Previous Page Next Page 
మిస్టర్ 'యూ' పేజి 49

 

    "తెలివైనవాళ్ళు ప్రతి విషయానికీ ఇంకో మార్గం కూడా అలోచించి పెట్టుకుంటారు. నువ్వు కాదంటే 'మా అల్టర్నేట్ ప్లాన్ మాకు ఉండనే వుంది. అయినా మానవత్వం అంటున్నావు -- అసలు మానవత్వం అంటే ఏమిటి ?" అన్నాడు సిసిహ అపహాస్యంగా.
    "ఎంత చెడ్డా ప్రతి మనిషిలోనూ మిగిలి ఉండే మంచితనం."
    "మనిషిలో మంచితనం ఇంకా మిగిలి ఉండడమా? ఏదీ? మచ్చుకి ఒక్క మనిషిని చూపించూ!
    అదోలా నవ్వాడు రాజు.
    "మీరు ఆకాశం నుండి ఊడిపడ్డ దేవతలం అని చెప్పుకుంటున్నారు గానీ మంచితనం మిగిలి వున్న మనిషిని చూపించమని మీరు చేస్తున్న సవాలు చూస్తుంటే రాక్షసరాజు హిరణ్యకశిపుడు గుర్తొస్తున్నాడు. విష్ణు భక్తుడయిన తన కొడుకుతో అయన ఇట్లాగే అన్నాడు.
    "విష్ణువనేవాడు ఎక్కడున్నాడు? చూపించు" అన్నాడు. "ఎందెందు వెదికిన అందందేగలడు హరి" అన్నాడు ప్రహ్లాదుడు. "ఈ స్థంభంలో చూపించగలవా?" అన్నాడు హిరణ్యకశిపుడు. "అట్లాగే అన్నాడు ప్రహ్లాదుడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు స్థంభాన్ని విరగ్గొట్టడం , అందులో నుంచి విష్ణువు నరసింహవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంహరించడం -- అదంతా అందరూ ఎరిగిన పురాణమే కదా!"
    "అయితే ప్రతి మనిషిలోనూ మంచితనం మిగిలే ఉంటుందంటావు."
    నరరూప రాక్షసుడని అందరూ అనుకునే టైపు మనిషిలో కూడా అంతో ఇంతో మంచితనం మిగిలే వుంటుందని నా నమ్మకం! మంచిని పెంచడం నా లక్ష్యం. మంచితనం అన్నది మనుషులకి ఊపిరి కావాలన్నది నా ఆశయం!
    డ్రమెటిక్ గా అన్నాడు సిసిహ.
    "ఒకే! నీ మాటలని చాలెంజ్ గా తీసుకుంటున్నాను. ఇదిగో! ఈ పిల్లలో ఎంత మంచితనం మిగిలిందో రుజువు చేయగలవా? అన్నాడు దురుసుగా యువ మెడ పట్టుకుని ముందుకు తోస్తూ.
    రాజు కళ్ళలో ఎర్రజీరలు కనబడ్డ్డాయి.
    "నా చెల్లెలితో మిస్ బిహేవ్ చెయ్యొద్దు! అన్నాడు అల్టి మేటమ్ ఇస్తూ.
    అది వినిపించుకోకుండా , "ఈమెలో మంచితనం ఏదైనా మిగిలి ఉందంటావా? అన్నాడు.
    "యువ బంగారు కొండ! తను పుట్టాకే మంచితనం అన్న పదం పూర్తీ అర్ధవంతం అయింది" అన్నాడు రాజు ఆప్యాయంగా అభిమానంగా.
    అంతగా పొగడకు, అన్ని విషయాలూ ఇప్పుడు బయట పడబోతున్నాయి.
    ఇంతకీ నువ్వు మా పక్షంలోకి రానట్లేనా?"
    రాజు మాట్లాడలేదు.
    సరే! జరగబోయే నరమేధలో నువ్వు యజ్ఞపశువువి కాబోతున్నావు."
    నిర్లక్ష్యంగా చూశాడు రాజు.
    "యువా!" అన్నాడు సిసిహ.
    విప్పారిన నయనాలతో అతని వైపు చూసింది యువ.
    యువా! అన్నాడు సిసిహ మళ్ళీ మీ అన్న మహా మూర్ఖుడు. విశ్వాదిపత్యం ఒప్పగిస్తామంటే, నిజంగానే మిస్టర్ యూనివర్స్ ని చేస్తామంటే వద్దని వెనక్కి పోతున్నాడు."
    చూస్తోంది యువ.
    ఇంకా చెబుతూనే వున్నాడు సిసిహ. "యువా! ఒక ప్లాను బెడిసి కొడితే ఇంకొక ప్లాను ఎప్పుడూ రెడీగా ఉండాలన్నది నా పద్దతి!
    మీ అన్న చేజార్చుకుంటున్న అదృష్టం నీకు ట్రాన్స్ ఫర్ చేస్తాను. నీకూ, మా అబ్బాయికి హసిహ కి పెళ్ళి జరిపిస్తాను. మీ ఇద్దరి ద్వారా కొత్త సృష్టి చేస్తాను. ఏమంటావ్? అన్నాడు.
    వింటున్న యువ షాకయిపోయింది.
    "ఏమిటీ ....నేను ....అన్నయ్య...అని అస్పష్టంగా అంటూ అర్ధాంతరంగా ఆగిపోయింది.
    "యా మనుషుల్లో ఒక్కరికే పట్టబోతున్న మహాయోగం నీకు ఇష్టమేనా!"
    యువ మొహంలో షాక్ తగ్గి ఆశ్చర్యం , అపనమ్మకం కనబడ్డాయి.
    "లక్కీ చాన్సు యువా! మీ అన్నలాగా మూర్ఖంగా ప్రవర్తించకు! అన్నాడు సిసిహ.
    పంతంతో అతను వివేకం కోల్పోతున్న వైనం తెలుస్తూనే వుంది.
    "చెప్పు! ఒప్పుకున్నానని చెప్పు. పదంటే పది సెకెండ్ల టైము -- పదీ .....తొమ్మిదీ.....ఎనిమిదీ ....అంటూ వెనక్కి లెక్క పెడతాను. ఏ అంకె దగ్గర నువ్వు సరే నన్నా సరే విశ్వరాజ్జిత్వం . ఆలస్యం చేస్తే ఆ తర్వాత ఇంక అల్లలాడినా ఆ చాన్సు రాదు. నక్షత్రమండలాలని దాటుకుని వెళ్ళి బ్రహ్మాండాన్ని భేదించె కెపాసిటీ ఉన్న రాకెట్ లాంచింగ్ లాంటిది ఈ అవకాశం -- రెడీనా ...." అని. "పది..తొమ్మిది.....ఎనిమిది ......" అంటూ లెక్క పెట్టడం మొదలెట్టాడు సిసిహ.
    ఓరకంటితో రాజు రియాక్షన్ ని గమనిస్తున్నాడు.
    రాజు తదేకంగా చెల్లెలు యువ వైపే చూస్తున్నాడు.
    నిశ్చేష్టురాలాయినట్లుగా నిలబడి ఉంది యువ.
    "ఏడూ.....ఆరూ.....ఐదూ...." అంటున్నాడు సిసిహ.
    రాజునీ యువనీ మార్చి మార్చి చూస్తోంది సృష్టీ . ఆమె మొహంలో భయాందోళనలు కనబడుతున్నాయి.
    "నాలుగు.....మూడు " అన్నాడు సిసిహ.
    చెల్లెలి వైపే చూస్తున్నాడు రాజు.
    "వద్దు వద్దు " అన్నట్లుగా అసమ్మతి సూచకంగా తల అడ్డంగా ఆడిస్తోంది యువ.
    "రెండూ ......ఒకటి ......" అన్నాడు సిసిహ అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు విపరీతమైన టెన్షను.
    సిసిహ 'జీరో' అన్నాడంటే మానవ జాతి భవిష్యత్తు మొత్తం సున్నా అయిపోతుంది.
    రాజుకి మనుషుల మంచితనం మీద వున్న నమ్మకానికి చరమగీతం పాడినట్లవుతుంది.
    నోరు తెరిచి "జీ" అన్నాడు సిసిహ. అతని మొహంలో ఓటమి కనబడుతోంది.
    అతను 'రో' అనేలోగా చటుక్కున "నేను ఒప్పుకుంటున్నాను " అనేసింది యువ.
    ఒక్కసారిగా అక్కడంతా నిశ్శబ్దం ఆవరించింది.
    "యు......వా ......' అన్నాడు రాజు. శక్తి అంతా కోల్పోయినట్లు.
    అపరాదిలాగా తల వంచుకుంది యువ. సంతోషంగా చప్పట్లు కొట్టాడు సిసిహ.
    యువా! అన్నాడు రాజు కలవరిస్తున్నట్లుగా.
    ఒక్క క్షణం సేపు అతని వైపు చూసింది యువ. మరుక్షణంలో చూపులు మరల్చుకుంది.
    ఆ ఒక్క క్షణంలోనూ ఆమె కళ్ళలో కనబడిన భావం.
    ఆకాశం పట్టనంత ఆశ!
    విశ్వసామ్రాజ్ఞిత్వం పట్ల ఆరాటం!
    రాజు నిట్టుర్పు అక్కడున్న అందరికీ వినబడింది. సిసిహ వైపు తిరిగాడు రాజు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS