"నేను రాను దిలీప్"
"రాజా!"
"రాలేను దిలీప్."
"రాజా! కొంచెం ఆలోచించు."
"నీకన్నా ఎన్నో రెట్లు ఆలోచించాను దిలీప్. మన ఇద్దరిమధ్యా జరుగుతున్న చరిత్రా స్వభావాలకు సంబంధించినది. చట్టానికి చెందినది కాదు. ఏ చట్టమూ దీన్నీ నిరోధించలేదు. చట్టం శిక్షలు విధిస్తుంది. గానీ, స్వభావాన్ని జయించటం ఎప్పుడన్నా చూశావా? నేన్నీకు దూరమయింది చట్టానికి భయపడి కాదు. ఈ రకమైన దొంగ జీవితానికి మనస్సంగీకరించక. ఇక్కడనుంచి ఎక్కడికో తీసుకుపోయి అక్కడ బాహాటమయిన జీవితాన్ని ప్రసాదిస్తావా దిలీప్? అది అక్కడ బాహాటం. యిక్కడ రహస్యం. అక్కడ కూడా మనస్సులో రహస్యం. అది నాకు సాధ్యం గాకే ఈ దృడ మయిన నిర్ణయాన్ని తీసుకున్నాను. నీది కేవలం కామవాంచ కాదనీ, దాని వెనుక అత్యద్భుతమైన ప్రేమ వున్నదనీ నాకు తెలుసు. కాని ప్రపంచంలో నూటికీ తొంభయి వంతు ప్రేమలకు పరిష్కారం లేదు. మనది తొంభయి శాతంలోకి వస్తుంది . ఈ భూమ్మీద అదృష్టవంతులకన్నా దురదృష్టవంతులు, నిస్సహాయులూ నిర్భాగ్యులూ ఎక్కువగా వుంటారు. మనం ఆ జాబితాలోకి వస్తాం. నువ్వు ఊహించిన మంచి ప్రదేశం కేవలం ఊహల్లో వుంటుంది. కాని వాస్తవిక జగత్తులో ఎక్కడా కనబడదు దిలీప్. మనం వెదుక్కుంటూ వెళ్ళిన కొద్దీ అదింకా దూరంగా జరుగుతూ వుంటుంది. ఈ మనుషుల మతాలు వేరు కావచ్చు. ఆచారాలు వేరు కావచ్చు, నాగరికత వేరు కావచ్చు, సంస్కృతీ వేరు కావచ్చు, బాష వేరు కావచ్చు కాని బుద్దులు మాత్రం ఒక్కటే.....ఈ బుద్దుల నికృష్టమయిన విషవలయం నుంచి మనం తప్పించుకోలెం.
"దిలీప్! మనం ఇలాగే నలిగిపోక తప్పదు. నలిగిపోవటమే మన గమ్యం. అంతకన్నా వేరు దారి లేదు దిలీప్."
* * *
రాత్రి పది దాటి వుంటుంది. రాజహంస మంచం మీద కళ్ళు మూసుకుని పడుకుని వుంది. నిద్రపోవటం లేదు. నిద్ర రావటం లేదు. ఆలోచనలు తరిమి తరిమి కొడుతున్నాయి.
కాలింగ్ బెల్ మ్రోగింది.
ఈ సమయంలో ఎవరోచ్చారు అనుకుంటూ నిలబడి లైటు వేసి ముందు గదిలోకొచ్చి తలుపు తీసింది.
మనోరమ!
ప్రశ్నార్ధకంగా చూస్తూ మౌనంగా నిలబడిపోయింది.
"నా మొగుడోచ్చాడా?"
ఆ మాటలోని అనాగరికతకు తెల్లబోతూ అలాగే నిశ్శబ్దంగా వుండిపోయింది.
"నిన్నే! నా మొగుడిక్కడికొచ్చాడా అని అడుగుతున్నాను."
ఆమె కోలుకుని మొదట "వచ్చారు" అని చెబుతామనుకుంది. కాని ఇలాంటి అహంకారులకు నిజం చెప్పటం వల్ల ఒరిగేదేమీ లేకపోగా వ్యర్ధ ప్రయోజనం కాగలదు అంతేగాక దీన్ని గోరంతలు కొండంతలుగా చేసి అతన్ని రాచి రంపాన పెడుతుంది.
"రాలేదు" అంది.
"నీ మాట నమ్మటమేలా?"
ఆమె కసహ్య మేసింది. "నేను చెప్పాను కాబట్టి నమ్మాలంతే" అన్నది కటువుగా.
"అబ్బో! అంత గోప్పదానివా"
"కొన్ని నిజాలు మాట్లాడటానికి గొప్ప సాదా తారతమ్యాలు ఎంచనవసరం లేదు."
"ఆహా! అలాగా?" అంది వ్యంగ్యంగా.
రాజహంస మాట్లాడలేదు.
"ఎప్పుడో ఏడు గంటల వేళ నా మొగుడు ఇంట్లో తగువేసుకుని కారేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడికే వచ్చాడని అనుమానం."
"ఇక్కడకు వచ్చి వుంటే కారు బయటే ఉండేదిగా."
"కారు అందరికీ కనిపించేలా రోడ్డు మీద పెట్టాలని ఎక్కడుంది? అతని బుర్రలో వెధవ అయిడియాలకు తక్కువేం లేదు. మారుమూల సందుల్లో ఎక్కడయినా దాచి వుంచవచ్చు.'
"అయితే ఇప్పుడేమంటారు?"
"నీ ఇల్లు సోదా చేస్తానంటున్నాను."
"యూ బ్లడీ ఇడియట్ గెటవుట్" అని అందామనుకుని ఆగ్రహాన్ని అణచుకుంటూ వూరుకుంది.
మనోరమ ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా లోపలకు తోసుకుంటూ వెళ్ళింది. ప్రతి గదిలోనూ స్విచ్ లు ఎడాపెడా నొక్కేసి లైట్లు వెలిగాక గాలించి వదిలి పెట్టింది. వంటిల్లూ, డ్రెస్సింగ్ రూం ఆఖరికి బాత్ రూమ్ లు సోదా చేసి పారేసింది.
రాజహంస నిల్చున్న చోటునుంచి కదలకుండా విగ్రహంలా అలాగే నిలబడి వుంది.


