Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 45


    వెంటనే తల వంచేసింది. సిగ్గుతో అటు చూడలేదు.


    అతను ఒక్కో అడుగేవేస్తూ దగ్గరగా వచ్చాడు.


    "నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నాడు మెల్లగా.


    "ఎందుకు?" అడిగింది.


    "ఎందుకా ఈ అందాలరాణి నాకు మనసు ఇవ్వడానికి అంగీకరించి నందుకు" నవ్వాడు.


    ముఖమదోలా పెట్టింది. కళ్ళనీళ్ళు గిర్రున తిరిగాయి.


    బేలగా చూసింది అతనివైపు.


    కళ్ళల్లో నీటిపొర తళుక్కున మెరిసింది.


    ఇందూ! అంటూ కంగారుగా ఒక్క అడుగు ముందుకి వేశాడు.


    అతను అడుగు ముందుకు వెయ్యగానే ఆమె ఒక్కడుగు వెనక్కివేసి దూరంగా వెళ్ళింది.


    "నన్ను క్షమించండి" అంది.


    "ఎందుకు?"


    "మిమ్మల్ని ఇన్నాళ్ళు అర్ధం చేసుకోలేనందుకు" అంది కన్నీళ్ళతో.


    "ఓ అదా" అంటూ నవ్వేసి.


    "మనలో మనకు క్షమార్పణలు ఏమిటి ఇందూ! నువ్వు నా కాబోయే భార్యవు నేను నీ కాబోయే భర్తను" అన్నాడు.

    
    ఇంద్రసేన సంతోషంగా చూసింది.


    "ఇందూ!" అతను ఒక్కడుగు వేశాడు.


    ఆమె అతన్ని అక్కడే ఆగమంటూ సైగచేసి "దగ్గరకు రావద్దు" అంది మెల్లగా.


    ఆమెవైపు పరీక్షగా చూస్తూ.


    "ఎందుకనో" కొంటెగా అడిగాడు.


    "పెళ్ళికాకుండా ఒకర్ని ఒకరు తాకకూడదు" అంది సిగ్గుపడుతున్నట్లుగా.


    ఆ మాటలు వింటూనే అతను గట్టిగా నవ్వేస్తూ ఒక్కసారిగా ఆమె చెయ్యి అందుకున్నాడు ఆమె కంగారుగా చూసింది.


    "ముందు చెయ్యి వదలండి" అంది అతని చెయ్యి విడిపించుకోవడానికి చూస్తూ.


    ఉహు కళ్ళతోనే చెప్పాడు నిన్ను వదలను అన్నట్టుగా.


    "అయ్యయ్యో వదలండీ ఎవరయినా చూస్తారు" అంది కంగారుగా.


    ఆమె కోపంగా అనలేదు శాంతంగా సిగ్గుపడుతున్నట్టుగానే చెప్పింది.


    "ఇలా కూర్చో" అంటూ మంచం మీద కూర్చోబెట్టి అతను పక్కన కూర్చున్నాడు.


    ఇంద్రసేన చాలా ఇబ్బంది పడిపోయింది. ఇష్టంలేని వ్యక్తి దగ్గర అలా ఇష్టమున్నట్టు నటిస్తూ పక్కన కూర్చోవటం చాలా కష్టం అనుకుంది.


    మనసులో కోపం ఎగిసిపడుతుంది.


    ఈ సమయంలో కోపం తొందరపాటు పనికిరాదు.


    శాంతంగా పని చక్కదిద్దాలి అనుకుంటూ.


    అతనివేపు చూసి నవ్వింది.


    కృష్ణమౌళి నవ్వుతూ అడిగాడు.


    "నీలో చాలా మార్పువచ్చింది సుమా ఎందుకనో!"


    "మీరంటే నాకు ఎప్పుడూ కష్టమే."


    "నిజంగా" ఆమె భుజంపట్టి గుచ్చి ప్రశ్నించాడు. సంతోషం పట్టలేనట్టుగా.


    "ఏమిటి అంత ఆశ్చర్యం" నవ్వింది.


    "కాదా మరి"


    "ఎందుకో!" కావాలని అతన్ని కవ్వించింది.


    "ఎందుకా ఈ అందాల సుందరి త్వరలో నాకు భార్య కావడానికి ఇష్టపడుతుంది అని"


    "మరి ఆ రోజు ఎప్పుడో" సిగ్గుపడుతూ అడిగింది.


    "ఎప్పుడా నువ్వు ఎప్పుడు అంటే అప్పుడే మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయిస్తాను" అన్నాడు నవ్వుతూ. ఇంద్రసేన ముఖం అదోలా పెట్టి లేచి అటువేపుగా ఒక్క అడుగువేసి తల తిప్పి చూస్తూ.


    "మీరు భోజనం చేసారా?" అడిగింది.


    "లేదు చేస్తాను" అన్నాడు.


    "ఇంకా భోజనం చెయ్యలేదా?" అంటూ అక్కడ ఉన్న స్వీటు తెచ్చి అతనికి అందించింది.


    స్వీటు తీసుకుంటూ నవ్వుతూ అన్నాడు.


    "ఈ రోజు నీలో చాలా మార్పు వచ్చింది."


    "మార్పు కాదు బెంగ అండీ"


    "బెంగా ఎందుకు" ఆశ్చర్యంగా అడిగాడు.


    "అవును బెంగే మనం పెద్దవాళ్ళకి ఇష్టంలేకుండా పెళ్ళి చేసుకోబోతున్నాం అందుకు" అంది అతని చేతులుపట్టి ప్రాధేయపడుతూ.


    "ఏమిటి ఇందూ!" అడిగాడు నవ్వుతూ.


    "మన పెళ్ళికి ముందు మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను"


    "ఏమిటి చెప్పు!"


    "మీరు తీరుస్తాను అంటే చెప్తాను లేదా చెప్పను" అంతే.


    "తప్పకుండా తీరుస్తాను" ఆమె చేతిలో చెయ్యివేశాడు. నమ్మకంగా చెబుతూ.


    "మన పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేయించండి. నేను కారులో గుడికి వెళ్ళి దేముడిని మనసారా ఒక కోరిక కోరుకుంటాను. ఈ పెళ్ళి అయ్యాక ఎవ్వరూ విడిపోకూడదు అందరం కలుసుకోవాలని ప్రార్ధిస్తాను"


    దేముడు వింటాడు అంటావా!


    "తప్పకుండా" అంది నమ్మకంగా.


    "అయితే మన యిద్దరం గుడికి కలిసే వెళదాము" అన్నాడు.


    "ఉహు పెళ్ళికి ముందు నేను ఒక్కర్తెనూ వెళతాను. పెళ్ళయ్యాక పసుపు బట్టలతో మనయిద్దరం కలిసి వెళదాము" అంది నవ్వుతూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS