"కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి యిక్కడ మీకు భార్యలు ఎవరూలేరు"
"నువ్వు కావా!" ఆమెను కవ్వించినట్లే అడిగాడు.
"నేనా!"
ఆ అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు.
"మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి"
"ఇందూ" ఈసారి కాస్త గట్టిగానే అన్నాడు.
"మర్యాద మంచి మాకు పుట్టిననాడే అబ్బిన విద్యలు. ఎవరితో ఎంత మర్యాదగా ఉండాలో మాకు తెలుసు. ఒక్క తెలియనది నీకే"
"అంటే" రోషంగా చూసింది.
"అంటేనా! ఈ చిందులు ఈ గంతులు" అంటూ నవ్వాడు.
"మిస్టర్ మౌళి!" కోపం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అంది.
అతని ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది.
"నిన్ను యిక్కడికి తీసుకువచ్చింది ఎందుకో తెలుసా!" అడిగాడు.
ఆమె జవాబు యివ్వలేదు.
ముఖం తిప్పుకుంది.
ఆ విషయం నువ్వు నాకు పదే పదిసార్లు గుర్తు చెయ్యనవసరం లేదు అన్నట్లుంది,
ఆ ముఖం తిప్పుకోవటంలో అర్ధం.
"ఆ విషయం గురించి ఈరోజు నీతో ముఖాముఖీ అడిగేసి యేదో ఒక నిర్ణయం తీసుకోవాలని నిశ్చయించుకున్నాను"
తలతిప్పి సూటిగా నిర్లక్ష్యంగా చూసింది.
"పెళ్ళి అనేది నూరేళ్ళపంట. ఆలుమగలు ఇద్దరూ ఒకర్ని ఒకరు అర్ధంచేసుకుని అన్యోన్యంగా ఉంటే ఆ జంట కన్నులపంట"
"ఎవరికి కనులపంట! ఏ జంటకు నూరేళ్ళపంట!" ఒక్కో అక్షరం నొక్కి పలుకుతూ కక్షగా, కోపంగా అంది.
"అందరికి కన్నులపంట మన జంట"
"మన అని అనకండి. అదేమాట మీరు అనటం నేను పదే పదిసార్లు మిమ్మల్ని హెచ్చరించటం జరుగింది చాలాసార్లు. యిక మీరు ఆ మాట అంటే నేను ఒప్పుకునేది లేదు"
"నువ్వు ఒప్పుకుంటావా లేదా అని కాదు నా ఆలోచన నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనపెళ్ళి జరిగి తీరుతుంది" తాపీగా చెప్పాడు.
"నన్ను బంధించి పెళ్ళి చేసుకుంటారా! మీకు సిగ్గులేదూ?"
"సిగ్గా! ఎందుకు!!"
"ఎందుకా? మా అంతస్తుకు మీరు తగనివారు. మా నాన్నగారు మీకు యివ్వడానికి ఇష్టపడలేదు. అందుకు మీరు నన్ను మోసంచేసి తీసుకువచ్చి బంధించి పెళ్ళి చేసుకుంటాను అంటున్నందుకు."
"సిగ్గుపడవలసింది నేను కాదు. నువ్వు మీ నాన్న మాట ఇచ్చి తప్పినందుకు మీ నాన్న, అలాంటి తండ్రి కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి" అన్నాడు కోపంగా!
"మౌళీ!" కోపంగా అరిచింది.
"నువ్వు అరిచినంతలో ఇక్కడ ఎవ్వరూ జడిసిపోయేవాళ్ళు లేరు."
"నేను ఒకమాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, సూటిగా సమాధానం ఇస్తారా!"
"ఆహా" అన్నాడు.
"నేను ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలి!"
"మన పెళ్ళి జరిగేవరకు"
"జరగకపోతే."
"అని అనుకుంటున్నావా!"
తల ఊపింది అవును అన్నట్టు.
"తప్పకుండా జరిగి తీరుతుంది."
"జరగదు! జరగదు! నాకు ఇష్టంలేకుండా ఏదీ జరగదు" అంది రోషంగా.
కృష్ణమౌళి ఆమెవేపు పరిశీలనగా చూశాడు ఆ కళ్ళల్లో పొగరు.
కోపంతో ఉన్నప్పుడు కళ్ళు ఎర్రగా అవటమే కాకుండా ముక్క చివర ఎర్రగా కందటం చూశాడు అలా!
నిజంగా ఇందు చాలా అందమైనది.
అందాల రాశి
అపరంజి బొమ్మ.
కాని! కాని!
ఆమె స్వభావం మాత్రం...?
తండ్రి నోట్లోనుండి ఊడిపడినట్టే,
అత్తయ్య అంతమంచిది.
అత్తయ్య పోలిక ఎవ్వరికీ రాలేదు.
మౌళికి నవ్వు వచ్చింది.
దగ్గరగా వెళ్ళి ఆమె భుజాలపై చేతులు వేసి తనవేపుకి తిప్పుకున్నాడు.
రోషంగా చూసింది అతనివేపు.
"నువ్వు ఇప్పుడు ఎంత అందంగా వున్నావో తెలుసా!" అంటూ ఆమె కళ్ళలోకి చూసి నవ్వాడు.
ఇందూ కనురెప్పలు కిందకు వాలిపోయాయి.
ఆమె చెంపలు ఎర్రబడ్డాయి.
ఎందుకో ఆ క్షణంలో అతనివైపు కళ్ళెత్తి చూడలేకపోయింది.
"ఇందూ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం."
"ఆ యిష్టమును నువ్వు ఎందుకు గ్రహించవు!"
"నన్ను ఎందుకు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించవు!"
