"ఎందుకు అలా చేశారు!" నుదురు చిట్లిస్తూ అతనివేపు సూటిగా చూస్తూ అడిగింది.
"ఎందుకా?" అంటూ నవ్వాడు.
ఆమె అలా చూస్తుంది.
"నీ మనసులో మాట గ్రహించి అలా చెయ్యవలసి వచ్చింది" అన్నాడు శాంత గంభీర స్వరంతో.
"మనసులో మాట గ్రహించేశారా!" సూటిగా అడుగుతూ,
"మీరు నా మనసులో గ్రహించుకున్న మాట ఏమిటి!" అంది.
ఆ అడగటంలో కోపం తొంగిచూసింది.
ఇందూకి కోపం వస్తున్నా
పైకి ఆ కోపాన్ని ప్రదర్శించకుండా మనసులోనే దాచుకోవడానికి ప్రయత్నించసాగింది.
"నీకు తెలీదా?" కటువుగా అన్నాడు.
అలా అంటున్నప్పుడు అతని కళ్ళల్లో కోపం తొంగిచూసింది.
"తెలీదు" అంది.
"తెలీదా! నాతో మంచిగా మాట్లాడటం"
ఆమె గతుక్కుమన్నట్టు అంది.
"నాతో నవ్వుతూ మాట్లాడటం" కనుబొమ్మలు ఎగరేస్తూ చిన్నగా నవ్వాడు.
"రెప్పవెయ్యటం మరచిన దానిలా అలా చూడసాగింది.
"నన్ను ప్రేమిస్తున్నట్టు నటించటం ఆ తరువాత మంచి మాటలతో నన్ను చవటను చేసి ఆడించాలని చూడటం.!
ఆమె కళ్ళల్లో కంగారు కనిపించింది.
కళ్ళు ఇటూ అటూ తిప్పింది.
ఇప్పుడు ఏమిటి చెయ్యటం!
అతను గ్రహించేశాడు.
ఎలా?
ఉపాయం ఏమిటి? ఎలా అతన్ని నమ్మించటం! ఒక్కక్షణం ఆలోచించింది.
వెంటనే మనసులో కలిగిన కంగారుని మనసులోనే దాచుకుంది.
చప్పున అతని దగ్గరగా వచ్చి చెయ్యి పట్టుకుంది.
"మీరు పొరపడుతున్నారు" అంది ముఖం అమాయకంగా పెడుతూ.
ఆమె కళ్ళల్లోకి చూశాడు.
ఆమె అంతరాంతరాల్లో దాగున్నది ఏమిటి.
ఏముంటుంది!
ఆమె మనసులో మాట గ్రహించుకోవడానికి అన్నట్టు అలా చూశాడు.
అలా కళ్ళల్లోకి చూడగానే ఇందూ కంగారు పడింది.
కృష్ణమౌళి ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేరకం. నరాలన్నీ పైకి ఎక్కలాగే మనిషి.
అతన్ని ఏ విషయంలోనూ అంత సులభంగా నమ్మించలేరు ఎవరూ.
ఎవరూ మస్కా కొట్టలేరు.
ఆ విషయం ఇందూ ఎప్పుడో గ్రహించుకుంది. అయినా అడుగు ముందుకేసింది.
అమ్మాయిల తెలివితేటల దగ్గర అబ్బాయిల తెలివితేటలు ఏపాటి?
స్త్రీ తలుచుకుంది అంటే
ఏమైనా చెయ్యగలదు.
స్త్రీ ఆకర్షణలో పడిన మగవాడు
ఆమె ఏం చెపితే అదే నమ్మేస్తాడు.
ఒక స్త్రీని ఒక స్త్రీ మస్కా కొట్టలేదు కాని, మగవాడ్ని చాలా సులభంగా ఆడించకలదు.
"పొరపడుతున్నానా!" ప్రతీ అక్షరం నొక్కి పలికాడు.
"అది కాదండీ" అంది అతనికి నచ్చచెప్పే ప్రయత్నంలో.
"ఏమిటి చెప్పు!" తాపీగా అన్నాడు.
"మీరు ఏమోమో ఆలోచించుకుంటున్నారు.
మీరన్నట్టు నేను అలా ఏమీ అనుకోలేదండి నిజం నా మాట నమ్మండి" అంది ఎంతో అమాయకంగా. అతను నవ్వేశాడు.
ఆమె చేతిని తీసేశాడు.
"నీవు నిజంగా మాట్లాడే మాటలు ఏమిటో మర్మంతో మాట్లాడే మాటలు ఏమిటో నాకు తెలుసు ఇక నన్ను నమ్మించాలని చూడకు" అన్నాడు కటువుగా.
అలా బొమ్మలా నిలబడిపోయింది.
అతన్ని నమ్మించాలని చూడటం ఇక వట్టిమాట అన్నట్టుగా ఉంది ఆ నిలబడటంలో అర్ధం.
"ఇన్నిరోజులు నీ నటన గమనించాను. ఆడిన నాటకం తెలుసుకున్నాను."
"నీతోపాటు నటించాను"
"నీతోపాటు నేను నాటకమాడాను"
"అర్ధమయిందా!" అతని కళ్ళు కొంటెగా నవ్వాయి.
ఇందూ ముఖమంతా ఒక్కసారిగా ఎర్రబడిపోయింది.
అతను గ్రహించేశాడు అనుకుంటే సిగ్గుగా అనిపిస్తుంది.
అతను నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోతుంది.
మనసు కస్సుమంటుంది.
బుసలు కొడుతున్న నాగులా రెండు మూడుసార్లు శ్వాస తీసుకుంది.
కళ్ళు ఎర్రగా అయ్యాయి.
నుదుటితోపాటు కళ్ళు కూడా చిట్లించి అతనివేపు చూడసాగింది.
"నాకు పనుంది నేను వెళతాను. నువ్వు పిచ్చిపిచ్చి వేషాలు వెయ్యకుండా గదిలో కూర్చో అర్ధమయిందా!"
ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
