Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 49


    "నిజంగానండి చాలా గమ్మత్తు అయిన అమ్మాయి. తెలివయింది, చురుకయినది" మెచ్చుకోకుండా ఉండలేకపోయింది.


    "అందుకే కదా ఈ తిప్పలు అన్నీ తెలివితక్కువ అమ్మాయి అయితే అందరం ఇంత కష్టపడవలసిన పనిలేదు కదా" అంటూ నవ్వి.


    "అందర్నీ ఒక ఊపు ఊపేస్తుంది తండ్రిని మించిన తనయురాలు" అన్నాడు.


    అంబిక నవ్వింది.


    "మిమ్మల్ని చాలా విసుగించేస్తుందా!"


    "విసిగించటమా! మరి విసిగించటమో ఏమయిందో తెలుసా!" అంటూ ఆమె వేసిన ఎత్తులు అన్నీ వివరంగా చెప్పి.


    "నాకు తెలిసిపోయింది. ఆమె నాటకం ఆడుతుంది అని. అంతే అవసరం అయితే అలా చెయ్యమని నువ్వు సలహా ఇచ్చావు కదా! అలాగే చేశాను పాపం స్పృహతప్పి పడిపోయింది. నిజం చెప్పవద్దు నాకు కాస్త జాలికూడా అనిపించింది" అన్నాడు.


    అంబిక నవ్వింది.


    "స్పృహ వచ్చాక మళ్ళీ నటించటానికి ప్రయత్నించింది. నేను కచ్చితంగా చెప్పేశాను. అలాంటి పిచ్చి పిచ్చివేషాలు వెయ్యవద్దని ఇందూ సీరియస్ అయిపోయింది. కోపంగా చూస్తుంది నా వైపు నేను లెక్కచెయ్యకుండా వచ్చేశాను" అన్నాడు.


    అతని మాటలు విని ఆమె కంగారుపడింది.


    "ఏమండి ఇందూ తప్పించుకుంటే చాలా ప్రమాదం. ఇక్కడ నా పరిస్థితి కంఠానికి నొక్కిపట్టిన పదునైన కత్తి అవుతుంది."


    "ఆయన మంచివారు గాదు చాలా కోపిష్టి మనిషి. ఏ మాత్రం గ్రహించినా నన్ను బ్రతకనివ్వరు. నేనే ఆమెను ఇంట్లోంచి పంపించేశాను మీ వద్దకు అని తెలిసిందో" అంటూ మాట మధ్యలో ఆపేసింది. "ఆ భయం నీకు వద్దు అంబికా! నేను ఇందూని పదికళ్ళతో వెయ్యికళ్ళతో గమనిస్తున్నాను. అడుగడుగునా ఆమెకు తెలీకుండా మనుష్యులని యేర్పాటు చేశాను."


    "వేలు కదపడానికి లేదు. యే మాత్రం పారిపోవాలని ప్రయత్నించినా నాకు తెలిసిపోతుంది."


    "ఆరోజు అయితే ఆమెను ఆడించాలని పారిపోవడానికి నేనే అవకాశం ఇచ్చాను. మళ్ళీ బంధించేశానుగా" నవ్వాడు.


    అంబిక తేలిగ్గా నిట్టూర్చింది.


    "అయితే ఇప్పుడు మీరు యేం చెయ్యాలనుకుంటున్నారు" అడిగింది.


    "అందుకే నీకు ఫోన్ చేశాను"


    "ఎందుకు!"


    "నీ సలహా తీసుకుందామని."


    "సలహా" అంటూ నవ్వింది.


    "అవును అంబికా ఇప్పుడు యేం చెయ్యమంటావు!"


    "ఇందూ ససేమిరా పెళ్ళికి అంగీకరించటం లేదు."


    "ఆమె ఊహల్లో ఇంద్రుడు ఉన్నాడు"


    "యేం మీరు నచ్చలేదు అని అంటుందా!"


    "అలా అన్నట్టే కదా అర్ధం ఇప్పుడు యేమిటి చెయ్యటం చెప్పు" అన్నాడు.


    అంబిక క్షణంసేపు ఆలోచించి అంది.


    "లక్ష్మినారాయణగారు ఊళ్ళోనే ఉన్నారా?"


    "ఉన్నారు అనుకుంటాను. యేం!" అడిగాడు.


    లక్ష్మీనారాయణగారు చాలా పెద్ద ఆయన. ఆయన భార్యకూడా చాలా మంచి ఆవిడ.


    చూడగానే ఎవ్వరికి అయినా గౌరవం కలుగుతుంది.


    ఆయనకు కృష్ణమౌళి అంటే ప్రాణం.


    ఆవిడకు కూడా అంతే.


    వాళ్ళకు పిల్లలు లేరు. అతన్ని స్వంత కొడుకులాగే చూస్తారు. ఒక్కరోజు యింటికి రాకపోతే కృష్ణమౌళికి ఫోన్ చేస్తారు.


    ఈరోజు ఎందుకు రాలేదు అని.


    ఈ విషయం ఎప్పుడు అతను ఆ దంపతులకి చెప్పలేదు.


    "ఆయన్ని ఆవిడ్ని కబురుచేసి రప్పించండి."


    "రప్పించి!"


    "వచ్చాక మీ పరిస్థితి వివరంగా చెప్పి ఆ దంపతులచేత ఇందూకి చెప్పించండి."


    "పెద్దవాళ్లు కదా వాళ్ళు చెపితే వింటుంది ఏమో అని నమ్మకం, అలా అనిపిస్తుంది."


    "నిజమే. కాని ఇందూ మహా మొండి వాళ్ళు చెపితే వింటుందా అని నా అనుమానం!"


    "వింటే వింటుంది లేదా మళ్ళీ మీరుకూడా అడిగి చూడండి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS