వాళ్ళని చూస్తోంటే ఎలాగో కడుపులో దేవినట్లుగా వుంది.
అప్రయత్నంగా తన పెళ్ళి గురించిన ఆలోచన మనసులో మెదిలింది. తన కాబోయే భర్త ఎలా వుండాలి.
హీరోలా, ఠీవిగా , దర్పంగా , స్టయిల్ గా.....
ఆలోచనలు మనసులో ఎదుగుతుండగానే హటాత్తుగా అలాంటి వ్యక్తీ ఎదురుగా కొన్ని గజాల దూరంలో సాక్షాత్కరించాడు.
అతనెవరో కాదు, ఇంగ్లీష్ లెక్చరర్ చక్రపాణి.
అతనింత అందంగా వుంటాడా? ఇంతకుముందు తెలీదే.
హటాత్తుగా చూడటంతో కొంచెం తొట్రుపాటు కలిగింది. అదే సమయానికి అతని తల తనవైపు తిరిగి చూపులు తన కళ్ళలోకి ప్రసరించబోతున్నాయి.
ఏం చెయ్యాలి? అతను పలకరింపుగా నవ్వితే రెస్పాన్స్ యివ్వాలా? తల ప్రక్కకి త్రిప్పుకోవాలా?
ఈలోగా అతను నవ్వనే నవ్వేశాడు.
ఏమో చెయ్యాలో తెలీక పెదవులు కదిల్చి చిన్నగా నవ్వేసింది.
ఇప్పుడు ఒకరి నొకరు చాలా దగ్గరగా వచ్చేశారు.
తల్లి పొటాటో చిప్స్ తయారుచేసే పరికరం కొనడం కోసం కొంచెం దూరంలో వున్న షాపు కెళ్ళింది.
"హలో" అంటూ కలవరించాడు చక్రపాణి రాజహంసని.
రాజహంస జవాబిస్తూన్నట్లుగా మళ్ళీ నవ్వింది. అవతల వాళ్ళను సమ్మోహనపరిచేటట్లు ఎలా నవ్వాలో ఆమెకు తెలుసు.
"ఒక్కరే వచ్చారా?" అన్నాడు వెంటనే ఎమడగాలో తోచనట్లు.
"ఎగ్జిబిషన్ కు ఒక్కరే ఎలా వస్తారండీ? మా అమ్మతో వచ్చాను."
"ఏరీ ఆవిడా?"
"అదేదో వస్తువు కొందామని అదిగో ఆ షాపు కెళ్ళింది.
"మీరో?"
"నా వైఫ్ తో వచ్చాను."
"ఆమెగారెరీ?"
"చీరెలు చూడ్డానికి ప్రక్కనున్న షాపు కెళ్ళింది.
ఆమె ఎలా వుంటుందో చూడాలన్న కుతూహలం కలిగింది.
"మీరు బాగా చదువుతారు." అన్నాడు అలా అంటే అమ్మాయిలు పొంగిపోతారని అతనికి తెలుసు.
"మీరు లెసన్సు బాగా చెబుతారు" అంది రాజహంస. పొగడాలని ఆమె ఉద్దేశ్యం కాదు, అనాలనిపించి అన్నది.
అతని ముఖంలో చాలా సంతోషం కనిపించింది.
"మీ ఇంగ్లిషు చాలా గొప్పగా వుంటుంది. వినే కొద్ది వినాలనిపిస్తుంది."
"ఈ కాంప్లిమెంట్ యితర అమ్మాయిల నుంచయితే పట్టించుకోను కాని మీ నుంచి రావటం అద్భుతమైన అనుభూతి.'
"ఏమిటో ఆ ప్రత్యేకత? అన్నది కళ్ళని కదిలిస్తూ.
"చెప్పమంటారా?"
"చెప్పామనేగా అడిగింది"
"మీరు....." అని అతనేదో అడగబోతుండగా ప్రక్కనుంచి ఓ స్త్రీ తోసుకు వచ్చింది.
నల్లగా వున్నది శారీర చ్చాయ, ముందరి పళ్ళు కొంచెం ఎత్తు.
"ఇక్కడే నిలబడి పోయారేం షాపింగ్ చేస్తుంటే ప్రక్కనే వుండి బేరం చెయ్యకూడదా?"
ఆమె హటాత్తుగా రావటంతో అతను తొట్రుపాటు పడినట్లు కనిపించాడు.
ఆమె యిద్దరి వంకా కొరకొరా చూస్తోంది. చూపుల్లో అసహ్యాన్ని , కోపాన్ని వెల్లడించే కళ అందరికీ చేతకాదు.
"నా భార్య రామలక్ష్మి" అన్నాడు కొంచెం తడబడే కంఠంతో.
"నా స్టూడెంట్ రాజహంస" అన్నాడు తనని కూడా పరిచయం చేస్తూ.
రాజహంస ఏం చెయ్యాలో తెలీక అవతలామే విష్ చెయ్యకుండా మెదలకుండా నిల్చోవటం చూసి తానూ రెస్పాన్స్ యివ్వకుండా అలాగే నిలబడింది.
భార్య భర్తలకు ఒకరి మీద ఒకరికి నిర్దుష్టమైన హక్కులుంటాయి. వాటిని కఠినాతి కఠినంగా ఉపయోగించుకోవటం కొంతమందికి చేతనవుతుంది.
3
అప్పట్నుంచి చక్రపాణికి రాజహంసని చూడకుండా వుండలేకపోవటం , ఆ చూపుల్లో రకరకాల భావాలు రంగరించటం అలవాటయిపోయింది.
రాజహంసకు అతని మీద సదభిప్రాయమే వుంది గానీ ప్రత్యేకమైన ఓ అవగాహన ఏర్పడటం లేదు. ఆ సాయంత్రం ఎగ్జిబిషన్ లో భార్యతో అతన్ని చూసి నప్పట్నుంచి అతని మీద ఏర్పడిన లైకింగ్ కు కొంత పొర ఏర్పడింది.
మొగాడి హుందాతనంతో బాటు భార్యను కమాండ్ చేసే నైతిక బలం వుండగలగాలి.
అలా అని అతని మీద ఆకర్షణ తగ్గిందని కాదు. ఒకవైపు నుంచి జాలి, ఏర్పడుతున్నది. ఏమిటో.....ఆమెకు తానే అర్ధం కావటం లేదు.
మనుష్యుల్లో ....తమకి తాము అర్ధకాని వారి శాతం ఎక్కువ.
ఏమయినా అది ఆకర్షనో, భ్రాంతో, సానుభూతో తెలీదు. రోజుకి కొన్నిగంటలు అతన్ని గురించి ఆలోచించకుండా వుండలేకపోతున్నది.
ఒకరోజు అనుకోకుండా కాలేజిలో అతనిని వంటరిగా కొన్ని నిమిషాలు ముచ్చటించే అవకాశం లభించింది. అదృష్టవశాత్తూ ఆ దగ్గర్లో ఎవరూ లేరు.
