"అమ్మాయి నువ్వు అలా సన్నగా, నాజూగ్గా వున్నావు కాబట్టి నువ్వు అలా విసురుగా సోఫాలో కూర్చున్నా సోఫా ఏం కాలేదు అదే లావుగా వున్న అమ్మాయి అయితే" అంటూ నవ్వారు.
ఆయన అలా హాస్యంగా అంటుంటే ఇందుకి ఒళ్ళు మండిపోయింది.
పైకి ఏం అనలేదు. నవ్వు రాకపోయినా బలవంతంగా పెదవులమీదకు నవ్వు తెచ్చుకుంది.
"చదువు ఎంత వరకు" అడిగారు.
"డిగ్రీవరకు" ముక్తసరిగా చెప్పింది.
"ఆహా" అన్నారు.
ఎందుకు అన్నట్లు చూసింది ఆయనవైపు. నీ వివాహం ఎప్పుడు అవుతుందీ చెప్తాను అన్నారు.
"ఒద్దండీ నాకు పెళ్ళి వయసు దాటిపోలేదు. వివాహం ఎప్పుడు అవుతుందో తెలుసుకోవాలన్న కుతూహలం లేదండీ" అంది మెల్లగా. మెల్లగా చెప్పినా ఆ మాటలు కరుకుగానే వున్నాయి. అమ్మాయి చాలా మొండిది.
చాలా పెంకిది అలాటి అమ్మాయిని ఎలా ఈ విషయం కదపాలా అని ఆలోచించసాగారు.
ఆయన అలా ఆలోచిస్తుంటే ఆవిడ మెల్లగా అన్నారు, చూడమ్మా "కృష్ణ మీ మేనత్త కొడుకా!"
ఇందు మాట్లాడలేదు.
"చెప్పమ్మా మీ మేనత్త కొడుకా! కృష్ణ నిన్ను పరిచయం చేస్తూ మా మామయ్య కూతురు అని అంటుంటేను"
"అతనికి మతిలేదు. నాకతను మేనత్త కొడుకు ఏమిటి!" కోపంగా అంది.
ఆవిడ చిత్రంగా చూసింది.
"మా అంతస్తు ఎక్కడ కృష్ణమౌళి అంతస్తు ఎక్కడ? నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుంది. నక్క నాగలోకానికి ప్రయాణము వింటూంటే హాస్యాస్పదంగా వుంటాయా మాటలు."
"అయితే అబ్బాయి చెప్పినట్టు మీ మేనత్త కొడుకుకాడా!" అడిగింది ఆవిడ.
"కాడు" అంది కటువుగా.
"మరలా చెప్పావెందుకు!" అన్నారాయన కావాలన్నట్టుగా.
ఇందు మాట్లాడలేదు.
"అమ్మాయి నీ మాటలు చూస్తే ఇట్లా ఉన్నాయి. అబ్బాయి మాటలు చూస్తే అట్లా వున్నాయి ఇంతకు నిజం ఏమిటి!" ఆవిడడిగారు.
"నిజం ఏమిటో చెప్పమంటారా!" సూటిగా అడిగింది.
"చెప్పమనేగా అడుగుతున్నాం" అన్నారాయన. "మా డబ్బుచూసి వలవేస్తున్నారు. అతను పై అంతస్తులకి ఎగబ్రాకాలని ఆకాశానికి నిచ్చెనలు వెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు"
"అది దురాశే అవుతుంది" అంటూ క్షణం ఆగి అంది.
"చూడండి మిమ్మల్ని ఒక మాటడుగుతాను సూటిగా జవాబు ఇస్తారా?"
"సూటిగా అడిగిన ప్రశ్నకు సూటిగానే జవాబు ఇస్తాం అడుగమ్మా" అన్నారు ఆయన.
"కృష్ణమౌళి తల్లి మా యింట్లో వంట మనిషిగా వుండేది. మీరు చెప్పండి వంట మనిషి నాకు మేనత్త ఎలా అవుతుంది"
ఆ మాటలకి లక్ష్మీనారాయణగారి ముఖం గంభీరంగా మారిపోయింది.
"చూడమ్మా నేను ఒకమాట చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను"
"నువ్వు వంటగదిలోకి వెళ్ళి వంట చేస్తుంటావు అనుకో ఈ మీ ఆంటీ వచ్చి నీకు సాయంచేసి వంటచేసి పెడ్తుంది అనుకో. అప్పుడు ఈ మీ ఆంటీ నీకు వంటమనిషి అయిపోతుందా!" అడిగారు,
ఆవిడ చిన్నగా నవ్వింది.
"ఆ అదికాదండీ" అంటూ తడబడింది.
"ఆ ఫర్వాలేదు చెప్పమ్మా" అన్నారు ఆయన.
"ఆంటీని అలా ఎందుకు అంటానండీ ఆవిడ అదే ఆ కృష్ణమౌళి తల్లిని అన్నానుగాని" అంది ఇంద్రసేన.
ఏం చెప్పాలో తోచలేదు.
ఆయన గట్టిగా నవ్వేశారు.
ఆవిడకూడా నవ్వింది.
"చూడమ్మా! కలకాలం వుండేది ధనంకాదు అనురాగ ధనం, మీ మేనత్త అంటే కృష్ణ తల్లి పరిస్థితులవలన భర్త చనిపోతే అన్నగారి పంచన చేరి వుంటుంది ఆవిడ. ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు.
ఈ రోజున స్త్రీ భర్తపోయినా వుద్యోగంచేసి ఆ డబ్బుతో పిల్లల్ని పోషించుకోగలదు. ఎవరి పంచనా చేరనవసరం లేదు"
"ఆ రోజులు అలా కాదు స్త్రీ కి భర్త చనిపోతే ఎవరిదో ఒకరి అండ కావలసిందే. ఆ రోజుల్లో స్త్రీకి చదువులు లేవు. సంపాదన లేదు. ఆవిడ పుట్టింట్లో తలదాచుకోవడానికి వచ్చి వుంటుంది."
"మీ నాన్నగారు ఆవిడ్ని వంటమనిషిగా అట్టే పెట్టి వుంటారు. అన్నగారు ఆదరిస్తారు అని పుట్టెడు ఆశతో వెళ్ళిన ఆవిడకు నిరాశ ఎదురయి వుంటుంది. అయినా ఆ గుండెకోతని మనసులోనే మింగుకుని పసివాడికోసం రోజులు వెళ్ళబుచ్చి వుంటుంది" అన్నారు.
"అతను మీకు అలా చెప్పాడా!" కోపంగా ప్రశ్నించింది.
"అతను చెప్పే మాటలుకంటే నీ మాటలుబట్టి అసలు విషయం తెలుసుకున్నాను."
"తెలుసుకున్నారుగా సంతోషం ఇక మీరు వెళ్ళవచ్చు" అంది కోపంగా.
"నీకు ఈ విషయాలు చెప్పి వెళ్ళిపోవడానికి రాలేదమ్మా"
మరి! అన్నట్టు చూసింది.
"నీ కర్ధమయినట్టుగా చెప్పి కృష్ణతో నీవు పెళ్ళికి అంగీకరించేటట్టు చేసి వెళ్ళాలని నిశ్చయించుకున్నాం."
"అది ఈ జన్మలో జరగనిది. ఆవిడ ఎవరో నాకు అనవసరం కృష్ణమౌళి నాకు ఊహ తెలిసిన దగ్గరనుండీ నాకు అతను వంటమనిషి కొడుకుగానే తెలుసు. అతన్ని వివాహం చేసుకుని మా నాన్నగారు అన్నగారు మా యింటి వంశ గౌరవాన్ని నాశనం చెయ్యదలుచుకోలేదు."
"ఇందూ!" ఆయన శాంతంగా పిలిచారు.
"చిన్నతనంలో ఏదేదో అంటున్నావు తల్లీ! పంతాలని పట్టుదలని ఒక్క నిమిషం పక్కకు పెట్టి కృష్ణమౌళి గురించి ఆలోచించు అతను అందగాడు, గుణవంతుడు, విద్యావంతుడు, అయిశ్వర్యవంతుడు అన్ని విధాల నీకు తగినవాడు"
"నాకు తగినవాడు అంటున్నారు. ఈ ప్రపంచంలో అతను ఒక్కడేనా అయిశ్వర్యవంతుడు, అందగాడు, గుణవంతుడునూ ఇంకెవరూ లేరా!"
