Previous Page Next Page 
మారణహోమం పేజి 46

 

    వందమంది చుట్టుముట్టి పట్టుకున్నా లొంగని రాక్షసిలా వెనక్కి వెనక్కి జారుతోంది ట్రక్కు.    
    ఉన్నట్లుండి కాలుజారి క్రింద పడిపోయాడు ఆ ఖైదీ.
    "ట్రక్కు ఇంకా వెనక్కి జారింది. బేడీలు ఉన్న అతని చెయ్యి ట్రక్కు టైరు కింద ఇరుక్కుపోయింది. దుర్భరమైన బాధతో కేకపెట్టాడు అతను.
    ఆ తర్వాత అతను పెట్టిన ఆర్తనాదాలు అక్కడ ఉన్న కొండలనూ, బండలనూ కూడా కరిగించేలా ఉన్నాయి.
    "ఏమిటీ వాడిగోల? మేకలా అరుస్తారెందుకు?" అన్నాడు జపాటా విసుగ్గా సైగచేస్తూ.
    అతని సూచనని అర్ధం చేసుకున్న అనుచరుడొకడు హడావుడిగా పరిగెత్తి ఒక చురకత్తిని తీసుకొచ్చాడు.
    జరగబోతున్నది అర్ధం చేసుకున్న ఖైదీ దిక్కులు పిక్కటిల్లేలా మరో కేక పెట్టాడు.
    జపాటా అనుచరుడు కత్తి ఎత్తి ఖైదీ మోచేతి దగ్గర బలంగా ఒక దెబ్బ వేశాడు.
    "య్యో!" అని మళ్ళీ కేకపెట్టాడు ఆ ఖైదీ. ఆ కేక పూర్తీకాక ముందే అతనికి స్పృహ తప్పింది బాధతో.
    అతని శరీరం నుండి విడివడిన ఆ చెయ్యి, తనకి వేరేగా సొంత ప్రాణం ఉన్నట్లు కాసేపు విలవిల కొట్టుకుంది. ఆ కొట్టుకోవడంలో దానికి ఉన్న సంకెళ్ళు విడిపోయాయి. ఆ తర్వాత నిశ్చలంగా అయిపొయింది అది.
    ఆ చేతి వైపు చూసి నిట్టూర్చాడు నిఖిల్.
    ట్రక్కు మరికొంత వెనక్కి జారింది.
    చటుక్కున కిందికి ఒంగి ట్రక్కు కిందకు దూరిపోయాడు నిఖిల్. అతని ఎడమచేతికి ఇప్పుడు బేడీలు ఉన్నాయి. బేడీలకు గొలుసు ఉంది. కానీ ఆ గొలుసు చివర మరో ఖైదీ లేడు.
    అతికష్టం మీద ట్రక్కుని ఆపగలిగారు జపాటా అనుచరులు. పల్లంలో నుంచి దాన్ని ముందుకు తోసుకెళ్ళి తలుపులు తెరిచాడు.
    "హలో అబూ!" అన్నాడు జపాటా లోపలికి తొంగిచుస్తూ.
    జవాబు లేదు!
    లోపల అబూనిడాల్ లేడు!
    జపాటా మోహంలో ఆశ్చర్యం కనబడింది.
    చటుక్కున వెనుదిరిగాడు.
    "అబూ ఏడి? అబూ ఏడీ?" అంటున్నారు అనుచరులంతా. ఆ రక్త పిపాసిని నరరూప పిశాచిని చూడాలన్న కుతూహలం వాళ్ళ కళ్ళలో గోచరిస్తోంది.
    కొద్ది క్షణాలు మొహం చిట్లించి ఆలోచించాడు జపాటా. తర్వాత అర్ధమైనట్లు పెద్దగా నవ్వాడు. "తెలిసింది! అబూనిడాల్ కి ఇది అలవాటే! ఒక చోటికి వెళుతున్నానని అందరినీ నమ్మించి వేరే దిశగా వెళ్ళిపోయి అక్కడ వాళ్ళనీ, ఇక్కడ వీళ్ళనీ ఆశ్చర్యంలో ముంచి పారెయ్యడం , ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే అద్భుతాలేవో చేసెయ్యడం. దటీజ్ అబూ" అన్నాడు మెచ్చుకోలుగా. అని ఆగి హటాత్తుగా గుర్తు వచ్చినట్లు అన్నాడు.
    అందరూ ఆదుర్దాగా చుట్టూ చూశారు.
    చేతికి ఉన్న గొలుసుని ఈడ్చుకుంటూ జారుడు బండలా ఉన్న ఆ పల్లంలోకి త్వరత్వరగా దిగిపోతున్నాడు నిఖిల్. బ్యూటీ స్పాట్ చెంగు చెంగున గెంతుతూ అతని పక్కన పరిగెడుతోంది. రెండు మూడు వందల మీటర్ల లోతులోకి దిగిపోతోంది ఆ పల్లం కిందగా సముద్రం ఆకుపచ్చ రంగులో కనబడుతోంది.
    "షూట్ హిమ్" అన్నాడు జపాటా కర్కశంగా.
    వెంటనే "ఠీష్యు.........ఠీష్యు........ఠీష్యు" అని శబ్దాలు బుల్లెట్ల వర్షం అతను  వెళుతున్న దిశలో కురవసాగింది. శక్తినంతా కాళ్ళలోకి తెచ్చుకుని మరింత వేగంగా పరిగెత్తడం మొదలెట్టాడు నిఖిల్.
    ఉన్నట్లుండి "కుయ్యో" మని మూలిగింది కుక్క. ఒక బులెట్ దాని ముందు కాలిని రాచుకుంటూ పోయింది.
    కిందపడి పోయింది బ్యూటీ స్పాట్. దాన్ని తట్టుకుని నిఖిల్ కూడా కిందపడ్డాడు. అతి వేగంగా కిందికి దొర్లిపోవడం మొదలెట్టారు ఇద్దరూ. అప్పటికే తుపాకులకు అందనంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు.
    కింద సరిగ్గా ఆ ప్రదేశంలో ఒక మోటారు బోటు లంగరు వేసి ఉంది. దానిలో జపాటా అనుచరుడొకడు కూర్చుని జోగుతున్నాడు. అతనికి బుల్లెట్ ల చప్పుడు కలలోలా వినబడింది. చటుక్కున కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచీ తెరవగానే కాలభైరవుడిలా తన మీదకు దూకి కాలు పట్టేసుకున్న కుక్క కనబడింది. భయంతో వెర్రికేక వేసి తుపాకీ కోసం చెయ్యి జాచాడు అతను. ఒక్క అంగలో అతన్ని చేరుకొని తన చేతిలోని బేడీలకు వేలాడుతున్న గొలుసుతో బలంగా కొట్టాడు నిఖిల్. ఆ దెబ్బకు అతని షర్టు చిరిగింది. ఎర్రటి రక్తపు చార ఏర్పడింది భుజమ్మీద. నేల మీద పెట్టి వున్న గన్ ని అందుకుని అతని వైపు గురి పెట్టాడు నిఖిల్.
    "క్విక్! బొట్ స్టార్ట్ చెయ్"
    ఎప్పుడు లొంగి ఉండాలో, ఎప్పుడు తిరగబడాలో ఆ అనుచరుడికి బాగా తెలుసు. మారుమాట్లాడకుండా లేచి ఇంజన్ స్టార్ట్ చేశాడు.
    గోడకి అనుకుని జారగిలబడి కూర్చున్నాడు నిఖిల్. అతని మోకాళ్ళ మధ్య గన్ గురిచుస్తూ ఉంది. అతని పాదాల దగ్గర వృత్తాకారంలో ముడుచుకు పడుకుని ఉంది బ్యూటీ స్పాట్. నీళ్ళనీ చీల్చేస్తూ ముందుకు వెళ్ళిపోతోంది బోటు.
    అప్పుడు మొదటిసారిగా స్థిమితంగా ఆలోచించడం మొదలెట్టాడు నిఖిల్. ఏమిటిదంతా? జరుగుతున్నదంతా కలా నిజమా? తనకు చేతనయినంతవరకూ తన పరిధిలో తాను అన్యాయాల మీద తిరగాబడుతూ అమాయకులకు రక్షణ ఇస్తూ ఉన్నాడు ఇంతకాలం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS