Previous Page Next Page 
మారణహోమం పేజి 45

 

    "ఇపుడు ఇండియాలో నిఖిల్ తో లింక్ ఏర్పరచుకుంటున్నాడు ఆబూనిడాల్. అతనికి నీ పేరు సజెస్ట్ చేసింది నేనే!" అన్నాడు జపాటా నిఖిల్ ఆలోచనలని చదివేస్తున్నట్లుగా. అవసరమైనప్పుడు నువ్వు మాకు హెల్ప్ చేస్తూ ఉండు. మేమూ నీకు హెల్ప్ చేస్తాం. పరప్సర సహకారం ఏమంటావ్?"
    "నో థాంక్స్!" అన్నాడు నిఖిల్.    
    "నా లిమిట్స్ నాకు తెలుసు. నేను చేసేదో ఏదో నా అంతట నేనే నా దేశంలోనే చేస్తాను. విదేశీ శక్తులతో నాకు సంబంధం అవసరం లేదు"    
    వెంటనే జపాటా కళ్ళు చిన్నవి చేసి అతన్ని తీవ్రంగా చూశాడు.    
    "నీ టాలెంట్ ని గురించి స్నేహహస్తం జాస్తున్నాము మేము. తిరస్కరిస్తున్నావు నువ్వు. ఎంత పవర్ ఫుల్ సపోర్టుని దూరం చేసుకుంటున్నావో నీకు అర్ధం కావడం లేదు. జపాటా, కార్లోస్, అబూనిడాల్ వీళ్ళందరూ అల్లాటప్పా మనుషులనుకుంటున్నావా ఏమిటి? ఒక్కొక్కడూ ఒక్కొక్క అదరగండం లాంటివాడు. మేం ఇకనుంచి ఆ కార్యక్రమాలు ఉధృతం చెయ్యదలుచుకున్నాం. దానికోసం ఇండియాలో మాకొక బేస్ కావాలి. అది నువ్వే ఏర్పరచాలి. దానికి బదులుగా నీకు ఎప్పుడు ఏ సహాయం కావలసివచ్చినా మా ఆర్గనైజేషన్స్ అన్నీ అండగా ఉంటాయి. లివ్ అండ్ లెట్ లివ్! టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ అన్నీ కలసి ఏర్పడుతున్న ఈ సమాఖ్యలాంటి దానికి "సన్స్ ఆఫ్ గన్స్" అని పేరు పెడుతున్నాను నేను. ఎలా ఉంది? చాలా నావెల్ గా లేదూ? తుపాకులే మన గతం. మన మతం, మన జీవితం కూడా. నువ్వు ఇండియాలో ఏదన్నా భారీఎత్తున చెయ్యాలని తలపెట్టి మీ ప్రభుత్వంతో తలపడితే మేము నీకు అన్ని విధాలుగా సహకరిస్తాము.    
    ఆలోచించుకో మై ఫ్రెండ్! సన్స్ ఆఫ్ గన్స్ సమాఖ్యలో చేరే అమోఘమైన అవకాశం అందరికీ రాదు. అందుకో, జార విడుచుకోకు!"    
    "థాంక్యూ! నాకు అవసరం లేదు!" అని ఇంకేమిటి అన్నట్లు చూస్తూ నిలబడ్డాడు నిఖిల్.    
    అదోలా నవ్వాడు జపాటా.    
    "సో! అదేనన్నమాట నీ నిర్ణయం?"    
    తల పంకించాడు నిఖిల్.    
    "అయితే నీ మరణశాసనాన్ని నీ చేతులతో నువ్వే రాసుకున్నావన్న మాట! నువ్వు మాతో చేరాలని కోరుకుని, చేరతావని ఆశించి చాలా వివరాలు చెప్పేశాను. ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఇంక నువ్వు మాతో కలిసిపోయి అన్నా ఉండాలి, లేదా నీ పూర్వీకులని కలుసుకోడానికి పైకి వెళ్ళిపోవాలి. అవునా? ఫేర్ వెల్ మై ఫ్రెండ్! నీ జీవితానికి ఇదే ముగింపు" అంటూ బెరెట్టా అనే చిన్న గన్ తీసి నిఖిల్ వైపు గురి పెట్టాడు జపాటా.    
    అప్పుడు వినబడింది ఆ శబ్దం. ఒక పెద్ద చక్రం గాలిని స్లయిసెస్ గా తరుగుతున్నట్లు!    
    హెలీకాఫ్టర్ ఆకాశంలో దూరంగా చుక్కలా కనబడుతూ క్రమంగా దగ్గరవుతోంది.    
    "ఆబూనిడాల్" అన్నాడు జపాటా ఉద్విగ్నంగా. "ఫ్రెండ్ ఎలాగూ చచ్చిపోతున్నావు. చనిపోయే ముందు మృత్యుదేవత మొహం ఒక్కసారి చూసి ముఖాముఖి మాట్లాడాలని ఉందా? అయితే వెయిట్ చెయ్యి!"    
    జపాటా సైగను అందుకుని ఒక అనుచరుడు చెట్ల గుబురులో నుంచి ఒక మనిషిని బయటికి నడిపించుకు వచ్చాడు. అతని కుడిచేతికి బేడీలు వేసి ఉన్నాయి. ఆ బెడీలకు గొలుసు ఒకటి వేలాడుతోంది. క్రూరమైన హింసకు గురిఅయిన వాడిలా అతని మొహం అంతా వాచిపోయి ఉంది. తూలుతూ నడుస్తున్నాడు.    
    జపాటా అనుచరుడు నిఖిల్ ఎడమ చేతికి సంకెళ్ళు వేసి, రెండో ఖైదీ చేతికి వేలాడుతున్న గొలుసుని దానికి తగిలించాడు. ఆ ఖైదీ, నిఖిల్ ఇద్దరూ దూరదూరంగా వెళ్ళిపోకుండా ఆ గొలుసు నిరోధిస్తోంది.    
    హెలికాఫ్టర్ శబ్దం చాలా దగ్గర అయింది. విష్ణుచక్రంలా రివ్వున తిరుగుతున్న దాని రెక్కల వేగానికి ఉధృతంగా వీస్తూ అక్కడ ఉన్న ఆకులనీ, మట్టినీ ఎగసిపడేలా  చేస్తోంది. గాలికి ఎగురుతూ మంటలా కనబడుతున్న తన ఎర్రటి జుట్టుని చేత్తో సరిచేసుకుంటూ పైకి చూస్తున్నాడు జపాటా.    
    నిఖిల్ కూడా చూశాడు.    
    హెలికాఫ్టర్ బ్రహ్మాండమైన తూనీగలా కనబడుతోంది. అది కాళ్ళతో మరో చిన్న కీటకాన్ని పట్టుకుని ఉన్నట్లు దానికింద భాగంలో ఒక ట్రక్కు వేలాడుతోంది.    
    హెలికాఫ్టర్ మరికొంచెం కిందికి వచ్చి గాలిలోనే ఆగింది. ట్రక్కు టైర్లు ఇపుడు నేలని తాకుతున్నాయి.    
    హెలికాఫ్టర్ ఫైలెట్ కొన్ని మీటలు నొక్కాడు. ట్రక్కు హెలికాఫ్టర్ నుంచి విడివడి నేలమీద నిలిచింది.    
    మళ్ళీ గాల్లోకి లేచింది హెలీకాఫ్టర్.    
    అప్పుడు అకస్మాత్తుగా జరిగింది అది. ట్రక్కు దిగిన ప్రదేశం సమతలంగా లేదు. కొంచెం ఏటవాలుగా ఉండి, కొంత దూరం వెళ్ళాక దాదాపు నిట్టనిలువునా సముద్రంవైపు జారిపోతున్నట్లు ఉంది నేల.    
    ట్రక్కుకి నిలబడడానికి సరిగా పట్టు దొరికినట్లు లేదు. ఉన్నట్లుండి చక్రాలు వెనక్కి దొర్లడం మొదలెట్టాయి. పల్లంలోకి వేగంగా జారిపోతోంది ట్రక్కు.    
    వెంటనే గందరగోళం మొదలయింది. జపాటా స్పానిష్ ఆర్డర్స్ జారీ చేస్తున్నాడు. అతని మనుషులందరూ పరిగెత్తి ట్రక్కును ఆపడానికి చూశారు.    
    తప్పించుకు పారిపోవడానికి ఇదే సరైన అదను అని అనిపించింది నిఖిల్ కి. చేతికి ఉన్న బేడీలవేపు పక్కఖైదీతో తనని కట్టిపడేస్తున్న గొలుసువైపూ ఓరకంటితో చూశాడు. గొలుసు బాగా దృఢంగా ఉంది. పక్కనున్న ఖైదీ తనతో సహకరించే స్థితిలో లేడు. ఏ క్షణాన అయినా సోలిపోయేటట్లు ఉన్నాడతను. ఇద్దరూ కలిసి పారిపోవడం అసంభవం.    
    "చూస్తూ నిలబడ్డారేం! మీరుకూడా ఒక చెయ్యి వెయ్యండి?" అన్నాడు జపాటా మొరుగుతున్నట్లు.    
    జాలిగా తన తోటి ఖైదీవైపు చూసి ట్రక్కు దగ్గరికి నడిచాడు నిఖిల్. అందరూ శక్తి అంతా ఉపయోగించి పల్లంలోకి జారుతున్న ట్రక్కుని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బలహీనంగా ఉన్న కాళ్ళని తన్నిపట్టి రొప్పుతూ చేతులతో ట్రక్కుని ఆపుతున్నాడు ఆ రెండో ఖైదీ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS