Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 57


    "ఆ"


    "ఆ నువ్వు ఎంత కాదనుకున్నా ఒక్కో మగవాడి చూపులు ఒక్కో స్త్రీ మీద అయస్కాంతంలా పనిచేస్తాయి. అలాగే నువ్వునూ."


    "కాదు కాదు" ఆమె మనసు ఒప్పుకోలేదు.


    "ఏమిటి కాదు? నిన్నటివరకూ అతను అంటే మండిపడే నువ్వు ఈ రోజు అతన్ని చూస్తూనే అతని మాటలు వింటూనే మంచుముక్కలా కరిగిపోయావు. నీ కోపమంతా మాయమయిపోయింది. అతని అందానికి అతనిలో ఆకర్షణకి లొంగిపోతున్నావు" అంది హేళనగా అంతరాత్మ.


    "లేదు లేదు అతని అందానికి, అతనిలో ఆకర్షణకి నేను లొంగిపోలేదు" అంది ఉక్రోషంగా.


    "అయితే నువ్వు ఏం ఆలోచించుకున్నావు!"


    "ఏ విషయంలో!" ఎదురు ప్రశ్న వేసింది.


    "అదే నీ పెళ్ళి విషయంలో నీకు ఇష్టం లేకపోయినా నిన్ను బలవంతంగా నైనా పెళ్ళి చేసుకుంటానని శపధం చేస్తుంటేను"


    "నన్నా బలవంతంగా పెళ్ళి చేసుకుంటాడా! వట్టిమాట."


    "అతడు మగవాడు సహజంగా బలవంతుడు. నిన్ను నీ యిష్టం లేకుండా పెళ్ళి చేసుకోవచ్చు. అప్పుడు నువ్వు ఏం చేస్తావు!"


    "నా కంఠంలో ప్రాణం ఉండగా అతనిచేత నేను తాళి కట్టించుకోను అతనికి భార్యని కాను" అంది ఖచ్చితంగా చెప్పేస్తు.


    అంతరాత్మ మళ్ళీ ఫక్కున నవ్వింది.


    "మళ్ళీ నవ్వుతున్నావు ఎందుకు!"


    "ఎందుకా? నీ మాటలు ఎంత నిజమో చూడనా అని"


    "లేదు లేదు నిజంగానే చెపుతున్నాను అతను అంటే నాకు ఎప్పుడూ ఇష్టంలేదు."


    "ఇష్టంలేదా?"


    "ఉహూ నాకు ఇష్టంలేదు."


    "నీకు ఇష్టం లేనప్పుడు యిదేమటమీద నిలబడి వుండు."


    ఆమె మాట్లాడలేదు.


    "అతను ఎంత ప్రేమగా మాట్లాడి నిన్ను కవ్వించినా కరిగిపోవద్దు"


    "ఏ మాటకు మెత్తబడిపోవద్దు"


    ఇందూ ఆలోచనల్లో పడిపోయింది.


    "అతను పెళ్ళిమాట ఎత్తితే ముఖం తిరిగినట్టు సమాధానం చెప్పు."


    "స్త్రీ ఎంత కటువుగా మాట్లాడుతుందో మగవాడు అప్పుడే పిరికివాడిగా మారిపోతాడు."


    నా మాటలు గుర్తువున్నాయా!


    ఉన్నాయి అన్నట్టు తల వూపింది.


    అంతరాత్మ మరిక ఏం మాట్లాడలేదు.


    ఇందూ అలా కూర్చుండిపోయింది.


    తన పౌరుషం అంతా ఏమయిపోయింది.


    తన కోపం, ఆవేశం ఏమయ్యాయి?


    అతని మాటలకు తను ఎందుకు తలవంచింది. ఆమె మనసు నాగు పాములా బుసలు కొట్టింది.


    తను తలవంచిందా!


    అంతా అబద్ధం.


    అతను మాట్లాడుతుంటే ఆలోచనల్లో పడిపోయింది.


    అంతేగాని అతను అంటే ఇష్టం ఉందా! ఛ ఛ ఏం కాదు.


    అతను వస్తే చెపుతుంది తను.


    పళ్ళు పటపటలాడించింది.


    ముఖం అంతా ఎర్రగా కందిపోయింది.


                                      *    *    *        


    కృష్ణమౌళి అంబికకు ఉత్సాహంగా ఫోన్ చేసి చెప్పాడు.


    "ఏమిటి మీరు ఇంత ఉత్సాహంగా ఉన్నారు" అడిగింది అంబిక నవ్వుతూ.


    "మరి ఏమిటి అనుకున్నావు ఇందులో చాలా మార్పువచ్చింది."


    "ఏమిటి నిజమా!"


    "అవును మనిషిలో చాలా మార్పు వచ్చింది. కోపం అనే మాట మచ్చుకి లేదు. నేను నీతో ఫోన్ లో మాట్లాడిన తరువాత లక్ష్మీనారాయణగారి దంపతులకి కబురుచేసి విషయం చెప్పి ఆమెకు నచ్చెచెప్పమన్నాను"


    "కాని ఇందూ చాలా పెంకిది కావటంవలన వాళ్ళు ఏమాత్రం ఆమెను మార్చలేకపోయారు"


    "నువ్వు చెప్పినట్టుగా నేను మరోసారి ప్రయత్నించాను ఏమో ఎలా ఉంటుందో అనుకున్నాను. ఆశ్చర్యం ఆమెలో మార్పు వచ్చింది. నేను చెప్పే ప్రతీమాట శాంతంగా వింది. నేను అంటే ఆమె ఇష్టపడింది అనేకదా అర్ధం."


    "నిజమే" అంది అంబిక.


    "నీకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేశాను"


    "చాలా మంచివార్త చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే ఇక మనకి ఏ గొడవా ఉండదు మా వారు, మామగారు అందరూ సర్దుకుపోతారు. అందరికీ సంతోషమే అవుతుంది."


    "నిజమే అంబికా" అతను ఒప్పుకున్నాడు.


    "కాని ఒక్క విషయం గుర్తు వుంచుకోండి యింటికివెళ్ళి పెద్దవాళ్ళకి చెప్పి పెళ్ళి చేసుకుందాం" అని అంటుంది.


    "మీరు మాత్రం అందుకు ఒప్పుకోకండి. పెళ్ళిచేసుకుని వెళదామని చెప్పండి."


    "అలాగే నువ్వు చెప్పినట్టే చేస్తాను."


    "అయితే నేను ఉంటాను."


    "ఆ"


    "పెళ్ళికి ముహూర్తం పెట్టించేసి త్వరగా పెళ్ళి జరిగిపోయేలా చూడండి. మరీ ఎక్కువరోజులు ఇంద్రసేన రాకపోతే యింట్లోవాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళు ఇంకా ఆమె ఫ్రెండ్ యింటిలో ఉందనుకుంటున్నారు. ఉత్తరం కోసం చూస్తున్నారు. ఉత్తరం ఎందుకు వ్రాయలేదా అని."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS