వెళ్ళాడు.
అక్కడ వేజ్ లో ఫ్లవర్స్ పెట్టి ఉన్నాయి.
ఒక్క గులాబి తీసి వెనకపాటుగా వెళ్ళి తలలో పెట్టి భుజాలపై చేతులువేసి,
"ఇందూ!" లాలనగా పిలిచాడు.
ఛర్రున తలతిప్పి చూసింది.
అతను అలా ఉండిపోయాడు.
తలలో పెట్టిన గులాబీ పీకేసి విసిరికొట్టింది.
చిర్రునలేచి నిలబడి విసురుగా చెప్పింది.
"ఏమిటి ఈ అతి చనువు!" మండి పడుతూ అంది.
"ఊరుకుంటున్న కొద్దీ మితిమీరి పోతున్నారు"
"ఇందూ" అన్నాడు అయోమయంగా చూస్తూ.
"ఛీ నన్ను అలా పిలవకండి. నా పేరు ఇంద్రసేన. ఇందూ అని పిలిచే అధికారం మీకు లేదు"
"నాకు లేదా ఆ హక్కు" సూటిగా అడిగాడు.
"లేదు ఆ హక్కు నా భర్త ఒక్కడికే ఉంది."
అంది పొగరుగా తల ఎగరేస్తూ.
"ఇందూ" ఆమె చెయ్యిపట్టి ఒక్క గుంజు గుంజి దగ్గరకు లాక్కున్నాడు.
"మళ్ళీ అను"
"ముందు చెయ్యి వదలండి" కోపంగా అంది అతని చేతిని విడిపించుకోవడానికి చూస్తూ.
"నేను వదలను నీ నోటితో నేను నీ భర్తని అని అనిపించేంత వరకూ వదలను చెప్పు ఏమన్నావు!"
"మీరు అంటే నాకు ఏం భయమా!" అంది కోపంగా.
"భయంలేదు కదా చెప్పు!"
"నా భర్త ఒక్కడికే నన్ను ఇందూ అని పిలిచే హక్కు, అధికారం ఉందన్నాను" నిర్లక్ష్యంగా చెప్పింది.
"నేను నీ భర్తని కానా!" సూటిగా ప్రశ్నించాడు వస్తున్న కోపాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ.
"కాదు. మిమ్మల్ని నేను పెళ్ళిచేసుకోవటమా!" అంటూ అదోలా నవ్వింది.
ఆ నవ్వులో హేళన తొంగిచూసింది.
"ఏం?" కోపంగా అడిగాడు.
"నేను మిమ్మల్ని పెళ్ళిచేసుకుంటూ ఈ ఊరుఊరంతా ఈ ప్రపంచం అంతా విరగబడి నవ్వి తిరగబడి పోతుంది."
"ఏం అంత ఆశ్చర్యం!" అతనికి ఆ క్షణంలో ఇంద్రసేన అంటే కోపమేకాదు చిరాకుకూడా అనిపించింది.
"ఆశ్చర్యం కాదా! అంతస్తులు మరిచి పెళ్ళి అంటుంటే."
"ఏం అంతస్తులతో అడ్డుగోడలు కడుతున్నావా!"
"నేను కట్టనవసరం లేదు! ఆ అడ్డుగోడలు మన మధ్య ఎప్పుడూ ఉండనే ఉన్నాయి మీకు నాకు చస్తే పెళ్ళి జరగదు."
"కారణం!" సూటిగా ప్రశ్నించాడు కోపాన్ని ఆపుకుంటూ.
"మీరు మా వంటమనిషి కొడుకు కావటమే" అంది కక్షగా, కసిగా.
