Previous Page Next Page 
రాజ హంస పేజి 44

 

    ఒకరోజు అర్ధరాత్రి అతని ప్రక్కలో కొచ్చి పడుకుంది. అతని చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కోవటానికి ప్రయత్నిస్తోంది.
    "మనోరమా! ఏమిటిది?"
    "ఏం? మనం మొగుడూ పెళ్లాలం , సంసార సౌఖ్యం లేకుండా వుండమంటావా?"
    "నాకు మనసు బాగాలేదు. ఇలా వుండనియ్యి."
    "మనసు బావుండకపోతే శరీరానికేమయింది? దానికేం జబ్బు చెయ్యలేదుగా?"
    "మనోరమా!"
    "ఎందుకేప్పుడూ మనోరమా, మనోరమా అంటూ వూరికినే మూలుగుతుంటావు. నేనంటే అంత ఏవగింపుగా వుందా?"
    అతనేం మాట్లాడకుండా మెదలకుండా వూరుకున్నాడు.
    "నాకేం యింకా వయసు మించిపోలేదు. కోరికలుండవనుకున్నావా? నువ్వంటే మొగాడివి. బయట పదిచోట్ల తిరిగోస్తావు. అలాంటి అవసరం నీకనిపించకపోవచ్చునుకో"
    "అంత వికృతంగా మాట్లాడకు మనోరమా?"
    "ఉన్న మాటంటే వికృతమా? నువ్వు తిరగాలేదా? ఆ వన్నెల విసనకర్రతో ఏళ్ళ తరబడి కులకలేదా?"
    "మనోరమా!"
    "ఎందుకలా అరుస్తావు? నాకు తడిగుడ్డతో గొంతు కొయ్యటం చేతకాదు. అందుకని వున్నది వున్నట్లు నిక్కచ్చిగా మాట్లాడతాను. నీకెలా కోరికలు , అవసరాలూ వుంటాయో నాకూ వుంటాయి. నేనందరి ఆడవాళ్ళలా ఎవరితో పడితే వారితో పోయే రకం కాదు. అదంటే తిరుగుతుంది కాబట్టి, నువ్వోచ్చినా రాకపోయినా నష్టం లేదు. నువ్వు కాకపోతే యింకొకడు. నేనలా కాదు శీలానికి చాలా విలువనిచ్చే మనిషిని పతివ్రతను అంతగా అయితే ఊరేసుకు చస్తా గాని అలాంటి పోరంబోకు పనులు చెయ్యను.
    కొంతమంది మనుషుల్నేమీ చెయ్యలేం. తిట్టినా, కొట్టినా, ఆఖరికి రెచ్చిపోయినా అంతకు పదిరెట్లు రియాక్షన్ అవతల్నుంచి వస్తూ వుంటుంది.
    ఏం చెయ్యాలో తోచక అమెనో త్రోపు త్రోసేసి బయటకు వెళ్ళిపోయాడు.
    ఆమె సెగలు క్రక్కుతూ మంచం మీద అలా పడుకుండిపోయింది.


                                                               24

    దిలీప్ పెద్ద కొడుక్కి పదేళ్లుంటాయి. పేరు రమేష్. ఎప్పుడూ స్కూలుకు సరిగ్గా వెళ్ళడు. స్కూల్ ఎగ్గొట్టి తరచు ఫ్రెండ్స్ తో సినిమాలకి, వెడుతూ వుంటాడు. వేలేడున్నాడో లేడో వాడికో బ్యాచ్ మ రౌడీ వేషాలు.
    దిలీప్ వాడ్ని పరిశీలిస్తూనే వున్నాడు. వాడి అల్లరి చిల్లరి చేష్టలు, పోకిరి ప్రవర్తన, నిర్లక్ష్య వైఖరి అతను భరించలేకపోతున్నాడు. ఎన్నోసార్లు మందలిద్దామనుకున్నాడు కాని మనోరమకు వాడంటే విపరీతమైన గారాబం. వాడిమీద ఈగ వాలనివ్వదు. అందుకని కోపమంతా దిగమింగుకుని ఊరుకునేవాడు.
    ఓ ఆదివారం సాయంత్రం మనోరమ ఇంట్లో లేదు. బజారుకో, స్నేహితురాలింటికో వెళ్ళింది.
    దిలీప్ ఇంట్లోనే వున్నాడు. గదిలో కూర్చుని చేతిలో ఏదో పుస్తకం తీసుకుని తిరగేస్తూ , ఏకాగ్రత కుదరక లేచి హల్లోకోచ్చాడు.
    రమేష్ - హల్లో సోఫాలో కూర్చుని సిగరెట్ పెదవుల మధ్య పెట్టుకుని కాలుస్తూ విలాసంగా పొగ వదులుతూ వున్నాడు.
    దిలీప్ ఈ దృశ్యం చూసి రక్తం ఉడికిపోయింది. ఏమిట్రా ఇదీ అంటూ గట్టిగా అరిచాడు.
    రమేష్ ఉలికిపడి తండ్రి ముఖంలోకి చూశాడు. వాడికి తండ్రంటే భయం, గౌరవం ఇలాంటివేమీ లేవు గాని ఆ సమయంలో అతని ఉగ్రరూపం చూసి జంకాడు. చేతిలోని సిగరెట్ నేలమీదకు జారిపోయింది.   
    కాని వాడి అహం బిత్తరపోయేటట్లు చెయ్యలేదు. తల్లి అతన్ని చాలా నిర్లక్ష్యంగా , అగౌరవంగా చూస్తుందని తెలుసు. వాడికి ఆ భావాలు నాటుకుపోయాయి. వెంటనే జంకులోంచి ఇవతలికొచ్చి 'చూస్తే' నాకేమిటి అన్నట్లు పొగరుగా , తల బిరుసుగా కూర్చున్నాడు.
    వాడి వైఖరి చూసి దిలీప్ కోపం ఆపుకోలేకపోయాడు. దగ్గరకొచ్చి నిలబడి సిగరెట్లు కాల్చడమే కాకుండా హీరో పోజులు పెడుతూ కూర్చుంటావురా రాస్కెల్ లే అంటూ అరిచాడు.
    రమేష్ బెదరలేదు. చెక్కు చెదరకుండా అలానే కూర్చున్నాడు.
    "లేరా! లెమ్మంటూంటే నీక్కాదూ?" అంటూ అరిచాడు మళ్ళీ.
    అప్పటికీ రమేష్ కూర్చున్న చోటునుంచి కదల్లేదు.
    దిలీప్ ఆగ్రహంతో ఊగిపోతున్నాడు.
    "ఒరేయ్! నేకేరా చెప్పేది?" అంటూ ఇంకా దగ్గర కొచ్చాడు.
    రమేష్ పోజులింకా ఎక్కువచేసి నిర్లక్ష్యంగా అలాగే కూర్చున్నాడు.
    "రాస్కెల్! యింతగా బరుతెగించి పోయవురా! అంటూ జుట్టు పట్టుకుని పైకి లేవదీశాడు.
    రమేష్ ఖంగుతిని , అంతలోనే కోలుకుని విడిపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు గాని వాడి బలం సరిపోవటం లేదు.
    'చెప్పరా చెప్పు. ఇంకెప్పుడూ ఇలాంటి వెదవపని చెయ్యనని చెప్పు" అంటూ జుట్టు వదలకుండా అటూ ఇటూ ఊపి అంతదూరంలో పడేటట్లు విసిరేశాడు.
    రమేష్ బ్యాలెన్స్ నిలద్రోక్కుకోలేక నేలమీద బోర్లా పడ్డాడు. తల టంగుమంటూ నేలకు కొట్టుకుంది.
    వాడ్ని చొక్కా పట్టుకుని మళ్ళీ పైకి లేవదీశాడు. ఉద్రేకం ఆపుకోలేక ఆ చెంపా ఈ చెంపా వాయ కొట్టి పారేస్తున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS