Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 50


    అతను వింటున్నాడు.


    "అప్పటికీ ఆమె వినకపోతే"


    "ఊ"


    "పెళ్ళికి ముహూర్తం పెట్టించేసి బలవంతంగా ఆమెను పీటలమీదకి ఈడ్చుకువచ్చి మెడలో తాళి కట్టేయండి"


    అతను ఆలోచనల్లో పడ్డాడు.


    "తాళి కట్టగానే ఎలాంటి అమ్మాయి అయినా టక్కున లొంగిపోతుంది"


    "వెంటనే నోరు మూత పడిపోతుంది. తాళిబొట్టు మహిమ అది తాళిని కాదన్న స్త్రీ ఈ భారత గడ్డమీదే లేదు"


    "అంతేనంటావా!"


    "అంతేనండి! మీరు బలవంతంగా పెళ్ళి చేసేసుకోండి. ఇక తిరుగులేదు"


    "మీరు రమ్మంటే వస్తుంది పొమ్మంటే పోతుంది. కూర్చోమంటే కూర్చుంటుంది. నిలబడమంటే నిలబడుతుంది. మంత్రం వేసినట్టు, మత్తు జల్లినట్టు చిత్రంగా మారిపోతుందని అంది అంబిక సలహా ఇస్తూ.


    కృష్ణమౌళి ఆలోచిస్తూ


    "అయితే నువ్వు చెప్పినట్టు చెయ్యమంటావా!"


    "అలాగే చెయ్యండి. తాళి మెడలో పడితే ఏ ఆడపిల్ల అయినా మన్ను తిన్న పాములా పడి వుంటుంది. ఇక సందేహించకండి" అంటూ చెప్పింది.


    కృష్ణమౌళికి ఉషారు వచ్చింది.


    "అయితే సరే నీవు చెప్పినట్టే చేస్తాను. లక్ష్మీనారాయణగార్ని, ఆవిడ్ని రప్పిస్తాను. వాళ్ళుచెప్పినా నేను అడిగినా కాదు అన్నదో అంతే! నువ్వు చెప్పినట్టే బలవంతంగా పెళ్ళి చేసుకుంటాను" అన్నాడు.


    "కాని జాగ్రత్త ఆమె పారిపోకుండా చూడండి పారిపోయిందో!" అంది,


    "ఊహు" అన్నాడు.


    "ఇందూని పారిపోకుండా నేను చూస్తానుగా. నీకు అలాంటి భయం యేం వద్దు" అంటూ చెప్పాడు.


    ఆమె నవ్వింది.


    "అంతే కదా" అంది.


    "అంతే" అన్నాడు.


    "పెళ్ళి అయ్యాక ఇద్దరూ కలిసి యింటికి రండి వచ్చి మావయ్యగార్కి, అత్తయ్యగార్కి దణ్నంపెట్టి వారి ఆశీస్సులు తీసుకోండి" అంటూ చెప్పింది.


    "అలాగే" అంటూ నవ్వాడు.


    ఉంటాను అంటూ ఆమె ఫోన్ పెట్టేసింది.


    కృష్ణమౌళికి మనసు అంతా తేలికయినట్టు అయింది.


    ఉషారుగా అనిపించసాగింది.


    మంచంమీద పడుకున్నాడు ఆలోచిస్తూ.

 

                                                               60


    కృష్ణమౌళి లక్ష్మీనారాయణగారి దంపతులని కబురుచేసి అక్కడకు రప్పించాడు.


    ఆ దంపతులు ఎందుకు? ఏమిటి? అని ప్రశ్నించకుండా వచ్చారు.


    వాళ్ళకి అప్పుడు ఇందూ గురించి చెప్పాడు వివరంగా. అతను చెప్పింది అంతా ఆశ్చర్యంగా విన్నారు ఆ దంపతులు.


    "ఏమిటి నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా!" అడిగారు ఆయన.


    అతను తల ఊపాడు!


    ఆవిడ ఏం మాట్లాడలేదు.


    "నువ్వు అంటే కొంచెంకూడా ఇష్టం ఉన్నట్టు కనిపించటం లేదు. నీ మాటలనుబట్టి చూస్తుంటే. అలాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకుని నువ్వు యేం సుఖపడతావు!" అడిగారు ఆయన తాపీగా.


    అతను చిన్నగా నవ్వాడు.


    "నేను సుఖపడతానా లేదా అని నేను ఆలోచించటం లేదండి"


    "ఏమిటి ఆలోచిస్తున్నావు! పెండ్లి అంటే ఏమిటి అనుకున్నావు! ఇది బొమ్మలాట కాదు సినిమా కాదు బాబు జీవితం. ఆ జీవితాన్ని, ఆ జీవితంలో ఆనందాన్ని సుఖాన్ని చేజేతులా పోగొట్టుకుంటే తిరిగి పొందలేవు. జీవితం అంతా బాధపడతావు" నచ్చజెప్పడానికి చూశారు లక్ష్మీనారాయణగారు.


    "నిజమేనండి మీరు చెప్పింది. కాని పంతంపట్టి వున్నాను. ఈ పెళ్ళి జరిగి తీరాలి."


    "పౌర్షానికి పంతాలకి పోతున్నావు. జరగబోయేది ఏమిటో ఆలోచించటంలేదు నువ్వు" అంటూ ఆగి "పెళ్ళంటే నూరేళ్ళపంట బాబూ! భార్యంటే అర్ధం మగవానికి ఒక చక్కని ఇల్లాలు. భర్తతో పాలు నీళ్ళులా కలిసిపోయే అర్ధాంగి! సుఖసంతోషాల్లోనే కాకుండా కష్టాల్లో కూడా పాలు పంచుకునేది అర్ధాంగి. భర్త నీడను అంటి పెట్టుకుని ఉంటే స్త్రీ చక్కని ఇల్లాలు అనిపించుకుంటుంది కాని....! ఈ అమ్మాయి....!"


    కృష్ణమౌళి మాట్లాడలేదు.


    ఆయన చెప్పినమాటల్లో ఎంతో సత్యం వుంది.


    పెద్దాయన జీవితాన్ని కాచి వడబోచి మాట్లాడుతున్నారు.


    చనువుగా తనకి సలహా ఇస్తున్నారు.


    తన మంచిని కోరుతున్నారు.


    తన జీవితాన్ని చేజేతులా పాడుచేసుకుంటున్నానని బాధపడుతున్నారు.


    ఒక్క క్షణం మవునం వహించాడు.


    కాని తల్లికి తను మాట ఇచ్చాడు.


    ఆ మాటే ఆయనకి చెప్పాడు.


    "మీరు చెప్పింది నాకు అర్ధమయింది. నా మంచికోరి చెపుతున్నారు నేను మా అమ్మగారికి మాటయిచ్చాను."


    "నువ్వు మీ అమ్మగార్కి మాట ఇచ్చాను అంటున్నావు సరే. ఆ అమ్మాయి నిన్ను ఇష్టపడి మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి అంగీకరించినట్టు అయితే నువ్వు ఈ పెళ్ళి చేసుకుని మీ అమ్మగారి మాట నిలబెట్టినా అర్ధం ఉంది. కాని ఆ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడడం లేదు. పైగా ఆ అమ్మాయికి అహంకారం, అతిశయం ఎక్కువే అని తెలుస్తుంది. చనిపోయిన మీ అమ్మగార్కి ఇచ్చినమాట కోసం నువ్వు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటే జీవితం ఏమవుతుందో ఆలోచించుకో బాబూ" అన్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS