రామ - ఇక్కడికేట్లా వచ్చావు!
శశి - చెప్పతాను. ఆశ్రమానికి రండి.
శశిరేఖ తన చరిత్రనంతను అతనికి తెల్పెను. రామారావు మిగుల విచారించెను.
రామ - ధర్మారావు నీకేట్లా తెలుసు?
శశి - మీరాయన్నెరుగుదురా?
రామ - కొంచెంగా. నీకు తెలుసునా?
శశి - నవజివనదాసుగా రింటికి వస్తూ వుండేవాడు.అప్పడేరుగుదును. పాపం,చాలా మంచివాడు ఆయన .
రామ - నేను కనపడగానే పలకరిస్తావనుకోలేదు.
శశి - నిన్ను మరచిపోగల ననుకున్నావా?
రామ - ఇంకా నా మీద ప్రేమ వుందా?
శశి - నీకు తప్ప యీ హృదయంలో ఇంకెవరికి చోటులేదు.
రామ - నువ్వుచేసిన గాయం ఇంకా మానలేదు.
శశి - ఆ రోజులు పోయినాయి. ఇంకేముంది? ఆ అదృష్టం తప్పి పోయింది. మరిచిపో, ఇంక జీవితంలో మిగిలింది ఏమీలేదు.
నాల్గుదినములు గడచినవి. ప్రతిదినమును రామారావు వచ్చి శశిరేఖను కలిసి కొనుచుండెను. ఒక దినము రాత్రి ఆశ్రమములో ఉపాసన జరిగెను. ఆ ప్రార్ధనలో స్త్రి పురుషు లేక ధారగా నేడ్చిరి. వారి భాషయ్తెన యామెకుతెలియలేదు. కాని, ఆమెకు కూడ దుఃఖము వచ్చెను. ఆ సంగీతము వినిన ఎవరికిరాదు? ఆ తడికన్నులతోడనే శశిరేఖ దాబామిదికి బోయి కూర్చుండెను. ధర్మారావును వెంట వచ్చెను.
శశి - ఆహ, ఏమి జీవనము వీరిది?భక్తి! యింకేమీఅక్కర లేనట్లుందే! వీర ఉత్సాహములో కలిసియున్ననే సార్ధకము. వీరితో ఉండ గలిగితే ఎంత బాగుండును?
ఈ సంగతే ఆమెకు పలుమా రానిపించుచుండెను.కాని తాను వీరితో నేట్లుండగాలదు?ఆ సమాజము, మనుజులు, ప్రేమ, భక్తి, గానము, యుత్సాహము,ఆమె నాకర్షించుచుండెను. కాని తన నక్కడ యుండ నిత్తురా? తన జివితమంతయును పాప భూయిష్టమనుకొనుట లేదా వీరు? తనను క్షమింతురా? తాను వివాహమాడిన కాని వీరిలో మర్యాద రాదు. కాని వివాహమా? అయినను తన నెవరు వివాహము చేసికోందురు?
ధర్మా - పోనీ యిక్కడే వుండరాదూ?
శశి - ఎట్లావుండనూ? నన్నేవరుండనిస్తారు?ఈ నిర్బాగ్యురాలిగతి యింతే.
ఆమె కండ్ల నుండి నీరు కారెను. ఎడ్చునపుడుకూడ సుందరముగ కాన్పించు స్త్రీలు కొలది మందియే గలరు. ధర్మారావిదియే మంచి సమయమనుకొనెను.
ధర్మా - శశిరేఖగారూ. నన్ను మీకుసహాయం చేయ్యనీయ్య రాదూ? ఇక్కడ ఉద్యగం సులభంగా సంపాదిస్తాను, నాకియ్యడానికేం? కళ్ళ నద్దుకొని యిస్తారు. మీ యిష్టం ఎక్కడుండాలనివుంటే అక్కడే వుందాం. తరవాత మీ మీద అపవాదుండదు. నా మీద కొంచెం కటాక్షం జూపరాదూ!
శశిరేఖ రెండు నిమిషము లాలోచించెను. ఇక్కడే వుండుటకు వీలగునన్నఆమెకు మిగుల సంతోషము వచ్చెను.కాని వివాహమా? ఇతనినా?ఆమె మాట్లాడక లేచి వెళ్ళిపోయెను. అతనికి ప్రత్యుత్తరము చెప్పుటకు కూడ ఆమెకుఅసహ్యమయ్యెను.
అతడు మాత్రము ఆమె మౌనమును అంగీకారముగా తలచెను. త్వరగాపోయి నవజివనదాసుగారిని వెతకి కనుగొనిఆయనతో శశిరేఖ తనను వివాహమాడ నియ్యకోనేనని చెప్పెను. ఆయన పరమానందభరితు డయ్యెను. ఈ శుభావార్తనాయన తనకు తెలిసిన వారందరితోడను చెప్పచుండెను. రామారావు నచటనే యుండుట తటస్దించినది.
రామ - ఈ వార్త అబద్ధము. ఇట్లాంటి వార్తలెందుకు పుట్టిస్తారు?
నవజివనదాసుగా రాశ్చర్యపడిరి. ఈయనయే రామారావని ఆయనెరుగడు. ఈయన యెవరుట్లు మాట్లాడుటకు?
నవ - ఏమిటండి?
రామ - శశిరేఖ ధర్మారావును పెళ్ళి చేసుకుంటుందని ఎవరు చెప్పినారు?
నవ - మీకంత సందేహానికి కారణమేమిటి? ఇదిగో ధర్మారావే చెప్పినాడు.
రామ - ఏమండి, మిమ్మల్ని శశిరేఖ పెళ్ళి చేసుకుంటానందా?
ధర్మా - అవును. యెందుకట్లా అడుగుతారు?
రామ - అది అబద్ధం.
నవ - మీ మాటలు విచిత్రంగా వున్నాయి.
రామా - ఎప్పుడు చెప్పింది?
ధర్మ - చెప్పి ఇంకా అరగంట కాలేదు.
రామారావు ముఖము తెల్లనయ్యేను. ఎవరో ఆయనను కొట్టి అవమానము చేసినట్లయ్యెను.
మాట్లడక గిరుక్కుమని తిరిగిపోయెను.
ధర్మారావు అసత్యము చెప్పనా? అందులో ఇట్టి విషయములో? సత్యము వెల్లడయిన యుపధ్రవము కాదా? నిజమే,నిజమే. కాని నాల్గు దినముల క్రిందతెకదా, తనతో చెప్పినది వేరు. ప్రేమకు తనలో స్ధలము లేదని? ఏది అబద్ధము! ఇంతటి కృత్రిమముకలదా? కాని ఇదివర కొక సారి తన్నిట్లు మోసము చెయ్యలేదా? అనృతమా,చంచలత్వమా, దినికి కారణము? ఎదైననేమీ? తనతో తన నిర్మలమగు ప్రేమతో ఇట్లాడుచున్నదికదా? తానిట్లు యీ చంచాలత్వమునకు దాసుడగుటయా? ఛి,ఆమెతో నింక మాట్లాడకూడదు.కాని ఆ కండ్లలో అంతటి అనృతమా? ఎంత నిర్మలముగా కనబడి యుండెను?ఎంతటి అమాయకత్వము, ఎంతటి ప్రేమ తనపై చూపెను? అదంతయును మోసమేనా? ఇంక ఎవరిని నమ్మగలడు?
