"యూ విన్ మిస్టర్ సిసిహ! మీరే గెలిచారు " అన్నాడు నిదానంగా.
'ఆఫ్ కోర్స్ ! ఎప్పుడూ గెలవడమే నా అలవాటు " అన్నాడు సిసిహ గర్వంగా. ఆ తర్వాత, అనుచర్ అనే పేరుతొ అందరికీ పరిచయమైన హహసి వైపు తిరిగాడు.
"హహసీ! మానవజాతి మారణహోమానికీ, పనిలో పనిగా మా అబ్బాయి హసిహ కళ్యాణానికి కూడా ఒకేసారి ఏర్పాట్లు మొదలెట్టు. గెలాక్సీలో వున్న గ్రహలన్నీటికీ ఇన్విటేషన్లు వెళ్ళాలి. మనిషి అనే మురికి ఈ భూమ్మీద లేకుండా సఫాయి చేసే నోనోబోట్లని రెడీ చెయ్యి. నరమేధం మొదలవుతోంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం తోలి బలిగా ఒక యజ్ఞపశువు తయారుగా వున్నాడా?"
"యస్సర్" అన్నాడు అనుచర్ హహసి.
"ఏడీ?"
"ఇదిగో!"
ప్రవేశపెట్టబడిన "యజ్ఞపశువు" ని చూశాడు రాజు. అతనికి ఇరవైఏళ్ళుంటాయి . ఒంటికంతా పంచరంగులు పూసి వున్నాయి. మెళ్ళో దండలు వెళ్ళాడుతున్నాయి. రెండు పాదాలు దగ్గరిగా కట్టేసి ఉండడం వల్ల నడవడం కుదరడం లేదు. గెంతుతూ వచ్చాడు.
"ఏరా ఎర్రోడా! అదృష్టం అంటే నీదిరా!" అన్నాడు సిసిహ వేళాకోళంగా.
అయోమయంగా చూశాడు ఎర్రోడు అనబడే ఆ యువకుడు.
"నిన్ను యజ్ఞపశువుని చేశాం. తొలిగా నిన్ను బలి ఇద్దామనుకున్నాం. గానీ లాస్ట్ మినిట్ లో లక్కీగా నిన్ను వదిలేస్తున్నాం- పోరా ! పారిపో!" అన్నాడు సిసిహ.
హహసీ అనే అనుచర్ ఆ యువకుడి కాళ్ళకి బంధాలు తొలగించాడు. ఎర్రోడి మొహంలో పట్టరానంత అనందం కనబడింది.
ఆ భావం చూడగానే చటుక్కున ఒక విషయం స్పురించింది రాజుకి.
అచ్చం ఇదేలాంటి ఎక్స్ ప్రెషన్ నే ఎక్కడో చూశాడు తను.
ఎక్కడా?
ఒక్క క్షణం తర్వాత గుర్తు వచ్చింది.
అవును. ఆరోజున అడవిలో కనబడిన బక్కచిక్కిన రైతు. కొంపాగోడు కూడా బండిలో వేసుకుని భార్యా పిల్లలతో వెళుతుండిన ఆ అభాగ్యుడు. కొత్తమనిషి ఎదురవగానే తనని పీడించడానికి తయారయిన మరో దానవుడనుకుని ముందుగా బెదిరిపోయిన ఆ రైతు. ఆ తర్వాత మాటల్లో తను అట్లాంటి వాడు కాదని గ్రహించగానే బ్రహ్మానంద భరితుడయిపోయాడు గదా!
ఆ క్షణంలో అతని మొహంలో కనబడిన రిలీఫ్, సంతోషం-
అచ్చం అదే ఎక్స్ ప్రెషన్ ఈ యువకుడి మొహంలో కూడా -- అదే పోలిక!
ఆ బడుగు జీవి కూతురిని ఎవరో దొంగలు చెరబట్టారు. ఆ పిల్లని విప్లవకారుడు నిఖిల్ రక్షించి ఆమెతో కలిసి కాపురం చేస్తున్నాడు. "రాక్షసుడు" అన్వేషణలో ఉన్న తను వాళ్ళ జాడ కనిపెట్టాడు.
అట్లాగే తన కొడుకుని ఇంకెవరో పట్టుకొని వెట్టి చేయించుకుంటున్నారని చెప్పాడు ఆ రైతు. ఇతనే ఆ యువకుడయిఉండాలి. పేరు ఎర్రోడా? ఇతన్ని ఈ గ్రహాంతరవాసులు ఈ స్పేస్ షిప్పులో కి తెచ్చినట్లున్నారు.
ప్రయోగం కోసమో!
లేదా ఈ యాగం కోసమో!
"వెళ్ళరా....వెళ్ళు .....నీకు బదులుగా ఈ మిస్టర్ యూనివర్స్ ని బలిపశువుగా ఉపయోగిస్తున్నాం లే! వెళ్ళు వెళ్ళు అన్నాడు సిసిహ.
తెరిచిన తలుపులో నుంచి వెన్నెల మెట్లలా కనబడుతున్న నిచ్చెన మీదకి అడుగు పెట్టబోతున్న ఆ యువకుడు ఆ మాటలు వినగానే ఒక్కసారిగా ఆగి, తల తిప్పి రాజు వైపు చూశాడు. తన బదులు మరొకర్ని బలి ఇస్తున్నారని అర్ధం కాగానే వెనక్కి తిరగాబోయాడు.
తెచ్చి పెట్టుకున్న కాటిన్యం రాజు కళ్ళల్లో కనబడింది వెళ్ళిపో! అన్న హెచ్చరిక ఆ యువకుడికి అందింది.
ఒక్క క్షణం తటపటాయించి , గబగబ మెట్లు దిగేసి, వెళ్ళిపోయాడు అతను. సిసిహ పెద్దగా నవ్వాడు . పాపం! పిచ్చినయనా! ఎంత దూరం పోగలడూ? వాడి నెంబరూ వస్తుంది. మనిషి అనేవాడు మిగలకుండా మట్టు పెట్టేస్తున్నాం కదా! కాస్త ముందూ వెనుకా ....అంతే ......అన్నాడు చులకనగా.
"నువ్వు దిగు! మారణహోమం అంతా నేలమీదే జరగాలి. ఆకాశం అపవిత్రమై పోకూడదు.
"దిగు దిగు ! అన్నాడు సిసిహ రాజుతో.
స్థిరంగా మెట్లు దిగాడు రాజు.
మెట్లు దిగగానే అన్ని వైపులా చూశాడు రాజు. శరవేగంతో పరిగెత్తి వెళ్తున్న ఎర్రోడు కనబడ్డాడు అతనికి. ప్రాణ భయంతో పరిగెడుతున్నట్లుగా కనబడలేదు అతను. ఏదో పనిమీద వెళ్తున్నట్లుగా పరిగెడుతున్నాడు.
వెనక్కి తిరిగి, ఆకాశంలోకి చూశాడు రాజు.
బ్రహ్మాండమైన సైజులో కనబడుతుంది స్పేస్ షిప్.
అందులోనే వుండిపోతుందా తన చెల్లెలు యువ?
వాళ్ళలో కలిసిపోయినట్లేనా?
తన చెల్లెలు తనకు దూరమైపోతుందనే దిగులు తప్ప తన తోబుట్టువే తనకి ద్రోహం చేస్తున్నదన్న ఆలోచన అతనికి ఏ కోశాన లేదు.
నరమేధం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తర్వాత స్పేస్ షిప్పుతో బాటుగా యువ వెళ్ళిపోతుంది. చాలా కొద్ది వ్యవధిలోనే తనకు దగ్గరయిన సృష్టి ఊహాతీతమైన దూరాలకు వెళ్ళిపోతుంది.
అది తనకు పర్సనల్ లాస్!
నరమేధంలో తను ముందుగా మరణిస్తాడు.
అదీ లేక్కచేయ్యడు తను.
కానీ --
చనిపోయేముందు --
చివరిసారి ప్రయత్నంగా --
మానవజాతిని రక్షించే ప్రయత్నం చేయాలి! చేయాలి! చేయాలి!
ఒక్క మనిషి,
మొత్తం మానవజాతిని రక్షించడమా?
ఎట్లా?
చేయవలసిన మహా యజ్ఞంతో పోల్చుకుంటే , ఎంతో కండలు తిరిగి ఉన్న ఈ శరీరం దుర్భలం!
మెదడు చేయవలసిన పని ఇది.
మెదడు మహత్యం తనకి తెలుసు!
మెదడులో కోటాను కోట్ల గ్రెసేల్సు వుంటాయి.
ఎన్ని కోట్ల సేల్సు వుంటే మాత్రమేం!
వాటిలో మహా అయితే అయిదారు శాతం గ్రేసేల్సు మాత్రమే మేలుకుని వుంటాయి. మిగతా కణాలు అన్నీ నిద్రాణమై వుంటాయి.
