Previous Page Next Page 
మారణహోమం పేజి 44

 

    1935 సంవత్సరం డిసెంబర్ రెండవ తారీఖున ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన అబూ నిడాల్ జాఫ్పాలో పెరిగాడు. జాఫ్ఫా ఇప్పుడు ఇజ్రాయెల్ లో చేరిపోయింది.    
    దాదాపు రెండువేల సంవత్సరాల క్రితం యూదుల మధ్య ఆసియాలోని తమ జన్మభూమిని వదిలి ప్రపంచంలోని నలుమూలలకి చెల్లాచెదురయిపోయి పారిపోవలసిన పరిస్థితులు వచ్చాయి. రెండువేల సంవత్సరాలపాటు దుర్భరమైన బాధలను అవమానాలను సహించింది యూదు జాతి. హిట్లర్ జర్మనీలో యూదు జాతిని రూపుమాపెయ్యాలనే ప్రయత్నంలో క్రమబద్దమైన జెనోసైడ్ జరిగింది. మిలియన్ల మంది యూదులని ఊచకోత కోశారు. అయినా ఆ జాతి తుడిచి పెట్టుకుపోలేదు. ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఐన్ స్టెయిన్ మొదలుకుని అణువుని మొదటిసారిగా బద్దలు చేసిన శాస్త్రవేత్తల దాకా ఎందరో జీనియస్ లకు జన్మనిచ్చింది ఆ జాతి.    
    తమకంటూ ఒక సొంత దేశం లేకుండా వాళ్ళ పంచనా వీళ్ళపంచనా బతుకుతున్న యూదులకి హిస్టారికల్ గా వాళ్ళ నేటివ్ లాండ్ అయిన పాలెస్తీనాలో స్థిరనివాసం ఏర్పాటు చెయ్యాలనీ, అక్కడే ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించాలనీ అగ్రరాజ్యాలు కొన్ని అగ్రిమెంటుకి వచ్చాయి. ఈ మధ్యకాలంలో అక్కడ సెటిలయిపోయిన అరబ్ ముస్లిమ్ జనాభాకి ఈ పరిణామం అతి తీవ్రఘాతమయింది. తమదేశం తమ కళ్ళ ముందే రూపుమారిపోవడం వాళ్ళకి గుండెకోతని కలిగించింది. పాలస్తీనాను తిరిగి స్థాపించుకునేందుకు తమ గుండె మీద వ్రణంలా లేచిన ఇజ్రాయేల్ ని ప్రపంచపటంలో లేకుండా తుడిచేసేటందుకు కంకణం కట్టుకున్నారు. ఎన్నో యుద్దాలు జరిగాయి.    
    అతి చిన్నదేశమైనా అత్యంత సాహసోపేతంగా పోరాడిందిగానీ లొంగలేదు ఇజ్రాయేల్.    
    (నిస్పృహకు లోనై విద్యాధికులయిన పాలస్తీనియన్ యువత ఉగ్రవాదానికి మారి గెరిల్లా పద్దతులు అవలంబించింది. ఆ విధంగా ఎందరో యాసిర్ ఆరాఫత్ లూ అబూనిడాల్ లు పుట్టుకొచ్చారు.)    
    1948 యుద్దంలో ఆబూనిడాల్ బెయిరూట్ కి పారిపోయి అక్కడ ఇంజనీరింగ్ చదివాడు.    
    1965 ప్రాంతంలో అతను యాసిర్ ఆరాఫత్ నాయకత్వంలో ఉన్న ఆల్ ఫటా కమెండో ఆర్గనైజేషన్ లో చేరాడు. తన నాయకత్వపు లక్షణాలతో త్వరత్వరగా పైకి వచ్చేసి ఆబూనిడాల్ (ఉద్యమానికి తండ్రి) అనే బిరుదు పొందాడు. 1974 కల్లా తమ నాయకుడైన యాసిర్ ఆరాఫత్ తొ విభేదాలు వచ్చాయి అతనికి. కొన్ని ప్రదేశాలలో ఇజ్రాయెల్ మీద జరుపుతున్న దాడులని ఆపు చెయ్యమన్న ఆరాఫత్ ఆజ్ఞని అతను పాటించనన్నాడు.    
    ఆ తర్వాత కొద్ది కాలానికే అతను ఆరాఫత్ నే చంపడానికే పెద్ద ప్లాను వేశాడు. ఆరాఫత్ బృందం రహస్యంగా అతన్ని "కోర్ట్ మార్షల్" పద్దతిలో విచారణచేసి మరణశిక్ష విధించింది. అబూనిడాల్ తక్షణం అండర్ గ్రవుండ్ కి వెళ్ళిపోయి తనంతట తాను ప్రత్యేకమైన గెరిల్లాదళాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ 1975 లో సర్ ఫేస్ అయ్యాడు.    
    అతని పద్దతులు గమనించేవారు చెప్పేదేమీటంటే అతనికి మానసికంగా దెబ్బ తిని ఉన్నవాళ్ళను తేలిగ్గా గుర్తించే అద్బుతమైన శక్తి ఉంది. వాళ్ళను తన మార్గంలోకి మళ్ళించుకునే చాకచక్యం ఉంది.    
    ఉగ్రవాదులలో తను "మోస్ట్ వాంటెడ్ గెరిల్లా" అయినా కూడా చాలా సాదాగా ఉంటాడు అబూనిడాల్. అతను పబ్లిక్ ప్లేసెస్ లో కనబడడం దాదాపు జరగదు. అతని జీవితాన్ని గురించిన వివరాలు క్షుణ్ణంగా ఎవరికీ తెలియవు. ఒకవేళ తెలిసినా అవి ఒకదానికొకటి పరస్పర విరుద్దంగా ఉంటాయి. 1984 లో అతను హార్ట్ అటాక్ తొ చనిపోయాడని పుకారు వచ్చింది. కానీ కొద్దిరోజుల తర్వాత అతను మళ్ళీ సర్ ఫేస్ అయ్యాడు. "నేను ఎవరినో నా కొడుకుని కూడా సరిగ్గా తెలియదు" అని రొమ్ము విరిచి చెప్పుకున్నాడు ఒక ఇంటర్ వ్యూలో. 1978 తర్వాత అతన్ని ఎవరూ ఫోటో తియ్యగలిగినట్లు కూడా దాఖలా లేదు. మారు వేషాలు వెయ్యడంలో అతన్ని మించినవాళ్ళు లేరని ప్రతీతి. తను ఇటలీలో, ఆస్ట్రియాలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని రెండుసార్లు తన రూపురేఖలు పూర్తిగా మార్చుకున్నాడు.    
    యుద్ద బాధితులయిన పాలస్తీనియన్లకి అతను తండ్రి లాంటివాడు. దుర్భేద్యమైన ఇజ్రేలీ యుద్దశక్తికి ఎదురొడ్డి నిలిచి, తన ప్రజలకు ఆత్మవిశ్వాసం కలిగిస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ప్రతీకార జ్వాలలు చేసేవాడు ఆబూనిడాల్.    
    ఆబూనిడాల్ ని గురించి మరొక ముఖ్యమైన విషయం గుర్తొచ్చింది నిఖిల్ కి.    
    "ప్రపంచం మొత్తంలో ఉన్న టెర్రరిస్టు ఆర్గనైజేషన్స్ అన్నిటిలోనూ అత్యంత సమర్ధవంతంగా పనిచేసే గ్రూపు" అని అమెరికన్ గూఢచారుల చేత వర్ణించబడి "బ్లాక్ సెప్టెంబర్, "ఆర్ ఆస్సిఫా", "అరబ్ రివల్యూషనరీ బ్రిగేడ్", "కిన్స్ మెన్ ఆఫ్ పాలెస్తీనియన్ మార్ టైర్స్" అని అనేక పేర్లతో వ్యవహరించబడే ఆబూనిడాల్ గ్రూపులో ఏనాడూ కూడా అయిదు వందల కంటే ఎక్కువమంది సభ్యులు లేరు!    
    అతని ఫైటింగ్ ఫోర్సు (యుద్దదళం)లో ఉండేవారి సంఖ్య ఎప్పుడూ పదుల్లోనే ఉంటుంది!!    
    వందల్లో కూడా కాదు!!!    
    ఆలోచనలో పడ్డాడు నిఖిల్.    
    పదుల సంఖ్యలో ఉండే ఈ తీవ్రవాదులే ప్రపంచాన్ని గడగడలాడిస్తూ గత ఒక్క సంవత్సరంలో ఇరవై టెర్రరిస్టు అటాక్స్ చేసింది! ఈ కొద్దిమంది కలిసేనా జోర్డానియన్ ఎయిర్ లైన్సు మీదా, విదేశీ రాయబారులమీదా దాడులు జరిపింది? గ్రీసులోనూ, స్పెయిన్ లోనూ, ఇటలీలోనూ, కువైట్ లోనూ, మారణహోమం చేసింది? వీళ్ళేనా ఆమ్ స్టర్ డామ్ లో ఎల్ ఆల్ ఆఫీసులను ధ్వంసం చేసి నవంబర్ 85లో ఈజిప్షియన్ విమానాన్ని హైజాక్ చేసుకువెళ్ళింది? అంటే పట్టుమని పదిమంది కలసి పట్టుదలగా పనిచేస్తే ప్రపంచ ప్రజలందరినీ భయభ్రాంతులని చెయ్యగలగడం సంభవమా?    
    అన్నిటికంటే ఆసక్తికరమైన విశేషం మరొకటి గుర్తొచ్చింది నిఖిల్ కి.    
    ఆబూనిడాల్ ఆర్గనైజేషన్ ఒంటరిగా పని చెయ్యదు!    
    దానికి విదేశాల్లో ఉన్న చాలా ఎక్స్ ట్రీమిస్టు ఆర్గనైజేషన్స్ తో దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఇటలీలోని "రెడ్ బ్రిగేడ్స్"తో, స్పెయిన్ లోని "ఎటా"తో, ఫ్రాన్స్ లోని "యాక్షన్ డైరెక్ట్" తో, వెస్ట్ జర్మనీలోని "రెడ్ ఆర్మీ" తో, బెల్జియం లోని "కమ్యూనిస్టు సెల్స్"తో, నార్తరన్ ఐర్లాండులోని "ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ" తో లింకులు ఉన్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS