Previous Page Next Page 
శశిరేఖ పేజి 49

నవ - ఈ విషయంలో  మీకు జోక్యముండి వుండాలి. లేకపోతే ఆమె యిట్లా మనస్సు మార్చుకోడానికి కారణం కనబడదు. ఆమె శ్రేయస్సు కోరే మేమందరము ఇట్లా వుద్దేశించాము.
రామ - నాకేమీ  తెలిదు.
ధర్మా- ఏమో నమ్మడానికి వీలులేదు.ఆమె నడిగినాను. ఆవిడ మాటలవల్ల ఏదో మీ అభ్యంతరం  వున్నట్లే తెలిసికోన్నాను.
రామారావునకు వళ్ళు మండిపోయెను. తనను  మోసగించినది చాలదూ? వీరితో యీ అబద్ధములను కూడా చెప్పచుండేనా? ఆమెకిట్టి కొంటెతన మెందుకంత ఇష్టము? తన కింకను బాధ కలిగించి చూచి ఆనందిపవలయునని కాబోలు!     రామ - ఆమె అన్నదా! రండి అడుగుతాను.
అని ఆశ్రమములోనికి ధర్మారావుతో గూడ వడి వడిగా నడిచెను. శశిరేఖ గదిలో లేదు. డాబాపైకి  వెళ్ళిరి. ఆమె డాబాపై నిలుచుని అస్తమించు సూర్యుడు మేఘములకు వేయు రంగులను చూచుచుండెను.
రామ- శశిరేఖా, యీయన్ని నువ్వు వివాహం చేసుకోకండానే నాభ్యంతరం  పెడుతున్నాననుకుంటున్నాడేఆయన? నువ్వు కూడా అట్లానే అన్నావుట, నిజమేనా?
శశి - (ధర్మారావుతో ) ఏమిటండి యీ  అల్లరి?
రామ - నా అభ్యంతరం ఏమి లేదని చెప్పడానికి వచ్చాను.అంతే.
శశి - అభ్యంతరం లేదుకద? ఉందేమో ఎట్లాగా అని భయపడుతున్నా ఇన్నాళ్ళూ!
రామ - నన్ను చూస్తే ని కింత వేళాకోళమా?
శశి - నన్ను చూస్తే నీకింత అవిశ్వాసమా?
రామ - ఎవరికేదో నీకు తెలిదా యేమిటి?
శశి -ఇప్పుడు తెలిదు. కళ్ళుంటేగా?
రామ- చాలా మర్యాదగా వుంది! వచ్చింది నాదే బుద్ది తక్కువ.ఇంక చాలు వెడతాను.
అని వెళ్ళేను. ధర్మారావును అతని వెనకనే వెళ్ళేను.
శశి - రామా, ఇట్లారా.
రామారావు తిరిగి వచ్చెను. వెనుక ధర్మారావు కూడా వచ్చెను.
శశి - మిమ్మల్ని పిలవలేదు.
ధర్మారావాశ్చర్యముతో చూచెను.
శశి - మీరు వెళ్ళవచ్చును.
ధర్మారావు కదలలేదు.
శశి - వెళ్ళండి.
ధర్మా- నేను వెళ్ళను. మీరు నా అధికారం కింద ఉన్నారు మిమ్మల్ని యీయనతో వంటరిగా వదలి వెళ్ళను.
శశి- మీ అధికారమేమిటి?
ధర్మా - నవజివనదాసుగారు, నన్ను మిమ్మల్ని చూస్తో వుండమన్నారు.
శశి - నవజివనదాసుగారెవరు  మిమ్మల్ని చూడమన్డానికి?
ధర్మా - అది నాకు తెలిదు. ఆయన ఆజ్ఞతో ఇక్కడే  వుంటాను.
శశి - బాగానే వుంది! మంచివారే!
రామ - వెళ్ళండి.
ధర్మా- మధ్య మీరెవరు?
రామారావాయన మెడ పట్టుకొని మెట్లవద్ధకు తీసుకుపోయి కిందికి తోసి తలుపు వేసెను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS