కోపంతో ఉడికిపోతుంది.
మనసు మండిపడిపోతుంది.
"మళ్ళీ ఏమయినా ఉపాయాలు ఆలోచించి ఎత్తులువేసి అతి తెలివితేటలు ఉపయోగించావో" చూపుడువేలితో జాగ్రత్తన్నట్టు చెప్పాడు.
ఊ ఏమిటన్నట్టు కోపంగా చూసింది.
"నేను చాలా చెడ్డవాడ్ని, మంచిగా ఉంటే నా అంత మంచివాడు లేడు అనేటట్టు చేస్తాను. లేదా నా సంగతి ఇకముందు తెలుసుకుంటావు"
నిర్లక్ష్యమైన ఒక చూపు చూసి ముఖం తిప్పేసుకుంది.
నేను నీకు భయపడతానా!
ఇందూ అంటే నీకు తెలియదు.
సమయంవస్తే నేను చాలా మొండిదాన్ని, పెంకిదాన్ని అంతకంటే కోపిష్టిదాన్ని మనసులో అనుకుంది కసిగా.
"వస్తాను" అంటూ ఆ గదిలోంచి బయటకు వెళ్ళాడు. వెళ్తూ ఆమెవేపు ఒకసారి వెనుతిరిగి చూశాడు.
అతని కళ్ళు కొంటెగా నవ్వినట్టు అయ్యాయి.
పెదవులపై చిరునవ్వు నాట్యం చేసినట్టు అనిపించసాగింది.
విజయగర్వంతో తల ఎగరేస్తూ వెళుతున్నట్టుగా భావించింది.
అతను మామూలుగా ఉన్నా ఆమె మనసు రకరకాలుగా ఊహిస్తుంది.
చిన్న విషయాన్ని పెద్దదిగా ఊహిస్తూ భూతద్దంలోంచి చూస్తుందన్నా
ఇందూ బొమ్మలా అక్కడ మంచంమీద కూర్చుండిపోయింది.
అతని దగ్గర ఎలాంటి ఎత్తులు పని చెయ్యటం లేదు ఇప్పుడు ఎలా!
ఇంటికి కబురు చెయ్యటానికి అవ్వదు.
ఈ విషయం అన్నయ్యకు, డాడీకి, మమ్మీకి, వదినకు ఎవ్వరికీ తెలీదు.
తను ఫ్రెండ్ యింట్లో ఉన్నాను అనుకుంటారు. ఎంత మోసంచేసి తనని ఇక్కడికి తీసుకొచ్చాడు.
ఆమెకు కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి.
* * *
ఇందూకి భోరున ఏడ్వాలనిపిస్తుంది.
ఏడ్చినందువలన ఫలితం!
లాభంలేదు. ఏడుస్తూ కూర్చుంటే అతను జాలిపడి యింటికి పంపించేయడు.
అతను పట్టువదలడు.
పంతంపట్టి కూర్చున్నాడు.
మనిషి చాలా మొండివాడు.
అంతకుమించి మూర్ఖుడుకూడా.
తనమాట చెల్లాలనే అతని తాపత్రయం అంతా. ఉపాయం ఆలోచించాలి.
కాని అతని దగ్గర లాభం లేదనిపిస్తుంది.
యింట్లోనుండి బయటపడే మార్గంలేదు.
సముద్రపు అలల్లా ఆమె మనసులోని ఆవేశం ఎగిసి పడుతుంది.
ఎగిసిపడే అలల్లా ఆమె ఆలోచనలు ఎల్లలు దాటలేనట్టు భయపడి వెనక్కి పోతున్నాయి.
ఆశను చంపుకోలేక ఆమె ఆలోచనలు సముద్రపు కెరటాల్లా తిరిగి విజృంభిస్తున్నాయి.
ఆమెకి దుఃఖం పొంగి పొంగి వస్తుంది.
ఇందూకి ఉపాయాలు తోచక,
కంగారు భయం ఎక్కువయ్యాయి.
అతను పెళ్ళి అంటున్నాడు.
బలవంతంగా పెళ్లి చేసుకునేటట్లు కనిపిస్తున్నాడు. అతనని తను పెళ్ళి చేసుకోవటమా!
మనసులో రోషంగా అనుకుంది.
ఆమెకు ఏం చెయ్యాలో ఏమిటో తోచటంలేదు.
కృష్ణమౌళి ఆలోచనల్లో పడ్డాడు.
ఆ రాత్రి
ఇంద్రసేన అందరిలాంటి అమ్మాయి కాదు.
చాలా పెంకి. ఆమెను లొంగదియ్యటం వట్టిమాట, చాలా కష్టం.
ఆలోచిస్తూ అంబిక సలహా తీసుకోవాలని నిశ్చయించుకున్నాడు.
ఆమెకు ఫోన్ చేశాడు.
అంబిక అతనికి ఎప్పుడో చెప్పింది.
ఫలానా టైముకి హాస్పిటల్ కి ఫోన్ చెయ్యమని ఏదైనా అవసరం అయితే.
అంతగా అర్జంటు అయితే నర్స్ కి చెప్పి యింటికి ఫోన్ చేయించి తనని హాస్పిటల్ కి రప్పించి పేషెంట్ కి సీరియస్ గా ఉందని చెప్పి.
హాస్పిటల్ కి వచ్చాక అప్పుడు మళ్ళీ చెయ్యమని చెప్పింది.
కృష్ణమౌళి ఫోన్ చేసేసరికి ఎక్కువ టైము అవలేదు.
అంబిక యింకా ఇంటికి వెళ్ళలేదు.
హాస్పిటల్ లోనే ఉంది.
హల్లో అంటూ ఆమె రిసీవర్ ఎత్తింది.
"అంబికా!" అన్నాడు.
"మీరా!" అంది కాస్త మెల్లగా.
"అవును నేనే మాట్లాడుతున్నాను."
"ఏమిటి! ఇందూ ఏమంటుంది!" నవ్వుతూ అడిగింది.
"ఏమంటుంది! పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఎత్తులు వేస్తుంది. ఉపాయాలు ఊరబెడుతుంది" నవ్వుతూ చెప్పాడు.
అతని మాటలకి ఆమె గట్టిగా నవ్వేసింది.
