Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 6

 

    ఇందుగురించి అతడు ఆలోచించలేదు. జాతి ద్వేషము అట్టిది అది ఆలోచించనీయదు.
    జనమేజయుని ఆస్థానమున అనేకమంది పురోహితులున్నారు. విద్వాంసులున్నారు. ఎవరును హితవు చెప్పలేదు. ఇవ్వల్టికీ ప్రభువులను ఆశ్రయించినవారు అంతే. వారు అన్నదానికి వంతపాడుదురే కాని ఎదురు చెప్పరు!
    ఒక జాతి సాంతమును నాశనము చేయుట తప్పు, ఈ విషయము నిరూపించు ప్రమద్వర కధ భరతమున ఉన్నది. మాదే నాగరక జాతి అని విర్రవీగేవారు. వెంటాడి నాశనము చేసిన జాతుల కధలు చరిత్రలో ఎన్నో ఉన్నవి.
    దుష్టులు, నేరస్తులుతమ రక్షణ కొఱకు ప్రభువులను, రాజకీయాలను ఆశ్రయించుట ఈనాటికీ ఉన్నది. ఈమధ్యనే అట్టి ఉదంతములు అనేకము జరిగినవి. వాటిని పేర్కోనుట అసమంజసము, అసందర్భము.
    తక్షకుడు ద్రోహి, నేరస్థుడు, సర్పయాగము వలన అతనికి ముప్పు వాటిల్లనున్నది. అతడు ఇంద్రుని ఆశ్రయించినాడు. రాజకీయులకు దుష్టులతో పని ఎక్కువ. వారిని రక్షింతురు. ఇంద్రుడు తక్షకున్ని రక్షింతునన్నాడు.
    రాజకీయులు అతి చతురులు. ఆశ్రయము ఇచ్చిన వాని వలన తమకు తమ పదవికి ముప్పు వచ్చిన వానిని వదిలివేతురు. "సహేంద్ర తక్షకాయ స్వాహే" అన్నారు ఋషులు. ఇంద్రుడు తన పదవి నిలబెట్టుకావలెను. తక్షకుని తోసివేసినాడు.
    లోకమున శిష్టులవాలే దుష్టులు , వెలుగువలె చీకటి అవసరము. అందుకే సర్పజాతి నశించరాదని అస్తీకుడు కాపాడినాడు. పాములు సంకేతములు మాత్రమే; మనలో చాలామంది పాములున్నారు. అంతేకాదు మన మదిలో చాల పాములున్నవి. వాటిని హతమార్చుటకు సర్పయాగము జరుగవలె.
    ఎప్పుడయినను అసలు దుష్టులు తప్పుకొందురు. అమాయకులు నశింతురు. ఇది ఉద్యమముల చరిత్ర. సర్పయాగమందు కూడ అదే జరిగినది. పాపము చిన్న చిన్న పాములు చచ్చినవి. అసలు తక్షకుడు తప్పుకున్నాడు.
    భారతము జరిగిపోయిన కధ కాదు; జరుగుతున్న కధ!

                                     కచ దేవయాని


    దేవతలకు రాక్షకులకు నిరంతరము యుద్దములు జరుగుచున్నవి. యుద్ధములందు రాక్షసులు గెలుచుచున్నారు. దేవతలు ఒడుచున్నారు. అందుకు కారణము యుద్ధములందు మరణించిన రాక్షసులు జీవించుచున్నారు. చచ్చిన దేవతలు మరల బ్రతుకుట లేదు.
    రాక్షసులలో ముఖ్యుడు వృషపర్వుడు. అతనికి గురువు శుక్రాచార్యుడు. అతని వద్ద మృతసంజీవని విద్య ఉన్నది. అందువలన రాక్షసులు మరల జీవించుచున్నారు.
    దేవతలు అందు గురించి ఆలోచించినారు. మృతసంజీవని సాధించదలచినారు. బృహస్పతి పుత్రుడు కచుడు. అతనిని ఆశ్రయించినారు. కచుని శుక్రాచార్యుల వద్దకు వెళ్ళమన్నారు.శుక్రాచార్యుని కూతురు దేవయాని. ఆమెను మచ్చిక చేసుకొమ్మన్నారు. అట్లు సంజీవని సాధించవలసినదని కచుని ప్రార్ధించినారు.
    కచుడు బాలుడు, బ్రహ్మచారి. దేవతల కార్యము సాధించుటకు బయలుదేరినాడు. వృషపర్వుని పట్టణమునకు చేరినాడు. శుక్రాచార్యుని వద్దకు వెళ్ళినాడు. నమస్కరించినాడు. అన్నాడు :-
    "మహాత్మా! నేను కచుడను. బృహస్పతి పుత్రుడను. నియమవ్రతుడను. నీ అజ్ఞానువర్తినయి మెలుగుదను. నాయందు దయ ఉంచుము. నన్ను శిష్యునిగా పరిగ్రహింపుము."
    శుక్రాచార్యుడు కచుని చూచినాడు. కచుడు సుకుమరుడుగా కనిపించినాడు. మృదు మధుర భాషిగా కనిపించినాడు. బృహస్పతి కొడుకు వచ్చినాడు స్వీకరించుట మంచిది అనుకున్నాడు. కచుని శిష్యునిగా అంగీకరించినాడు.
    కచుడు యౌవనమున ఉన్నాడు. దేవయాని ప్రాయమున ఉన్నది. వారి మాటలు కలిసినవి. దేవయానికి కచుని విషయమున ప్రేమ ఏర్పడినది. కచునికి సహితము దేవయాని విషయమున అనురాగము ఏర్పడినది. కాని కచుడు ఒక పని సాధించుటకు వచ్చినాడు . నిగ్రహించుకున్నాడు. తన పనివరకే ప్రేమించినాడు.
    కచుడు వచ్చుట, శుక్రుడు అతనిని శిష్యుడుగా పరిగణించుట రాక్షసులకు నచ్చలేదు. కచుడు మృతసంజీవని తస్కరించునని వారు గ్రహించినారు. రాక్షస బాలురు కచునిపై పగ బూనినారు.
    ఒకనాటి మాట కచుడు శుక్రుని పశువులు కాయుటకు అడవికి వెళ్ళినాడు. అచట అతడు ఒంటరిగా ఉన్నాడు. రాక్షసులు అది చూచినారు. కచుని వధించినారు. ఒక మద్ది చెట్టునకు కట్టినారు. వెళ్ళిపోయినారు.
    సాయంకాలమయినది. దేవయాని కచుని కొఱకు చూచినది. అతని జాడ కనిపించలేదు. ఆమె వాకిటికి వచ్చినది. నిలిచి చూచినది. కచుని జాడ కనిపించలేదు. దూరముగా పశువులు కనిపించినవి. ఆమెలో ఆశ మొలకేత్తినది. కచుడు వచ్చుచున్నాడనుకున్నది. పశువులు వచ్చ్జినవి కచుడు రాలేదు. దేవయాని గుండె గుబగుబ లాడినది. ఆమె కాలు కాలిన పిల్లివలె తిరిగినది. కచుడు వెనుక వచ్చునని ఎదురు చూచినది. చీకట్లు కమ్ముకున్నవి. అయినను కచుడు రాలేదు. ఆమె మనసు మనసులో లేదు.
    దేవయాని తండ్రి దగ్గరకి వెళ్ళినది. శుక్రుడు కూతురి ఆతురత చూచినాడు అడిగినాడు.
    "తండ్రీ! పొద్దుకుంకినది. చీకటులు కమ్మినవి. అడవి నుంచి పశువులు వచ్చినవి. కచుడు రాలేదు. నా మనసు కీడు శంకించుచున్నది. కచుని రప్పించుము" అన్నది.
    శుక్రుడు దివ్య దృష్టితో చూచినాడు. జరిగినది గ్రహించినాడు. మృతసంజీవని ప్రయోగించినాడు. కచుడు సజీవుడయి తిరిగి వచ్చినాడు. శుక్రుడు సంతసించినాడు. దేవయాని మురిసిపోయినది.
    దేవయానిలో ప్రేమ అంకురించినది - మొగ్గ తోడిగినది. ఆమె కచుని బ్రతికించుకున్నది. అతని ప్రేమ అధికమగుననుకున్నది. కచుడు అనురాగము కనబరచినాడు. అది కపటానురాగము. వలపు వలన అతడు రాచకార్యము సాధించవలసి ఉన్నది.
    దేవయాని ఆడది. కచుని ప్రేమను నమ్మింది. ఆశలు పెంచుకున్నది. మనసున మురిసిపోయినది.
    కొంతకాలము గడచినది. మరొకనాడు ఒక దుర్ఘటన  జరిగినది. కచుడు పూలు తెచ్చుటకు అడవికి వెళ్ళినాడు. రాక్షసులు అతనిని చూచినారు. ఒంటరిగా ఉన్నాడు. అతనిని పట్టినారు. చంపినారు. అతని శరీరము కాల్చినారు. బూడిద చేసినారు. ఆ బూడిదను కల్లులో కలిపినారు. ఆ కల్లును శుక్రాచార్యులకు ఇచ్చినారు. శుక్రుడు కల్లు త్రావినాడు. మత్తులో పడిపోయినాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS