Previous Page Next Page 
రాజ హంస పేజి 45

 

    "ఏమిటిది?" అంటూ వెనుకనుంచి మనోరమ గొంతు అతను వినిపించుకోలేదు.
    మనోరమ పరుగెత్తుకుంటూ వచ్చి అతన్ని బలంగా ప్రక్కకి తోసేసింది. ఈ పరిణామం వూహించలేదేమో దిలీప్ ఓవైపు తూలి , క్రిందకు పడబోయి, గోడపట్టుకుని నిల ద్రోక్కుకున్నాడు.
    మనోరమ కొడుకుని క్రిందనుంచి లేవదీసి అక్కున చేర్చుకుంది.
    "మనిషివా పశువ్వా? ఎందుకలా కొడుతున్నావు వాడిని" అతని వంక నిప్పులు గ్రక్కుతూ చూస్తోంది.
    "వీడు.....వేలెడు లేడు, వెధవ సిగరెట్లు, కాలుస్తున్నాడు."
    "ఏమయిందిట కాలిస్తే?"
    "మనోరమా!"
    "ఎందుకలా గావుకేకలు పెడతావు - మేనర్స్ లేకుండా. ఏదో సరదా కోసం కాల్చాడేమో . అంతకన్నా ఏం చేసాడు? ఎవత్తినీ వుంచుకోలేదుగా.
    "మనోరమా!"
    'అట్లా అసహ్యంగా గావుకేక వెట్టోదని చెప్పాను, అసలు నీకేం అధికార ముందని వాడ్ని చావగోడతావు? తగలరాని చోట దెబ్బ తగిలి చచ్చిపోతే?"
    "తల్లివై వుండి వాడు చెడిపోతుంటే శిక్షించక పైగా సమర్దిస్తున్నావా?"
    "అబ్బొ౧ సిగరెట్లు కాలిస్తే చేడిపోయినట్టేనా? నువ్వు మహా బుద్ది మంతుడివయినట్లు. అసలు నువ్వెవడివి శిక్షించడానికి? వాడి బాగోగులు చూసుకునేది నేను, ఈ ఆస్తి నాది. ఈ సామ్రాజ్యానికి నేను యజమానురాల్ని . ఈ ఇంట్లో గాని, నువ్వు నామమాత్రంగా పనిచేస్తోన్న ఆఫీసులో గాని నా అజ్ఞాల ప్రకారం నడవాలి. ఇప్పుడు నీ ముందే వీడితో సిగరెట్ కల్పిస్తాను. ఏం చేస్తావో చెయ్యి."
    రమేష్ దెబ్బల షాక్ నుంచి కోలుకుని మళ్ళీ హీరో ఫోజులు పెడుతూ నిల్చున్నాడు.
    "కాల్చారా! నీకేం భయం లేదు. నేనున్నాను కాల్చు."
    రెండు మూడు సెకండ్లు నిజమేనా అని ఆలోచిస్తూ నిలబడ్డాడు.
    "ఒరేయ్! నీకే చెప్పేది సిగరెట్ కాల్చు."
    రమేష్ స్టయిల్ గా జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీశాడు. అగ్గిపుల్ల వెలిగించి, అంత విలాసంగా సిగరెట్ ముట్టించుకుని పొగ వదులుతున్నాడు.
    ఒకవైపు తన కొడుకు భ్రష్టుడై పోతున్న సత్యం గుర్తించకుండా, వాడి జీవితాన్ని కాల్చేస్తున్నానన్న నిజాన్ని తెలుసుకోకుండా భర్త మీద కసి తీర్చు కుంటున్నానన్న సంతోషంతో వినోదిస్తున్నది.
    దిలీప్ ఈ దృశ్యం భరించలేకపోయాడు. ఇద్దరివంకా అసహ్యంగా చూసి బయట కెళ్ళి పోయాడు.
    ఓ నిమిషం గడిచాక కారు స్టార్టయిన చప్పుడు వినిపించింది. "ఏయ్! ఎక్కడికి?" అంటూ మనోరమ బయటకు పరిగెత్తింది. అప్పటికే కారు ఇల్లు దాటి చాలా దూరం వెళ్ళిపోయింది.
    

                                                          *    *    *

    రాజహంస బయటేవరో గేటు తెరచిన చప్పుడయితే చేతిలోని పుస్తకం లోంచి దృష్టి మరల్చి ఎవరా అని ఎదురు చూస్తున్నది.
    బయటి తలుపు వేసిలేదు.
    తలుపు తెరచుకుంది. లోపలకు దిలీప్ ప్రవేశిస్తూ వుండేసరికి ఉలికిపడి లేచి నిల్చుంది.
    "రాజా!" అంటూ సుడిగాలిలా లోపలకు దూసుకొచ్చాడు.
    'దిలీప్!" అంటూ ఏదో అనబోతోంది. అవకాశమివ్వలేదు. దగ్గరకొచ్చి ఆమెను రెండు చేతులతో బిగించి, గట్టిగా కౌగలించుకుని ముఖమంతా ముద్దులతో నింపేస్తున్నాడు.
    "రాజా! రాజా!' అంటున్నాడు ముద్దులమధ్య కలవరిస్తూన్నట్లు.
    "దిలీప్! విడు. ప్లీజ్' అంటూ ఆమె విడిపించుకునేందుకు ప్రయత్నిస్తోంది.
    "రాజా! రాజా" అంటూ చెంపలూ, కళ్ళూ , చెంపలూ, పెదవులూ ముద్దులు పెట్టేసుకుంటున్నాడు.
    "దిలీప్! చెప్పేది విను, దూరంగా నిల్చుని మాట్లాడు"
    అతను వినిపించుకునే స్థితిలో లేడు. మైకంలో వున్నట్లు ప్రవర్తిన్స్తున్నాడు.
    "రాజా! రాజా! నిన్ను విడిచి వుండలేకపోతున్నాను" అంటూ ఇంకా దగ్గరగా హత్తుకుంటున్నాడు.
    బలమంతా ఉపయోగించి అతని గుండెల మీద చెయ్యి వేసి ఒక్క తోపు తోసింది.
    ఆమె నుంచి చేతులు విడివడి వెనక్కి తూలాడు.
    "దిలీప్! అక్కడే వుండు."
    "రాజా౧ నేచేప్పేది విను, నన్నర్ధం చేసుకో" అంటూ ముందుకు రాబోతున్నాడు.
    "మూర్ఖుడా! చెప్పేది నీక్కాదూ?" అంటూ చెయ్యి జాపి విసురుగా ఒక్క చెంప దెబ్బ కొట్టింది.
    ఒక్కక్షణం దిగ్భ్రమ చెందినా వెంటనే కోలుకున్నాడు.
    "రాజా! నువ్వు కొడితే కొట్టావులే. నాకేం కోపం లేదు. కేవలం వ్యామోహంతో . లేకపోతే కామవాంచతో నేనిక్కడకు రాలేదు. నేనా దుర్భరమైన జీవితంలో ఏ శాంతి లేనిచోట ఇమడలేకపోతున్నాను. అక్కడ సామజిక సూత్రం ఒక్కటి తప్ప ప్రేమ, సత్యం, స్వచ్చత ఏమీ లేవు. అక్కడ ఉన్నదల్లా ఒక్కటే సమాజం ఆమోదించే బాధవ్యం. ఆ బాంధవ్యం ఇంత వికృతమైనదా? దానిచుట్టూ ఇంత విష వాతావరణమా? అది ఓ శాసనంలా భయంకరంగా వున్నా, అనుక్షణం మానసికంగా నలిగిపోతున్నా భరించాలా? రాజా! నేనక్కడ్నుంచి విముక్తి కోరుకుంటున్నాను. డబ్బు మీద, సంపదల మీద నీకూ నాకు ఇద్దరికీ ఇప్పుడు వ్యామోహం లేదు . ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా. దూరంగా .....ఏ బాధ క్కూడా అందని చోట చాలా ప్రశాంతంగా, సామాన్యంగా బ్రతుకుదాం. ఈ సమాజ బాధ్యతలూ, స్నేహాలు మనకొద్దు. నాకు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ కనబడటం లేదు. నా చుట్టూ పరిభ్రమించే ప్రతి వస్తువులో, ఆఖరికి శూన్యంలో కూడా నువ్వే సాక్షాత్కరిస్తున్నావు. మనిషి పుట్టటం, దేనికి? ఏంతో కొంత సుఖం అనుభవించటానికి, దానికీ పూర్తిగా దూరమై , అశాంతికి లొంగిపోయి, మనసనే దానికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా, దాన్ని నలిపేసి చిదిమేసి - ఓ ఆకారం లేని జీవితం బతకటానికి ఇన్ని అంక్షలా? రాజా! కాదనకు. ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం రా. నువ్వు కోరుకున్న బాహాటంగా నాతో బ్రతకగలిగే చోటుకు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS