Previous Page Next Page 
శ్రీ మహాభారతము పేజి 4

 

    "కోపము తపములను చెరచును. కోపము అష్టసిద్దులను నశింపజేయును. కావున తపోధనులకు కోపము ఉండరాదు. ఓరిమిలేని వాని తపము, అహంకారము గలవాని సంపద, ధర్మ హీనుని రాజ్యము చిల్లికుండలో నీటి వంటివి. అవి నిలువవు.
    పరీక్షిత్తు ధర్మాత్ముడు. పాండు వంశమువాడు. అతడు రాజ్యము చేయుచున్నాడు. అందువల్లనే మన తపము శాంతముగా సాగుచున్నది. కోపమున శపించినావు . సరి! శక్తి ఉన్న శాపమును మరలింపుము"
    శృంగి తలవంచుకున్నాడు. కోపమున శపించినాను. శమింపచేయు శక్తి తన వద్ద లేదు అన్నాడు. అప్పుడు శమీకుడు గౌరముఖుని పిలిచినాడు. అతడు శమీకుని శిష్యుడు. పరీక్షిత్తుకు వర్తామానము పంపినాడు.
    పరీక్షిత్తు వార్త విన్నాడు. కృంగిపోయినాడు. తాను చేసిన అవమానమును తలచుకున్నాడు. విచారించినాడు. ముని చూపిన శాంతమును గ్రహించినాడు. పొంగిపోయినాడు. శాపమును తలంచుకున్నాడు. గడగడ లాడినాడు. మంత్రులను రావించినాడు. ఉపాయములను ఆలోచించినాడు. ఒంటి స్తంభపు మేడ కట్టించినాడు. మంత్రవేత్తలను కూర్చుకున్నాడు. వైద్యులను పిలిపించినాడు. మేడ మీదనే కాపురము పెట్టినాడు.
    
                                         ఆలోచనామృతము


    పరీక్షిత్తు ధర్మముగా పాలించిన రాజు. శమీకుడు శాంతము వహించిన ముని, శృంగి బ్రహ్మను గూర్చి తపము చేయువాడు. ముగ్గురు మంచివారే, ముగ్గురు సంస్కారవంతులే. అయినను అనర్ధము జరిగినది. ఇందుకు కారణమేమి?
    మానవ ప్రకృతి విచిత్రమయినది. అది సదా ఒకే రీతిగా ఉండదు. అది స్థావరము కాదు. అది ఒడుదుడుకులకు గురియగుచుండును. ఎల్లకాలము మంచివాడు కాని ఎల్లకాలము చెడ్డవాడు కాని అరుదు. పరిస్థితుల ఒత్తిడికి ప్రతి ఒక్కడు లొంగుచుండును. అట్లు లొంగనివాడు మహాత్ముడు. శమీకుడు మహాత్ముడు.
    పరీక్షిత్తుకు, శృంగికి సంస్కారమున్నది. కాని వారు సామాన్యులు.
    పరీక్షిత్తు మంచివాడు, ధర్మపరుడు, కాని అతడు వేటలో ఉన్నాడు. అలసినాడు. తన బాణమూతాకి తప్పించుకున్న మృగమే అతని ధ్యాసలో ఉన్నది. దానిని పట్టవలేనను పట్టుదల పట్టినాడు. ఆ ధ్యాసలోనే ఉన్నాడు. ఎదుటివాడు ముని అని గ్రహించలేదు. కోపమున వివషుడయినాడు. సంస్కారము అడుగంటినది. చచ్చిన పామును మెడలో వేసినాడు. వివక్షత నశించి వెళ్ళిపొయినాడు.
    శృంగి తపోనిష్టలో ఉన్నాడు. రాజు తండ్రిని అవమానించినాడు. ఆవార్త విన్నాడు. భగ్గుమన్నాడు. ఏ కొడుకయినను అంతే! తండ్రికి అవమానము జరిగిన సహించలేదు. పైగా శమీకుని వంటి తండ్రి! శాంతుడు, వృద్దుడు, తపమందు ఉన్నాడు. అట్టి అవమానము సహించ లేకపోయినాడు. ఆలోచించ లేకపోయినాడు. సంస్కారము అడుగంటినది. శపించినాడు. బాణము కొట్టి ప్రాణము తీయువానికి తిరిగి ప్రాణమునిచ్చు శక్తి లేదు శాపము సహితము అట్టిదే.
    శమీకుడు మహాత్ముడు. అతడు మానావమానములకు అతీతుడు. రాజు కోపవివశడయి దుష్కార్యము చేసినాడని గ్రహించినాడు. ఇది తన ఒక్కనికి జరిగిన అవమానము. పరీక్షిత్తు ప్రజాక్షేమము కోరువాడు. అతనికి హాని కలుగరాదు. అనుకున్నాడు. మనము ఎప్పుడో ఒకప్పుడు కోపోద్రేకమునకు గురికాక తప్పదు. అట్టి సమయమున గుర్తుంచుకోవలసిన కధ ఇది. కోపము సర్వనాశనమునకు హేతువగునని హెచ్చరించినాడు వ్యాస మహర్షి!
    
                                      తక్షక జ్వాల


    తక్షకుడు శృంగి శాపము విన్నాడు. ప్రేరేపితుడు అయినాడు. పరీక్షిత్తు వద్దకు బయలుదేరాడు.
    కశ్యపుడు శృంగి శాపము విన్నాడు. అతను పాము కరచి చచ్చినవారిని బ్రతికించగలడు. అతనికి బ్రహ్మ అట్టి వరమును ప్రసాదించినాడు. అతడు శృంగి శాపము విన్నాడు. పరిక్షిత్తుని గురించి ఆలోచించినాడు. పరీక్షిత్తుని రక్షించదలచినాడు. పరీక్షిత్తు వద్దలు బయలుదేరినాడు.
    దారి ఒక్కటే. తక్షకుడు కశ్యపుదు కలుసుకున్నారు. పరిచయము చేసుకున్నారు. పనులు తెలుసుకున్నారు. తక్షకుడు తన శక్తిని వివరించినాడు. అందుకు నిదర్శన చూపినాడు. అక్కడ ఉన్న మఱ్ఱి చెట్టును కాటు వేసినాడు. అది క్షణములో కాలినది. కూలినది. బూడిద రాశి అయినది. కశ్యపుడు తన శక్తిని వివరించినాడు. అందుకు నిదర్శనము చూపినాడు. బూడిద కుప్పను చేర్చినాడు. తన మంత్ర తంత్రములు ప్రయోగించినాడు. మరల ఎప్పటియట్లు పచ్చని మఱ్ఱి చెట్టును చేసినాడు.
    తక్షకుడు కశ్యపుని శక్తి చూసినాడు. ఆశ్చర్యచకితుడు అయినాడు. కాదు భయపదినాడు. తాను వెడలిన కార్యము నెరవేరదు అనుకున్నాడు. అతడు కశ్యపునికి ధనపుఅశ చూపినాడు. పరీక్షిత్తును బ్రతికించిన అతడు ఎంత ఇచ్చునో అంతకంటే అధికముగా ధనము ఇత్తును అన్నాడు. కశ్యపుడు తన కర్తవ్యమును మరచినాడు. ధనమునకు లోంగినాడు. ధనము తీసుకున్నాడు. తన దోవన తాను పోయినాడు. మరలి పోయినాడు. పరీక్షిత్తు మాట మరిచినాడు.
    తక్షకుడు పన్నుగడ పన్నినాడు. నాగ కుమారులను బ్రాహ్మణ కుమారులను చేసినాడు. వారికీ ఫలములు ఇచ్చినాడు. పరీక్షిత్తు వద్దకు పంపినాడు.
    పరీక్షిత్తు ఒంటి స్తంభపు మేడ పైన ఉన్నాడు. అతని చుట్టూ వేదాధ్యయనము చేయుచున్నారు. పండితులు చర్చలు జరుపుచున్నారు. విద్వాంసులు కూడి ఉన్నారు.
    ఆనాడు ఏడవరోజు , సూర్యుడు అస్తమించనున్నాడు. సూర్యాస్తమయము దాటవలె, తనకు శాపము తప్పవలె అనుకున్నాడు పరీక్షిత్తు. అప్పటికి కపట బ్రాహ్మణ బాలురు వచ్చినారు. వారు పరీక్షిత్తుకు పండ్లు అర్పించినారు. పరీక్షిత్తు ఫలములు గ్రహించినాడు. అక్కడ చేరిన వారందరికీ ఇచ్చినాడు.
    పరీక్షిత్తు ఒక్క ఫలము మాత్రమే ఉంచుకున్నాడు. అది తినదలచినాడు. పండును మధ్యకు చీల్చినాడు. అందులో ఒక సన్నని పురుగు కనిపించినది. చూచు చుండగానే అది మహా సర్పమయినది. అతడే తక్షకుడు. కాటు వేసి పరీక్షిత్తు ప్రాణము తీసినాడు.
    తక్షకుని చూచిన అక్కడి జనులు పరుగు పుచ్చుకున్నారు. ప్రాణములు అరచేత పట్టుకొని పారిపోయినారు. తక్షక జ్వాల వ్యాపించినది. పరీక్షిత్తు యుక్తముగా ఒంటి స్తంభపు మేడ బూడిద అయి కూలినది.

                                                ఆలోచనామృతము


    పరీక్షిత్తు అన్యాయమునకు గురి అయినాడు. కుట్రలకు బలి అయినాడు. అవినీతికి ఆహుతి అయినాడు.
    పరీక్షిత్తు చేసినది నేరము కాదు. అతను అవేశమున చేసినాడు. హాని తలపెట్టి చేయలేదు. వాస్తవముగా హాని జరుగలేదు. జరిగినది అవమానము, శపించినవాడు అవమానము జరిగినవాని పుత్రుడు. అతడు విధించిన శిక్ష నేరమును మించినది. అది అతడే గ్రహించినాడు. శాపము మరలించు శక్తి లేక మిన్నకున్నాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS