అని పఠించి , "వేదాలు మేం చెప్పగా విని మనుషులు వల్లే వేసినవే!" అన్నాడు సగర్వంగా.
"అయితే నువ్వు మా ప్రపోజల్ కి ఒప్పుకున్నట్లేనా?" అన్నాడు సిసిహ.
"నాన్న అన్నీ తెలిసిన మహాజ్ఞాని. ఒప్పుకో రాజు! అంది సిహానా - సృష్టి -- అభ్యర్ధిస్తూ.
"నాకు రెండు సందేహాలు ఉన్నాయి." అన్నాడు రాజు నిదానంగా.
"ఏమిటవి ?" అన్నాడు సిసిహ.
"ఒకటి ! మీరు సర్వశక్తిమంతులే అయి వుంటే ఆప్టరాల్ నా పర్మిషన్ తో మీకు అవసరం ఏమిటి. మానవజాతినే మట్టు పెట్టగలిగిన వాళ్ళు నాలాంటి ఒక్క మనిషిని టాకిల్ చేయలేరా? నన్ను బతిమాలడం ఎందుకు ? రెండు -- మాటవరసకు మీరు చెబుతున్నదంతా నిజమే అయి, మానవజాతిని సృష్టించింది మీరే అనుకుందాం. మనిషితో బాటు మనిషిని మెదడు సృష్టించింది కూడా ఆటోమాటిక్ గా మీరే అయి వుండాలి కదా. తయారు చేసినవాడికి రిపెరింగు కూడా చేతనయి వుండాలి అవునా? మనిషి మెదడుని సరిగా సెట్ చేసి, మానవజాతిని మార్చవచ్చును గదా! ఈ మారణహోమం ఎందుకూ?" అన్నాడు రాజు నిశితంగా చూస్తూ.
నవ్వాడు సిసిహ.
"మంచి ప్రశ్నలే! చివరి ప్రశ్నకి ముందుగా జవాబు చెబుతాను. మనిషినీ, మనిషి మెదడునీ కూడా సృష్టించింది నిశ్చయంగా మేమే -- మనిషిలోని లోపం అంటే మెదడులోని లోపమే. రిపెయిర్ చేయడం మాకు చేతగాదని కాదు - అసలు అంత అగత్యం ఏమిటి ? ఉదాహరణకి మీరు టీవి కొంటారు. కొన్నాళ్ళు గడుస్తాయి. పాత టీవీ వదిలించుకుని కొత్త మోడల్ కొనాలనిపిస్తుంది. ఇదీ అట్లాగే -- పాత మనుషులు పుచ్చిపోయిన బుర్రల్ని రిపెయిరు చేయాల్సిన ఖర్మ మాకేమిటి. ఏకంగా కొత్త జాతినే సృష్టిస్తాం! పొతే -- నిన్ను ఒప్పించడానికి మేం ఇంత శ్రమెందుకు పడాలని కదూ. చెబుతా చెబుతా ! ఇక్కడా మళ్ళీ మెదడే ......రాజూ ......మానవజాతి మొత్తం మీద నీది పర్ ఫెక్ట్ బాడీ అని జడ్జీలు తేల్చారు కదూ. మేం చెబుతున్నాం. నీకు పెర్ ఫెక్టు బాడీతో బాటుగా పర్ ఫెక్ట్ బ్రెయిన్ వుంది. కొత్త సృష్టిలో నీ బాడీ , నీ బ్రెయిన్ లో కూడా నెగిటివ్ గా ఏదీ వుండకూడదు రాజూ ......మనోవాక్కాయకర్మలా నువ్వు మాతో సహకరిస్తే పర్ ఫెక్టు జాతికి అంకురార్పణ జరుగుతుంది.
నిన్ను బలవంతంగా లొంగదీసుకుంటే , ఆదిలోనే హంసపాదులా , బీజం లోనే నెగెటివ్ యాస్పెక్టు వస్తుంది. అందుకనే ఇంత పెద్ద ఉపోద్ఘాతం! కమ్ రాజూ! విశ్వాదిపతివిగా!" అన్నాడు సిసిహ.
విశ్వాదిపతివి కావడం కన్నా ఈ సృష్టి అనే అమ్మాయికి పతి దేవుడివి కావడం అసలైన అదృష్టం! కాలదన్నుకోకు రాజూ! కమ్ ! బీ మై పార్టనర్ !" అన్న భావం సృష్టి- సిహన మొహంలో కనబడుతోంది.
అదోలా నవ్వాడు రాజు.
"కొత్త సృష్టి పెర్ ఫెక్టుగా వుంటుందని మీరనుకుంటున్నారు గానీ ఇది మతలబు పెళ్ళే! నాకు వరకట్నంగా విశ్వాన్నే ఇస్తున్నారన్న మాట మీరు! అన్నాడు రాజు.
"అనవసరమైన మాటలెందుకు? నీ నిర్ణయమేమిటో తేల్చి చెప్పు ! అన్నాడు సిసిహ.
"మా పెళ్ళికి , మీ ప్రాజేక్టుకీ ముడి పెట్టకండి. ప్రేమలో బేరసారాలు వుండకూడదు. మీ ప్రాజెక్టు సంగతంటారా -- మనుషులందరూ మారణ హోమమై పోయి నేను మాత్రం మారాజులాగా బతకాలనుకునే వాణ్ణి నేనూ మనిషినే -- వీళ్ళలో ఒకడిని ...... బతుకైనా, చావయినా వీళ్ళతోనే -" అన్నాడు రాజు .
సిసిహ కోపంగా ఏదో అనబోతుండగా కట్ చేస్తూ అన్నాడు రాజు.
"మాటవరసకు మనిషిని సృష్టించింది మీరే కావచ్చును-- సృష్టించినంత మాత్రాన సంహరించే హక్కు ఉందని భ్రమపడకండి! పిల్లల్ని కనడం పెద్దల వంతు -- పిల్లలు తాము ఆశించినట్లుగా పుట్టలేదని చంపేయడానికి కన్న వాళ్ళకి కూడా హక్కు లేదు. మా సంగతి మేం చూసుకోగలం!"
"ఎట్లా?" అన్నాడు సిసిహ.
"టెక్నాలజీ ! సైన్సు"
"ఒక ఉదాహరణ చెబుతాను. సైన్సు, టెక్నాలజీ చెట్టపట్టాలు వేసుకుని అంచెలంచెలుగా ఎదుగుతున్నాయి. 1900 సంవత్సరం నుంచి వ్యవసాయం వూపందుకుందని ఒక అంచనా. 1940 ప్రాంతం నుంచి పారిశ్రామిక రంగం పుంజుకుంది. 1960 ప్రాంతం నుంచి సేవలు - అంటే సర్వీసెస్ యాగం మొదలయింది. అట్లాగే, 2020 వ సంవత్సరం నుంచి మనుషులకు శ్రమ తగ్గి లీజరు- విశ్రాంతి యుగం మొదలవుతుంది. 2100 సంవత్సరానికి బయోటెక్నాలజీ విశ్వ రూపం చూపిస్తోంది. 2200 సంవత్సారానికి నియో అటామిక్ యుగం మొదలవుతుంది. 2500 సంవత్సరం ప్రాంతం నుంచి మానవుడి రోదసి విజయాలకి ఇంకా అడ్డు వుండదు. దాన్ని నియోస్పేస్ ఏజ్ అంటాం. అప్పుడు బహుశా మా మానవులే మీ గ్రహానికి వచ్చి, మీకే పాఠాలు నేర్పగలరేమో!" అన్నాడు రాజు.
"అసంభవం!' అన్నాడు సిసిహ.
ఓపిగ్గా చెప్పాడు రాజు.
"అన్నీ సంభవమే! సైన్సు , టెక్నాలజీ కలసి 2030 సంవత్సరానికి రోగాలూ, రోస్టులు లేని పర్ ఫెక్ట్ హ్యూమన్ బాడీని తయారు చేస్తాయి. నా ఊహ ప్రకారం 2050 సంవత్సరానికి మనిషి మేధా తాలుకూ రహస్యాలు అన్నీ తెలిసిపోయి , ఫర్ ఫెక్టు బ్రెయిన్ ని తయారుచేసుకోగలమేమో- మా అంతట మేము -- మీ ప్రమేయం లేకుండా!"
"సిసలైన అజ్ఞానం!" అన్నాడు సిసిహ! "ఫేర్ ఫెక్ట్ బ్రెయిన్ ఉన్నది మాకు ఒక్కళ్ళకే! ఫర్ ఫెక్ట్ బ్రెయిన్ తయారు చేయగలిగింది మే మొక్కళ్ళమే! అది గ్రహించు!"
"మనిషి మేధని తక్కువగా అంచనా వేయకండి!" అన్నాడు రాజు.
"మనిషి -- వాడి మేధ! అని చులకనగా నవ్వాడు సిసిహ. "మేము మనిషికి మేధ ఇచ్చాం -- సొంతంగా ఆలోచించుకునే తెలివితేటలు ఇచ్చాం గానీ అనాదిగా మనిషి తన తెలివితేటలని సాటి మనిషికి మంచి చేయడానికి బదులుగా ముంచి వేయడానికే వుపయోగిస్తున్నాడు.
అన్నిటికన్నా అసహనం కలిగించేది ఏమిటంటే మనిషి అన్నవాడికి శతకోటిసమస్యలు వుంటాయి. కానీ సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవచ్చు గదా -- అలా జరగదు. నూటికి తొంభైతొమ్మిది శాతం సమస్యలను వమోలేన్స్ ద్వారానే పరిష్కరించుకోవాలనుకుంటాడు మనిషి. ఆ వయోలెన్సు దేశాల మధ్య, అయితే యుద్దాలు కావచ్చును -- రాజకీయ పార్టీల మధ్య అయితే ప్రభుత్వానికీ, ప్రతి పక్షాలకీ మధ్య వీది మంటలు కావచ్చును. సిద్దాంతాల రగడ అయితే రాజ్యానికీ, విప్లవకారులకీ మధ్య గెరిల్లా దాడులు కావచ్చును. రౌడీ గ్యాంగుల మధ్యన హత్యలూ, ప్రతి హత్యలూ కావచ్చును. మనిషికీ మనిషికీ మధ్య అయితే .....దండకం అంతా ఎందుకులే -- మొత్తానికి చావు అనేకమైన సమస్యలకు పరిష్కారం అని మనిషి మనసారా నమ్ముతారు. - ఒక్కోసారి తనని తనే చంపుకోవడం -- అంటే ఆత్మహత్య కూడా సమస్యల నుంచి విడుదల చేస్తుందని నమ్ముతాడు మనిషి.
బుద్దుడు పుట్టి అహింసా పరమోధర్మ అని ప్రవచించి రెండు వేల ఐదొందల సంవత్సరాలు దాటుతోంది. కానీ హింస పెరిగిందే గానీ తరగడం లేదు! ఒకే! అన్ని సమస్యలకూ మరణం పరిష్కారం అని మనిషి నమ్ముతాడు గనక మనిషి సమస్యలకు అంతిమ పరిష్కారం మానవజాతిని సమూలంగా నిర్మూలించడమే అని మేం తీర్మానించాం.
ఈ నోనోబోట్లు సృష్టించబోయే మెకానికల్ కేన్సర్ మనిషి తాలుకూ డిఎన్ఏ కూడా మిగలకుండా మటుమాయం చేస్తుంది. దానితో భూమి ప్రక్షాళనం అవుతుంది."
"నెవర్!" అన్నాడు రాజు దృడంగా.
"వాదన అనవసరం! నువ్వు మా వైపా? కాదా? ఒక్క ముక్కలో చెప్పు!"
"నేను మనుషులవైపే! మానవత్వం వైపే - అని నేనంటే మీరేం చేస్తారు ?"
