ఆ మాటతో తలయెత్తి అతనివేపు చూసింది.
అతనిలో ఏదో మంత్రశక్తి ఉందనిపిస్తుంది ఒక్కోసారి. కృష్ణమౌళి చాలా అందమయినవాడు.
ఆ అందానికి తగిన హుందాతనం ఉంది.
బలమయిన అతని శరీరాకృతి అతనిలో ఆకర్షణ ఆ కళ్ళలో కొంటెతనం.
ఆ పెదవులపై చిరునవ్వు.
చూస్తే యే ఆడపిల్లయినా ఇట్టే అతని ఆకర్షణలో పడిపోతుంది.
తన మనసు ఇప్పుడు ఏమవుతుంది!
అతను అంటే కోపం రావటంలేదు, ఎందుకని?
అతని అందానికి, హుందాతనానికి తలవంచుతుందా?
అతని ఆకర్షణలో తను పడిపోతుందా!
ఏమిటి ఈ విచిత్రం!
అతను అంటే తనకి కోపం.
మౌళి మా అంటే పడదు.
ఇప్పుడు! ఇప్పుడు ఏమిటి! తన మనసు ఇలా అవుతుంది.
"ఇందూ! ఏమిటి ఆలోచిస్తున్నావు!" మృదువుగా అడిగాడు.
ఆమె మాట్లాడలేదు.
"ఇందూ నువ్వు నా ప్రాణం"
"ఎందుకో నువ్వు అంటే ఇష్టం ఏర్పడిపోయింది."
"నిన్ను వదులుకోలేక పోతున్నాను."
"నువ్వు నాకు కావాలి ఇందూ"
"నా ఒంటరితనం నీ రాకతో మాయమవ్వాలి"
"నా జీవితంలో వెన్నెల పంట పండాలి
"నా జీవితంలో నవ్వులు కురిపించాలి."
"తల్లిని పోగొట్టుకున్న నేను ఆ రోజు నుండి ఒంటరితనంతో అల్లాడిపోయాను"
"నువ్వు తల్లిగా భార్యగా నన్ను ఓదార్చి దగ్గరికి చేర్చుకోవాలి."
"అదే నా కోరిక ఇందూ అదే నా కోరిక."
"దయచేసి ఈరోజునుండి నామీద కోపాన్ని మర్చిపో నన్ను అర్ధం చేసుకో"
"ఇందూ నువ్వు లేకపోతే నేను ఉండలేను" అన్నాడు ప్రాధేయపడుతున్నట్టుగా.
ఆమె జవాబు ఇవ్వలేదు.
అతను మాట్లాడే ప్రతీమాట ప్రతీ అక్షరం వినసాగింది.
ఆమెలో మార్పు జాగ్రత్తగా గమనించసాగాడు.
ఆమెలో కోపంలేదు.
శాంతంగా ఉంది.
అతనిలో ఆశ తళుక్కుమంది.
ఆమెలో మార్పు వచ్చింది అని.
ఆమె అంత శాంతంగా నెమ్మదిగా ఉండటం ఎప్పుడూ చూడలేదు.
"ఇందూ ఆలోచించుకో బాగా ఆలోచించు నేను చెప్పిన దానిలో నిజం ఉందా! లేదా అని."
"ఈ పెళ్ళి జరిగిపోనీ."
"కాదనకు ఇందూ ఏదో మాట ఇవ్వు" అంటూ చెయ్యి చాపాడు.
ఆ చేతిలో చెయ్యి వెయ్యలేదు.
అతనివేపు అలా చూసింది క్షణంసేపు.
కృష్ణమౌళి కూడా అలాగే చూశాడు.
అతని చూపుల్లో ఆతృత ఏం జవాబు ఇస్తుందో అని.
ఆమె కళ్ళల్లో నేను ఒక నిర్ణయానికి ఏం రాలేదు. అప్పుడే ఏం చెప్పగలను అన్నట్టుంది భావం.
"ఆలోచించుకునే మాట ఇవ్వు వస్తాను" అంటూ ఆమె చేతిని చేతులోకి తీసుకుని పెదవులకి ఆనించుకున్నాడు.
ఇంద్రసేన చప్పున చెయ్యి లాక్కుంది.
అతను నవ్వాడు.
ఆ కళ్ళు కొంటెగా నవ్వాయి!
అతను వెళ్ళిపోయాడు.
ఇంద్రసేన అలా నిలబడిపోయింది. అతను వెళ్ళినవైపే చూస్తు.
మనసంతా విచిత్రంగా మారిపోతుంది అనుకుంది.
62
ఇంద్రసేన మనసు అంతా అదోలా అయిపోసాగింది.
తను ఏమిటి ఇలా అయిపోతుంది!
అతనిలో ఆకర్షణా శక్తి వుందా!
అతని మాటలు విన్న తరువాత ఆలోచిస్తుంటే జాలి అనిపిస్తుంది.
ఒంటరి తనంతో మనిషి కృంగిపోయాడా!
అంతలో అంతరాత్మ ఫక్కున నవ్వినట్టు అయింది.
"ఏమిటి! ఎందుకు నవ్వుతున్నావు" కంగారుగా ప్రశ్నించింది ఆమె మనసు.
"ఎందుకా! నువ్వు మారిపోతున్నందుకు"
"నేనా! మారిపోతున్నానా!"
"ఆ నువ్వే"
"ఉహూ నేనం మారలేదు, మారను" ఇందూ మనసు కంగారు పడిపోసాగింది.
"ఎందుకు మారలేదు, నువ్వు పూర్తిగా మారిపోయావు" అంది అంతరాత్మ.
