Previous Page Next Page 
శశిరేఖ పేజి 50


    శశి - నేనతన్ని పెళ్ళి చేసుకుంటాననుకున్నావా?అతన్ని.

    రామ - ఆయనే చెప్పినాడు, నువ్వు వోప్పకున్నావని.

    శశి - అబద్ధం. ఈయన్నా!!!

    రామ - నిజంగా!

    శశి - నీకంత నమ్మకం లేకపోయింది కదూ? నమ్మావు కాదా?

    రామ -ఇది మొదటిమాటుకాదుగా!

    శశి - నువ్వింకా అది మరచిపోలేదూ? పోనీ, ఆ నేరం నుంచే నా విశ్వాసం ఎట్లాంటిదో  నువ్వు గ్రహించి వుండవచ్చునే.

    రామ - శశి! నన్ను క్షమించు, నీ స్వభావాన్ని ఇన్నాళ్ళకి అర్ధం చేసుకోలేక పోయినాను.

    శశి- పాపము, నీ మనస్సులో ఇంకొకరి సంగతి ఆలోచించడానికి చిటులేక పోయింది.

    రామ-ఎందుకూ?

    శశి - నీ సంగతి ఆలోచించడానికే నీకు తీరుబడి లేక పోయింది.వాళ్ళ సంగతి వాళ్ళే చూచుకునే వాళ్ళు. ఇతరులని ఎన్నడూ అర్ధం చేసుకోలేరు.

    రామ - నా మీద అంత కోపమా? దయరావడానికి  ఏం చెయ్యను?

    శశి - ఎన్నటికి నేను నీ దాన్నే. నువ్వు ఎరగక సందేహిస్తావు గాని.

    రామారావు ఆమెను దగ్గరకు లాగుకొని ముఖము పై ముద్దు పెట్టుకొనెను. ఇంతలో తలుపు తెరుచుకొని నవజివనదాసుగారు ప్రవేశించిరి.

    నవ- శశిరేఖా ఏమిటిది? నీ అభిప్రాయాలేట్లావున్నా ఏమి ఎరగని క్రొత్తవాడితో నువ్విట్లా వుండడం నేను వప్పకోను.

    శశి - ఒప్పకోకండి. ఆ సంగతి చెప్పడానికి వచ్చారా ప్రత్యేకం?
నవ - నీతో వాదించలేను. కాని ఇట్లాంటివి ఇక్కడ వప్పకోము.
శశి -సరే, నా అభ్యంతరమేమీలేదు. వప్పకోకండి. నన్నేం చెయ్యమంటారు?
నవ - నా అధికారంలో వున్నంత వఱకూ  ఇట్లాంటివి  చెయ్యకూడదు.శశి - కారణం చెప్పకండా ఇట్లాంటి ఆజ్ఞలు పెట్టె అధికారం  నేను వప్పకోను.నేను మీ ఇంట్లో స్వతంత్రంగా వున్నానను కొన్నాను. మీ అధికారం క్రింద నన్ను నేను ఎప్పడూ పెట్టుకోలేదు. ఇట్లా అని తెలిస్తే వక్క నిముషం వుండేదాన్ని కాదు. స్త్రి స్వతంత్రంగా  వుండవచ్చును, ఎవరి అధికారం కిందా వుండకుండా అనే అభిప్రాయం పాపం యింకా మీ మనసులో పెవేశించలేదు.
నవ - అల్లాగా,పోనీ, నా పూచిమీద  తీసుకు వచ్చాను నిన్నిక్కడికి.  వీళ్ళదగ్గిర నా అభిమానం కాపాడతావా?
శశి - నా సంగతులు ఊహాలు దాచకండా మీతో ఎన్ని మార్లోచెప్పినాను,  అయినా యెంతో దయతో మీరు నన్నిక్కడికి తీసుకొచ్చారు.నాకు ఏమొగాడితోనూ వంటరిగా మాట్లాడడం ఏ మాత్రమూ తప్పులేదు. అది మీకు తెలుసు.
నవ - నిన్నిక్కడకు  తీసుకురావడం నా తెలివి తక్కువే కావచ్చు. వీరి ఆశ్రమంలో వీరి కిట్లాంటివి ఇష్టముండవు. కనక ఇక్కడున్నాంతకాలమైనా సరిగా వుండాలి.
శశి - అయితే, యింత దుష్కార్యము చేస్తూ వీరికి కష్టం గలిగించడము నా కిష్టములేదు. మీరు గనక రైలు చార్జి యిస్తే యీవేళే వెడతాను.                
నవ - రేపు మధ్యాహ్నం  నేనూ బయలు దేరుతున్నాను. అందాక..........
రామ - ఈ వాదన ఎందుకండి, ఈమె నన్ను వివాహం చేసుకోడానికి వప్పకుంది.ఇప్పడన్నా వంటరిగా ఆమెతో మాట్లాదవచ్చునా?
శశిరేఖ ఆశ్చర్యముతో  కండ్లేత్తి  చూచెను.
నవ - నేనెవర్ని చెప్పడానికి? అయినా వివాహం అనే దానికే తనకు అభ్యంతరం అన్నాదే! మిమ్మల్ని చూడగానే అభిప్రాయం మార్చుకున్నదేమో?
రామ - అది ఆమె యిష్టము.
నవజీవనదాసు వెళ్ళిపోయెను.
శశి - ఎందుకట్లా అన్నావు?నేను  వివాహం సంగతి ఏమి అనలేదే?
రామ - వివాహం కాక యింకేమిటి?
శశి - నాకు పెళ్ళి చేసుకోవడమ ఇష్టంలేదు.
రామ - ఏమి?
శశి - ఎల్లప్పుడు  ఒకళ్ళదాన్నని, నా ప్రేమ ఎప్పడూ పోదని వీళ్ళమల్లే  నే నబద్దాలు చెప్పెలేను.
రామ - ఇవన్నీ మునుపు మనమనుకున్నవేకదూ? అప్పుడు నువ్వు వప్పకోలేదూ?
శశి - అప్పుడు  నాకు తెలిసింది కాదు. అట్లా వప్పకోవడం తప్పే. ప్రేమ స్ధిరంగా వుంటుందని ఏమి విశ్వాసములేదు. ఉంటుందనుకొనికళ్ళు మూసుకొని అబద్ధం చెప్పి పెళ్ళి చేసుకున్నా మనకు శాంతి వుంటుందా?నాకు నమ్మకం లేనిదీ నన్ను అబద్ధం చెప్పమంటావా?
రామ- అయితే మనం వీడి వడవలసిందేనా?


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS