Previous Page Next Page 
రాజ హంస పేజి 5

 

    "ఎలా వున్నారు?" అనడిగాడు.
    "బా......గా......నే.... వున్నాను" అంది రాజహంస కొంచెం తడబడుతూ.
    "ఆనాటి తర్వాత ఎంత అనుకున్నా .....కేవలం అనుకోవటమే కాని మీతో మాట్లాడటానికీ వీలు పడలేదు."
    రాజహంసకు ఏమనాలో తోచక "నలుగురి ముందూ బావుండదు కదండీ, అంది.
    "మీతో కొంచెం మాట్లాడాలి."
    "ఏం మాట్లాడతారు?"
    "ఇక్కడంత గబగబా చెప్పటం కష్టం. రేపు మా యింటికి రండి."
    ఆమె కొంచేమాలోచించి "ఆవిడగారు వుంటుంది కదా" అంది.
    "ఉంటే ఏమిటి?" అన్నాడతను నిర్లక్ష్యంగా.
    ఆమె "నిజమా?" అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది.
    "నేను లెక్చరర్ని. లెసన్స్ నేర్చుకునేందుకు అనేక మంది వస్తూ వుంటారు. అలానే మీరూ వస్తారు."
    "అలాగా?" అనుకుంది. "మళ్ళీ ఏదో రాజీమార్గమే నన్నమాట" అని మనసులో తలపోస్తూ.
    "ఏమిటి అలోచిస్తున్నారూ?"
    "వస్తాలెండి"
    "మా యిల్లు...."
    "తెలుసులెండి. ఒకసారి ఎవరింటికో అటుకేసి పని మీద వచ్చినప్పుడు ఊర్వశి చూపించింది.
    

                                                          *    *    *

    మర్నాడు సాయంత్రం కాలేజి విడిచిపెట్టాక , రిక్షా మాట్లాడుకుని చక్రపాణి యింటికి వెళ్ళింది.
    మేడమీద పోర్షన్. క్రింద పోర్షన్ లో ఎవరో యింజనీర్ గారు అద్దె కుంటున్నారు.
    ఇంట్లో చక్రపాణి ఒక్కడే తెల్లటి గ్లాస్కో పంచెను లుంగీలా కట్టుకుని, పల్చటి లాల్చీ వేసుకుని, కావాలని ముస్తాబయినట్లు మిడిసి పడుతున్నాడు.
    రాజహంస కొంచెం సందేహిస్తూనే లోపలికడుగు పెట్టింది.
    ఆమెను చూడగానే అతని మొహం సంతోషంతో వెలిగింది. "రండి" అన్నాడు చాలా ఆప్యాయంగా.
    డ్రాయింగ్ రూము నీట్ గా అమర్చి వుంది. గుమ్మాలకు కిటికీలకు కర్టేనులు , ముద్దుగా ముచ్చటగా వున్న చిన్న సోఫా సెట్టు, మధ్యలో బుల్లి టీపాయి, ఓ ప్రక్కన అందమైన స్టాండ్ లో అమర్చి వున్న కలర్ టీవి గోడకు ఒకే ఒక ఫ్రెమ్ కట్టి వున్న విరహిణి ఫోజులో వున్న మీరాబాయిదో ఎవరిదో బొమ్మ.
    "కూచోండి" అన్నాడు.
    రాజహంస సోఫాలో కూర్చుంది. ఎందుకో ఆమెకు అతను తప్ప యింట్లో వేరెవరూ వున్నట్లు కనిపించలేదు.
    "ఆవిడగారెరి? కనిపించరేం?" అనడిగింది.
    అతను చిన్నగా నవ్వాడు. "నిజం చెప్పమంటారా? అబద్దం చెప్పమంటారా?"
    "మొదట అబద్దం చెప్పారు కాబట్టి యిప్పుడు నిజమే చెప్పండి."
    "ఊళ్ళో తను లేదు. పుట్టింటికి వెళ్ళింది."
    "మరి ఎందుకలా చెప్పారు?" ఆవిడంటే మీకు చాలా భయమా?"
    "భయమా అలాంటిదేం లేదు. కాని అది ప్రక్కన వుంటే మీలాంటి అమ్మాయిలతో మాట్లాడటానికి ఫ్రీగా వుండదు. మూడ్ కూడా వుండదు.
    "అలాంటప్పుడు మాట్లాడాలని కోరుకోవటం దేనికి?"
    "మనసులో ఓ దృడమైన సంకల్పం ఏర్పడింది కాబట్టి."
    "ఏమిటో  దృడ సంకల్పం?"
    "చెబుతాను అన్నాడు దానికి కొంచెం వ్యవధి కావాలన్నట్టు' కొద్దిగా కూల్ డ్రింక్ తీసుకుందురు గాని అంటూ లోపలికి వెళ్ళి అయిదు నిమిషాల్లో రెండు గ్లాసుల్లో ఇంట్లో తయారు చేసిన గ్రేప్ జ్యూస్ ఐస్ వాటర్ లో కలిపి తీసుకొచ్చాడు.
    రాజహంస కొంచెం త్రాగింది. "అరె చాలా బావుందే ఎవరు తయారు చేశారు? ఆవిడగారు చేశారా?"
    అతను తల ఊపాడు.
    "ఆవిడకిలాంటి జ్యుసులూ అవీ తయారు చెయ్యటం బాగా వచ్చానుకుంటాను.
    "తిండికి సంబంధించినవి తయారు చెయ్యటం బాగానే వచ్చు.
    రాజహంస అతని మాటల్లోని వ్యంగ్యాన్ని గమనించి విని విననట్లు వూరుకుంది.
    "చెప్పండి ఏదో మాట్లాడతానన్నారు" అంది కొంచెమాగి.
    అతను తటపటాయిస్తూ "మీ కభ్యంతరం లేకపోతే తలుపేసి వస్తాను. ఎందుకంటే - ఎవరయినా వస్తే డిస్ట్రబెన్స్ గా వుంటుంది. అంటూ ఆమె ముఖంలోని భావాలు చదవటానికన్నట్లు అలా చూసి, ఏ భావమూ కనబడకపోయే సరికి ధైర్యం చేసి తలుపు వేసి గడియ పెట్టి వచ్చాడు.
    రాజహంస ఏమి మాట్లాడలేదు. ఆమె కెందుకో భయం కూడా వెయ్యలేదు.
    మెల్లగా కూల్ డ్రింక్ త్రాగటం పూర్తి చేసి టీపాయ్ మీద పెట్టింది.
    "నా భార్య నాకు తగినది కాదు"
    "బహుశా ఆ సంగతి నిజమే కావచ్చు" ననుకుంటూ "ఆ సత్యం తెలిసినప్పుడు అలా ఎందుకు పెళ్ళి చేసుకున్నారు?" అనడిగింది.
    "పెళ్ళి గురించి చాలా సందర్భాలలో మన యింగిత జ్ఞానంలోపిస్తూ వుంటుంది.
    బహుశా యిది కూడా నిజమే కావచ్చు ననుకుంది.
    "రూపంలోనే కాదు - అభిప్రాయాల్లో , అభిరుచుల్లో మా యిద్దరికీ చాలా వ్యత్యాసముంది."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS