Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 5

 

    తక్షకుడు కుట్రపన్ననవసరములేదు. మారువేషముల కుమారుల పంప పనిలేదు. అన్నిటిని మించినది తక్షకుడు కశ్యపునికి లంచమిచ్చి పంపుట.
    కశ్యపుడు వైద్యుడు. అతడు తన విధి నిర్వర్తించవలసి ఉండెను. అతడు డబ్బుకు లొంగినాడు. అవినీతికి పాల్పడినాడు. ఇది ఘోరాతి ఘోరము. ఇంతక:-
    కాలః సుప్తేషు జాగర్తి కాలోహి దురతి క్రమః
    
                                      సర్పయాగము


    జనమేజయుడు పరీక్షిత్తు కుమారుడు. తండ్రి మరణించినపుడు అతడు బాలుడు. పెద్దవాడయినాడు. పట్టాభిషిక్తుడు అయినాడు. కాశీరాజు కూతురు వపుష్టను వివాహమాడినాడు. ధర్మబద్దముగా రాజ్య మేలుచున్నాడు.
    జనమేజయుడు తండ్రి మరణించిన రీతిని తెలుసుకున్నాడు. తక్షకుని దుర్మార్గము గ్రహించినాడు. ప్రతీకారము చేయడలచినాడు. తక్షకుని యుక్తముగా సర్పజాతినే నాశనము చేయదలపెట్టినాడు. తండ్రి ఆత్మకు సంతృప్తి కలిగించ తలపెట్టినాడు.
    జనమేజయుడు సర్పయాగము చేయడలచినాడు. యజ్ఞశాల సిద్దము చేయించినాడు. ఋత్విక్కులను, విప్రులను రావించినాడు. వారందరు యజ్ఞ సంకల్పమును ఆమోదించినారు. చండ భార్గవుడు హోత అయినాడు. పింగళుడు అధ్వర్యుడు అయినాడు, శార్జ్నముని బ్రహ్మ అయినాడు. వేదవ్యాసుడు , వైశంపాయనుడు , సైలుడు మున్నగు మహర్షులు సభను అలంకరించినారు.
    యాగము ప్రారంభమయినది. హోతలు మంత్రములు పఠించుచున్నారు. కుండములందు అగ్ని ప్రజ్వరిల్లుచున్నది. సర్పరాజములకు బుద్దిబలము నశించినది. అవి సురసుర వచ్చి అగ్ని కుండములలో పడుచున్నవి. నశించుచున్నవి. ఒకటి కాదు, రెండు కాదు, పదులు కాదు, వందలు, వేలు ఆహుతి అగుచున్నవి. వాసుకి రాలేదు. వాసుకి వంశము సాంతము నశించినది.
    యాగాకుండములందు పడిన సర్పములు వివిధములు. కొన్ని తెల్లనివి, కొన్ని పసుపు రంగువి, కొన్ని ఆకుపచ్చనివి, కొన్ని ఎఱ్ఱనివి. కొన్నిటి కనులు రక్త వర్ణములు, కొన్నిటి దేహములు గొప్పవి. కొన్నిటికి మూడు, అయిదు, ఏడు, తొమ్మిది తలలు ఉన్నవి. అట్టి సర్పములన్నియు సర్పయాగమున పడి కాలిచచ్చుచున్నవి.
    అపుడు తక్షకుని పరిస్థితి విచిత్రముగా ఉన్నది. అగ్నికుండము పిలుచుచున్నది. ప్రాణ భయము. గడగడ లాడుచున్నాడు. తనకు చావు తప్పదని గ్రహించాడు. ఉరికినాడు. ఇంద్రుని ఆశ్రయించినాడు. ఇంద్రుని సింహాసనమును పట్టుకున్నాడు. వదలడు. ఇంద్రుడు నశించిన తాను నశింతునన్నాడు. పట్టుకుని కూర్చున్నాడు. కాని ప్రాణములు అన్నుపట్టుచున్నవి.
    వాసుకి తనవారి చావుకు విచారించినాడు. కద్రువ శాపమును తలచుకున్నాడు. సర్పజాతి సాంతము నశించకుండా కాపాడ దలచినాడు. తన చెల్లెలు జరత్కారువు వద్దకు వెళ్ళినాడు. ఆమె కొడుకు అస్తీకుడు. అతనిని పంపి సర్పయాగము నిలుపు చేయించమని కోరినాడు. జరత్కారువు అస్తీకుని పిలిచినది. "ఇదిగో నీ మేనమామ వచ్చినాడు. సర్పసంతతి నశించకుండా కాపాడమనుచున్నాడు. సర్పయాగమునకు వెళ్ళుము. సర్పశేషమును రక్షింపుము" అన్నది. అస్తీకుడు తల్లి మాటలు విన్నాడు. ఆమె అనుమతి గొన్నాడు. సర్ప రక్షణకు పూనుకున్నాడు.
    అస్తీకుడు బయలుదేరినాడు. వేదపండితులను వెంట గోన్నాడు. యాగశాల ప్రవేశించినాడు. అస్తీకుని తేజస్సునకు యాగశాల వెలుగొందినది. అస్తీకుడు బహువిధ స్తోత్రముల జపమేజయుని కొనియాడినాడు. యాగ మహిమను కీర్తించినాడు. రుత్వీక్కులకు అభివాదము చేసినాడు. సదస్యులకు నమస్కరించినాడు. అగ్నిదేవునకు అంజలి ఘటించినాడు.
    ఆస్తీకుని చల్లని మాటలు విన్నాడు. మునులందరూ సంతసించినారు. అతని కోర్కె తీర్చనగును అన్నారు. జనమేజయుడు ఆమోదించినాడు.
    "మునీంద్రా ! మీ తేజస్సు నన్ను పరవశుని చేయుచున్నది. మీరు అడిగినది ఇవ్వవలేనని నా మానసు ఆరాట పడుచున్నది. అడుగుము ఇస్తుము" అన్నాడు.
    "రాజా! నీవు సత్యవాదివి. దయా స్వరూపుడవు. వాసుకి నాకు మేనమామ. నీయాగమున అతని వంశము నిశ్శేషముకానున్నది. ఇప్పటికే అనేకులు ఆహుతి అయినారు. వాసుకి దుఃఖమునకు అంతులేదు. సర్పకులము మా మాతామహ వంశము. ఆ కులమును కాపాడుము సర్పయాగము మానుము" అన్నాడు అస్తీకుడు.
    జనమేజయుడు అస్తీకుని మాటలు విన్నాడు. అతనికి అభివాదము చేసినాడు. సర్పయాగము ఆపినాడు.
    అప్పటికి తక్షకుడు విలవిల లాడుచున్నాడు. మునుల తపోబలమున , మంత్రముల ప్రభావమున ఇంద్రుడు అతనిని వదలినాడు. ఏకాకి అయినాడు. ఏడ్చుచున్నాడు. యాగకుండమున పడుట తప్పదని గ్రహించినాడు. అయినను తప్పించుకొనుటకు ఆకాశమున అటునిటు పరుగులాడుచున్నాడు. అట్టి సమయమున యాగము ఆగినది.
    బలము లేని పాములు చచ్చినవి. బలవంతుడు తక్షకుడు బ్రతికినాడు.
    
                                          ఆలోచనామృతము


    మానవుడు ఒంటరిగా మనలేడు. అతడు సంఘజీవి. అతని సంఘ జీవమును బలపరుచుటకు గ్రామములు, జనపదములు, దేశములు ఏర్పడినవి. ఇవి మానవుని శ్రేయస్సు కొఱకు ఏర్పడిన  వ్యవస్థలు. అయినను ఒక్కొక్కపుదు ఇవియే అతనికి నష్టకారకములు అగుచున్నవి.
    ఒక పల్లెవాడు మరొక పల్లెవానికి హాని కలిగించినాడు. ఈ పల్లె సాంతము ఆ పల్లెమీద పగబూనును. దానిని నాశనము చేయ తల పెట్టును. ఇది పల్లెకు మాత్రము సీమితము కాదు. దేశములకు జాతులకు సహితము వర్తించును. నల్లవారు దుష్టులు తెల్లవారు గోప్పవారలు. అట్టి జాత్యహంకారము కొనసాగింది. ఇంకను అచ్చటచ్చట కొనసాగుచున్నది. మాజాతికి మాత్రమే పరిపాలించు హక్కు గలదని మిడిసిపడి మిడతవలె నశించిన హిట్లరు ఇందుకు చక్కని ఉదాహారణ.
    నేటి అగ్ర రాజ్యముల స్థితి అట్లే ఉన్నది. ఒకరిని ఒకరు నాశనము చేసుకొని తద్వారా మానవజాతినే నాశనము చేయుటకు ఉద్యుక్తులగుచున్నారు.
    జాతి ద్వేషమును గురించి చెప్పుటకు సర్పయాగము ఒక చక్కని ఉదాహరణ. పరీక్షిత్తును చంపినది తక్షకుడు. జనమేజయుడు అతని మీద పగ తీర్చుకోనవలె. కాని అతను జాతి ద్వేషము పూనినాడు. మిగత పాములు అతనికి చేసిన అపకారము ఏమి?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS