Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 51


    అతను ఏదో చెప్పబోతుంటే ఆవిడ అన్నారు, "చూడు బాబూ కృష్ణా! నువ్వు కష్టపడ్తావు అంటే మేము ఏం చెప్పలేం కాని నిన్ను మా కొడుకుగా భావించి ఒక్కమాట చెప్తున్నాను. మగవాడికి చేసుకున్న భార్యవలన పేరు ప్రతిష్టలు మరింత ఎక్కువ అవ్వాలి గాని ఆ పేరు ప్రతిష్టలు తగ్గకూడదు. నలుగురిలో తన భార్యగురించి నవ్వులపాలు కాకూడదు. నీ భార్యతో యిల్లుదాటి బయటకు అడుగు పెట్టినప్పుడు అందరూ మీ జంటని చూసి మెచ్చుకోవాలి, మీ అన్యోన్యతని చూచి ఈర్ష్యపడాలే గాని మీ జంటని చూచి చాటుగా నవ్వుకునేటట్టు ఉండకూడదు. బాగా ఆలోచించుకో నీవు అన్నీ ఆలోచించుకుని ఈ పెళ్ళి చేసుకోవడానికి సిద్ధపడితే ఇక ఆలోచించేది ఏమీలేదు. ఇప్పుడే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాం" అన్నారు ఆవిడ.


    ఆ మాటలకు అతను చిన్నగా నవ్వుతూ "అమ్మా! మీరు నా మంచి కోరి ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే నేను అందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ విషయాలు అన్నీ నేను ఈ ఊరు రాకముందే ఆలోచించుకున్నాను." "నేను అంటే ఆమె ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే సరే లేదా బలవంతంగా పెళ్ళి చేసుకుంటే జీవితం ఏమిటని"


    "కొన్ని రాత్రులు కొన్ని పగుళ్ళూ ఈ విషయాన్ని తర్జన భర్జన చేసి ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను మా అమ్మగార్కి మాట ఇచ్చినందు వలన ఈ పెళ్ళి చేసుకుని మా మావయ్య పొగరు అణచాలి అని నిశ్చయించుకున్నాను."


    "ఇందూని చూశాక నా మనసు మరో విధంగా ఆలోచించసాగింది.


    ఇందూ చాలా అందమైన అమ్మాయి. ఆమెకు పొగరు ఉంది, పెంకితనం ఉంది. నిర్లక్ష్యం ఉంది. అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని ముక్కుకి తాడు వేసి నా దారికి తెచ్చుకోవటంలో నాకు ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుంది అని నిశ్చయించుకున్నాను."


    "ఆ అమ్మాయి పొగరు గర్వం కవ్వింపు నాకు సవాలు అయ్యాయి. ఆ సవాలుని ఎదుర్కోవాలి. నేను గెలిచి తీరాలి అదే నా శపధం" అన్నాడు దృఢ నిశ్చయంతో.


    ఆయనా ఆవిడా ఒక్కసారి ముఖముఖాలు చూసుకున్నారు.


    ఆవిడ శాంతంగా చిరునవ్వుతో ఆయనతో అంది. మనం వెళ్ళి అమ్మాయితో మాట్లాడదాం. అబ్బాయి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంటే బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాడని అనిపిస్తుంది. ఈ కాలపు పిల్లలు మనం ఊహించినంత తెలివి తక్కువవాళ్ళు కాదు. వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కారం చేసుకోగలరు. మనం భయపడనవసరం లేదు."


    "తాళిబొట్టులో మహత్యం ఉంది. ఆడపిల్ల మెడలో ఆ తాళిబొట్టు పడగానే ఎలాంటి అమ్మాయి అయినా ఇట్టే లొంగిపోతుంది. భర్తముందు తలవంచుతూంది" అన్నారు ఆవిడ.


    ఆయన నిజమే అన్నట్టు చిరునవ్వు నవ్వారు.


    "కృష్ణా! నీవు చెప్పినట్టే వెళ్ళి ఆ అమ్మాయిని అడుగుతాం. నీ జీవితం ఏమవుతుందో అని నీకు నచ్చచెప్పడానికి చూశాం. నీకు అంత నమ్మకం ధైర్యం ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నీవు సుఖంగా, సంతోషంగా వుండటమే మా కోరిక. పద అమ్మాయి ఎక్కడ ఉంది!" అన్నారు లక్ష్మీనారాయణగారు.


    "రండి చూపిస్తాను" అన్నాడు కృష్ణమౌళి.


    అతని వెనకాల ఆ దంపతులు ఇద్దరూ వెళ్ళారు.


                         *    *    *
        

    కృష్ణమౌళి ఆమె గదిలో అడుగు పెట్టగానే ఛర్రున చూసింది అతనివైపు ఇంద్రసేన.


    అతను నవ్వలేదు.


    సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు.


    మీకు ఇక్కడ ఏం పని!


    నా గదిలోకి ఎందుకు వచ్చారు! అన్నట్టు కోపంగా చూసింది.


    అతని స్వభావం పూర్తిగా గ్రహించేసుకున్న తరువాత ఆమె అతని దగ్గర నటించటం మానేసింది.


    కథలకి కబుర్లకి లొంగేరకం కాదు. అతను తను ఆలోచించి నిర్ణయించుకున్న పనే అతను చేసి తీర్తాడు.


    అని గ్రహించుకుని అతను అంటే ఇంకా కోపం, కసి, కక్ష పెరిగిపోసాగాయి.


    లక్ష్మీనారాయణగార్ని ఆయన భార్యని పరిచయం చేశాడు.


    "వీరు మనకి కావలసిన వారు చాలా మంచివాళ్ళు. నాకు అమ్మ నాన్నగార్లతో సమానం" అంటూ చెప్పాడు.


    వీరు మనకి కావలసిన వాళ్ళా!


    మనం అంటే!


    మీరూ నేనూ ఒకటా! అన్నట్టు కోపంగా చూసింది.


    "ఈమె ఇంద్రసేన! మా మావయ్య కూతురు. తండ్రి నోట్లోనుండి ఊడిపడినట్టు ఆయన పోలికలు ముఖ్యంగా ఆయన బుద్ధులు పుణికి పుచ్చుకుంది" అంటూ నవ్వాడు.


    ఆ నవ్వులో రవ్వంత హేళన మిళితమై వుంది. అది గ్రహించుకున్న ఇందూ మండిపడిపోయింది.


    తండ్రిని, తనని వీళ్ళ ఎదుట అవమానిస్తున్నట్లేగా!


    ఆ దంపతులని పరిచయం చెయ్యగానే నిర్లక్ష్యంగా, అయిష్టంగా చేతులు జోడించి నమస్కరించింది ఆ దంపతులకి.


    లక్ష్మీనారాయణగారు, ఆయన భార్య చిరునవ్వు నవ్వారు.


    కృష్ణమౌళి నేను వెళతాను అన్నట్టు వాళ్ళకి కళ్ళతో చెప్పి "వస్తాను" అంటూ వెను తిరిగాడు.


    వెళుతున్న అతనివైపు కళ్ళు చిట్లించి కొరకొరా చూడసాగింది.


    లక్ష్మీనారాయణగారు చొరవగా అక్కడ సోఫాలో కూర్చుంటూ భార్యతో అన్నారు.


    "అమ్మాయి మనకి మర్యాద చెయ్యాలా ఏమిటి! అలా కూర్చో"


    ఆవిడ చిన్నగా నవ్వుకుంటూ కూర్చుంది.


    ఇందూ కూర్చోలేదు.


    ఈ ముసలి మేళం ఇక్కడ ఎందుకు చేరింది అన్నట్టు చూడసాగింది.


    "అలా కూర్చో అమ్మాయి" అంది ఆవిడ.


    ఇందూ వెంటనే కూర్చోలేదు.


    ఆవిడ ఆమెవైపు పరీక్షగా చూసి మళ్ళీ చెప్పింది.


    "కూర్చో అమ్మాయి" అంటూ.


    ఆ మాటలకి ఇందు ఠపీమని సోఫాలో కూర్చుంది.


    ఆమె ఎంత కోపంగా ఉందో లక్ష్మీనారాయణగారు గ్రహించుకోపోలేదు.


    పైకి శాంతంగా నవ్వుతూ అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS