Previous Page Next Page 
నన్ను ప్రేమించవు పేజి 4

    "కూర్చో...."
    రామకృష్ణ బల్ల చివర ఖాళీగా ఉన్నచోట కూర్చున్నాడు.
    "ఇతని పేరు రామకృష్ణ. మన ఆశిరయ్యను రక్షించడానికి ప్రయత్నించిన వ్యక్తి..."తనతో మాట్లాడుతున్న వాళ్ళకి చెప్పాడు వినాయకరావు.
    వాళ్ళు రామకృష్ణని పరిశీలనగా చూశారు. వాళ్ళందరికీ నలభై పైనే ఉంటుంది వయసు. ప్రత్యేకంగా కుట్టించుకున్న ఖద్దరు బనియన్లు, ఖాకీ నిక్కర్లు వేసుకున్నారు వాళ్ళు.
    "నువ్వెప్పుడయినా బరువు పనులు చేసావా?" ఒకతను రామకృష్ణనని అడిగాడు.
    "లేదు."
    "నీ చదువుకి తగ్గ ఉద్యోగం దొరక్కపోతే ఏం చేస్తావ్?" మరో వ్యక్తి అడిగాడు.
    ప్రశ్న అడిగిన వ్యక్తి మొహంలోకి చూశాడు రామకృష్ణ. నెమ్మదిగా, స్పష్టంగా చెప్పాడు.
    "బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి...."
    "సర్వర్ గా పని చెయ్యగలవా? రిక్షా కార్మికునిలా బ్రతగ్గలవా?' వినాయకరావు అడిగాడు.
    చిన్నగా నవ్వి అన్నాడు రామకృష్ణ.
    "సర్వర్ గా పని చెయ్యడం, రిక్షాలాగి జీవించడం ఆత్మ గౌరవాన్ని కించపరచే పనులేం కాదు."
    ఆ సమాధానానికి వాళ్ళంతా వినాయకరావు మొహంలోకి చూశారు అతను మీసాలు సవరించుకుని అడిగాడు.
    "కూలీగా పనిచెయ్యగలవా?"
    రామకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. అతనికి కొన్ని క్షణాల పాటు ఆ ప్రశ్న అర్ధం కాలేదు.
    "కూలీ అంటే తేలిగ్గా భావించకు నెలకు నాలుగైదు వేలు వస్తుంది. ఆ పని కోసం యాభైవేలు ఖర్చు పెట్టే వాళ్ళున్నారు. ప్రస్తుతం వచ్చిన వేకెన్సీలో నిన్ను చేర్చాలని యూనియన్ కార్యవర్గం నిర్ణయించింది."
    రామకృష్ణ తేరుకుని అడిగాడు.
    "నేను చెయ్యగలనా?"
    "నువ్వు చెయ్యిగలవు. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకు. పోతే ఒక షరతు. ఆశిరయ్య కూతుళ్ళకి నువ్వు చెరో ఐదువేలు ఇవ్వాలి...." చెప్పాడు వినాయకరావు.
    "అంత డబ్బు నాకెక్కడిది? పదివేలు ఉంటె చిన్న వ్యాపారం పెట్టుకునే వాడిని."
    వినాయకరావు కొన్ని క్షణాలపాటు మాట్లాడలేదు.
    "పదివేలు ఎవరైనా అప్పుగా ఇస్తే నెలకి ఎంత తీర్చగలవు?" అడిగాడు.
    "నాకొచ్చే ఆదాయంలో నెలకి సగం ఇస్తాను." రామకృష్ణ చెప్పాడు ఏమాత్రం తడుముకోకుండా.
    "వడ్డీతో సహా అప్పు తీర్చాలి...."
    "అలాగే, అయితే అప్పుగా పదకొండు వేలు కావాలి....
    ఎటువంటి ప్రశ్నా వెయ్యలేదు వినాయకరావు. రామకృష్ణని తీసుకుని అక్కడినుంచి బయలుదేరాడు. దారిలో ఎదురైన కూలీలు అతనికి నమస్కారం పెట్టసాగారు. వాళ్ళని పేరుపేరున పలకరిస్తున్నాడు వినాయకరావు. అతనికి చాలా పలుకుబడి ఉందని గ్రహించాడు రామకృష్ణ.
    పనులు చకచకా పూర్తయ్యాయి.
    వారంరోజులు తరువాత ఫుడ్ కార్పోరేషన్ లో కూలీగా చేర్చుకో బడ్డాడు రామకృష్ణ. కురుపాం మార్కెట్ దగ్గర ఒక రూము దొరికింది. అంతవరకూ యూనియన్ ఆఫీసులో ఉన్నాడు. పదకొండు వేల రూపాయలు రామకృష్ణ చేతికిచ్చి పదివేల రూపాయలు రామకృష్ణ చేత ఆశిరయ్య కూతుళ్ళకు ఇప్పించాడు వినాయకరావు.
    తల్లికి ఐదువందలు పంపాడు రామకృష్ణ. జీవితంలో మొదటిసారి తల్లికి డబ్బు పంపడం ఆనందాన్ని కలిగించింది. మనియార్డరు చేసి బయటకొచ్చి పోస్టాఫీసు మెట్లపైన కూర్చుని ఆ ఆనందాన్ని తనివితీరా అనుభవించాడు.
    సాయంకాలం మార్కెట్ కి వెళ్ళి తనకి కావాల్సిన వస్తువులు కొని తెచ్చుకున్నాడు. ఇంకా తనకి అవసరమయ్యే సామాన్లు లిస్టురాసి దాచుకున్నాడు. గదిలో చాప పరిచి దానిపైన వెల్లికిలా పడుకుని ఆలోచించసాగాడు. అంతవరకూ జరిగిన సంఘటనలు వరుసగా గుర్తొచ్చాయి.
    ఇంతకీ తన సర్టిఫికెట్లు ఏమైనట్టు?
    వాటిని తననుండి తీసుకున్న ప్రయాణీకుడు ఎవరూ అడక్కపోతే వాటినేం చేస్తాడు? బస్ కండక్టర్ కి ఇచ్చాడా? అతని పోలికలు కూడా గుర్తులేవు. ఎలాగైనా తన సర్టిఫికెట్లు తిరిగి సంపాదించాలి. నిద్ర పోయే ముందు మనసులో అనుకున్నాడు రామకృష్ణ.

                                                                           *    *    *
    ఉదయం ఎనిమిది దాటింది సమయం.
    ఒక లారీ గోడౌన్ వద్దకు వచ్చి ఆగింది. గోడౌన్ అరుగుమీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కూలీలు లోపలకు నడిచారు. చివరగా వెళ్ళాడు రామకృష్ణ. గోడౌన్ లోపల బస్తాలు ఒక క్రమంలో పేర్చబడ్డాయి. తవుడు వంటి దుమ్ము లోపల పేరుకుంది. ఒకరకమైన ముక్కి వాసన వెలువడుతుంది.
    ఓ కూలీ పొడవాటి చెక్క తెచ్చి గోడౌన్ అరుగుకి, లారీకి మధ్య నడవటానికి వీలుగా ఉంచాడు. ఇద్దరు కూలీలు లారీలోకి ఎక్కారు. మరో ఇద్దరు బస్తాలు ఎత్తసాగేరు. మిగతావాళ్ళు బస్తాలు ఎత్తుకుని లారీ వైపు వెళ్ళసాగేరు. నలభై సంవత్సరాల కూలీ ఒకతను బస్తా ఎత్తుకుని చక చకా లారీలోకి ఎక్కేడు. లారీలోని వాళ్ళు ఆ బస్తా అందుకున్నారు. గొలుసు మాదిరిగా మొదలయింది లోడింగ్.
    వాళ్ళ కదలికలు గమనించసాగేడు రామకృష్ణ. కూలీగా అదే మొదటి లోడింగ్ అతనికి, తన వంతు వచ్చిన తరువాత ఎత్తేవాళ్ళ దగ్గరకు వెళ్ళాడు రామకృష్ణ.
    "జాగ్రత్త..." తగ్గు స్వరంతో హెచ్చరించాడు బస్తా ఎత్తిన కూలీ ఒకతను. రెండు చేతులతో భుజాల పైనుంచి బస్తా చివరల్ని పట్టుకున్నాడు రామకృష్ణ. అంతకు ముందు కూలీలు పట్టుకున్న పద్దతిలో.
    ఒక్కసారిగా వంద కిలోల బస్తా ఎత్తుకోవడంవల్ల కళ్ళు తిరిగాయి. అలవాటులేని బరువు కావడం వల్ల సన్నని వణుకు మొదలయింది కాళ్ళల్లో కష్టంపైన నిలద్రొక్కుకుని అడుగులు కదపసాగేడు.
    పుస్తకంలోని పేజీలు తిరగవెయ్యడానికి, కలం పట్టుకోవడానికి అలవాటుపడిన సున్నితమైన వ్రేళ్ళు బస్తా చివరల్ని గట్టిగా పట్టుకున్నాయి. వెన్నుపూస విల్లులా వంగింది. నరాలు తీగల్లా సాగడం వల్ల మోకాలి వెనుక మంట పుట్టసాగింది.
    మిగతా కూలీలు అతనివైపు నిశ్చలంగా చూడసాగేరు. నిజానికి బలమైన వ్యక్తి కూడా ఒకేసారి వందకిలోల బస్తా ఎత్తుకుంటే తడబడతాడని వాళ్ళకి తెలుసు. రన్నింగ్ కి ప్రాక్టీస్ ఎలా కావాలో, బస్తాలు మొయ్యడానికి ముఖ్యంగా అనుభవం కావాలి. అనుభవం, శారీరక ధారుడ్యంలేని రామకృష్ణ ఎలా తీసుకు వెళతాడోననే కుతూహలంతో చూస్తున్నారు. చివరకు గుమస్తా, లారీ డ్రైవరు కూడా కళ్ళప్పగించి చూడసాగేరు.
    రామకృష్ణ పదడుగులు వేసి క్షణంపాటు ఆగాడు. వీపు మీదున్న బస్తా క్షణ క్షణానికి బరువెక్కుతోంది. అక్కడా ఉన్నవాళ్ళంతా తననే చూస్తున్నారని అతనికి తెలియదు. ఏ క్షణంలోనైనా బస్తా జారిపోతుందనే అనుమానంతో ఆగాడు. ఊపిరి బిగపట్టి తిరిగి కదిలాడు. అడుగులు స్థిరంగా పడటంలేదు. ఎట్టకేలకు చెక్కమీదుగా లారీ ఎక్కాడు. లారీలోని వాళ్ళు ముందుకొచ్చి బస్తా అందుకున్నారు. రామకృష్ణ నిటారుగా నిలబడి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు.
    "రెండు మూడు రోజులు కష్టంగా ఉంటుంది. తరువాత అలవాటవుతుంది" చెప్పాడు లారీలోని కూలీ ఒకతను. తలపంకించి తిరిగి గోడౌన్ లోకి వచ్చాడు. అతను మూడు బస్తాలు మోసేసరికి లోడింగ్ పూర్తయింది.
    బనీన్ కి అంటిన దుమ్ము దులుపుకుని గోడౌన్ అరుగు పైన చతికిల పడ్డాడు రామకృష్ణ. శరీరమంతా చచ్చుబడినట్టుగా ఉంది. పధ్నాలుగు సంవత్సరాల కుర్రవాడొకడు పెద్ద పెద్ద ప్లాస్కులతో వచ్చాడు. అందరికీ టీ ఇచ్చి రామకృష్ణ దగ్గరకు వచ్చాడు.
    "మీరు కొత్తగా వచ్చారాండి?" అడిగాడు గ్లాసుతో టీ ఇచ్చి.
    "అవును." చెప్పాడు టీ తీసుకుని.
    "టీ ఎక్కడనుంచి తెస్తావ్?" అడిగాడు.
    "ఇంటి దగ్గర తయారుచేసి తెస్తానండి...."చెప్పాడు ఉత్సాహంగా. గోడౌన్ల దగ్గర ప్లాస్కులతో టీ అమ్మే కుర్రాళ్ళు చాలామంది తిరుగుతారు. ఫ్లాస్కులు అద్దెకిచ్చేవాళ్ళు టీ కూడా ఇస్తారు. తను మాత్రం ఇంటి వద్ద చేసుకుంటాడు. ప్లాస్కులు కూడా స్వంతంగా కొనుక్కున్నాడు.
    "రోజుకి ఎంతమ్ముతావ్?"
    "వందరూపాయిల వరకూ అమ్ముతాను."
    "పెట్టుబడి పోను ఎంత మిగుల్తుంది?"
    "పాతిక ఉంటుంది సార్...."
    "ప్లాస్కులు అద్దెకు తెచ్చుకునేవాళ్ళకి ఎంతొస్తుంది?"
    "ఇరవై రూపాయిల వరకూ మిగుల్తుందండి. టీతో నింపిన ప్లాస్కు పది రూపాయలకు ఇస్తారు. అది అమ్మితే పదమూడు రూపాయలు వస్తుంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS