తన గుండెల్లో ఒదిగిపోవాలని
ఎన్నో ఎన్నో అనుకుంటాడు.
నిజమే తనూ అలా అనుకున్నాడు.
అతనికి అంబిక గుర్తు వచ్చింది.
అంబిక తనని చాలా పిచ్చిగా ప్రేమించింది ఒకానొకప్పుడు!
తన మనసులో ప్రేమ లేదని చెప్పగానే ఆమె తట్టుకోలేకపోయింది.
మనసుని చంపుకుని జయరాంని పెళ్ళి చేసుకుంది.
అతనితో కలిసి కాపురం చేస్తుంది.
అంబిక మనసుని తనకు తెలీకుండానే కవ్వించాడు. ఆశలు రేకెత్తించాడు, ఊరించాడు.
చివరకు బాధపెట్టాడు.
దుఃఖపెట్టాడు.
అలా అని తనకు తెలీదు.
తల్లిమాట మనసులో పెట్టుకుని అంబికకోసం వెతికాడు.
గాలించాడు.
చివరకు ఆమెను కలుసుకున్నాడు.
ఆమె మనసులో కోరిక తెలుసుకున్నాడు.
మనసారా సంతోషించాడు.
అంబికను డాక్టర్ చదివించాడు.
తను చదివించినందుకు గాను మాట నిలబెట్టి శ్రద్ధగా చదువుకుంది.
ఈనాడు, పెద్ద పేరుమోసిన డాక్టరు అయింది. వరసకి తనకి అంబిక చెల్లెలు అవుతుంది. లేకుంటే!
అంబికలాంటి వేరే ఏ స్త్రీ అయినా మనసారా కోరుకుని ప్రేమించి తన జీవితంలోకి ప్రవేశిస్తే.
తను ఇన్ని రోజులు ఒంటరితనాన్ని అనుభవిస్తూ బాధపడ్డాడు.
ఆ బాధ అంతా చిటికెలో కరిగిపోయి మనసు అంతా సంతోషంతో నింపేసాడు.
కృష్ణమౌళి ఆలోచిస్తూ బాధపడసాగాడు.
ఇంద్రసేన మెడలో బలవంతంగా మూడు ముళ్ళు వెయ్యటం సులభమే కాని...!
ఆమె తను అంటే అసహ్యంచుకోదా! లేక అంబిక చెప్పినట్లు తాళి మెడలో పడిపోయిన మరుక్షణం ఎంత పెంకి ఘటం అమ్మాయి అయినా మన్నుతిన్న పాములా పడి వుంటుందా!
నిజమా!
ఇప్పుడు తను ఏం చెయ్యాలి!
ఎన్నిరోజులు ఇలా ఆలోచించినా
ఈ ఆలోచనలకి ఇక రూపం ఏర్పడటం లేదు. ఇందులో మార్పు లేదు.
ఆ మొండితనం, పెంకితనం పోవటంలేదు.
కృష్ణమౌళికి ఆలోచిస్తుంటే మతి పోతుంది. తల్లిమాటలు గుర్తుకు రాసాగాయి.
ఒక్కోసారి అనిపిస్తుంది.
మనసులేని ఇందూని వివాహం చేసుకునే కంటే ఆమె మాట మర్చిపోయి వేరే అమ్మాయిని అయినా వివాహం చేసుకుంటే!
అతనికి శంకర్ లీల గుర్తుకువచ్చారు.
లీల పెద్ద అందమయినది కాదు.
తను అంటే ఆమెకు ప్రాణం.
శంకర్ కి లీలను తనకు ఇచ్చి పెళ్ళి చేయాలి అని చాలా కోరికగా ఉండేది.
అప్పటికి ఎప్పటికీ కూడా
లీలకు ఇంకా పెళ్ళికాలేదు కూడా.
శంకర్ కి తను వైజాగ్ ఏపని మీద వచ్చిందో తెలీదు.
అతనికి తను చెప్పలేదు కూడా.
తను కనిపిస్తే లీల కళ్ళల్లో కాంతి తళుక్కుమంటుంది.
ఇంద్రసేన కళ్ళల్లో!
స్త్రీకి ఉండవలసిన సున్నితమైన భావం ఆమెలో అసలు లేదు.
ఆమెని పెళ్ళి చేసుకోవటం మానేయాలని చాలాసార్లు అనుకున్నా తల్లి మాటలు గుర్తుకు వస్తున్నాయి.
మామయ్యవాళ్ళు, తల్లిని తనని ఎంత హీనంగా చూసేవారో ఎన్నిమాటలు అనేవారో అన్నీ ఒక్కొక్కటి గుర్తుకు రాసాగాయి.
మనసులో పౌర్షం తన్నుకువచ్చి కసి, కక్ష ఏర్పడుతున్నాయి.
ఎలా అయినా సరే ఇందూని లొంగదీసి తనదారికి తెచ్చుకుని ఆమెను పెళ్ళి చేసుకుని తను అన్నమాట నిలబెట్టుకుని! మామయ్య పొగరు అణచాలి అని అనిపిస్తుంది. పట్టుదల పెరిగిపోతుంది తనలో.
అందుకే ఈ ప్రయత్నాలన్నీ.
ఈ శ్రమ అంతా అందుకే.
ఎవరు ఏమనుకున్నా, ఎందరు ఎన్ని మాటలు అనుకున్నా, నవ్వుకున్నా తన పంతం తనదే.
ఆ తరువాత అందరిచేతా ఔరా అనిపిస్తాడు, కృష్ణమౌళి ఆలోచనలు అలా సాగుతూనే ఉన్నాయి.
* * *
కృష్ణమౌళి ఇంద్రసేన గదిలోకి వెళ్ళాడు. తలుపు దగ్గర నిలబడే అడిగాడు.
"లోపలకు రావచ్చా?" అంటూ.
"లోపలకు వచ్చేస్తు ఇక అడగటం దేనికి!" కోపంగా అరిచింది.
అతను పట్టించుకోనట్టే నవ్వాడు.
కాబోయే భార్య గదిలోకి కాబోయే భర్త రావటం తప్పు కాదేమో సూటిగా చూశాడు ఆమె కళ్ళల్లోకి.
"కాబోయే భార్య ఎవరు! మీకు కాబోయే భార్య ఇక్కడ ఎవరు ఉన్నారు!" అమాయకంగా చూస్తూ కావాలనే అంది.
"ఇంకా ఎవరు, తమరే నా హృదయ రాణిగారు" అన్నాడు నవ్వుతూనే.
