ఒకవైపునుండి ఆమెకు దుఃఖం వచ్చేస్తుంది.
ఇక్కడ బందీ అయిపోయింది.
తప్పించుకోవటం ఎలా?
అదే ఆలోచన అదే భయం కన్నీళ్ళు చెంపలపై దారలు కట్టసాగాయి.
* * *
అంతరాత్మ గట్టిగా అరిచి చెప్పింది.
"ఎందుకు అలా ఏడుస్తావు!
ఏడ్చి ఏం సాధిస్తావు!
ఏడ్చినందువలన ఫలితం ఏమిటి!
ఉపాయం కోసం వెతుక్కో
ఎత్తుకు పై ఎత్తు వేసి అతన్ని చిత్తిచేయి. తప్పించుకు వెళ్ళిపో అతను ఏం చేస్తాడు? ఏం చెయ్యలేడు.
ఇంద్రసేన ఆలోచించసాగింది.
అవును నిజం అంటూ కళ్ళు తుడుచుకుంది.
కృష్ణమౌళికి తగిన శాస్తి చెయ్యాలి ఎలా!
ఇలా ఇందూ కసిగా ఆలోచిస్తూ కూర్చుంది. ఆమెకు వెంటనే చక్కని ఉపాయం దొరికింది. ఆమె ముఖం సంతోషంతో విప్పారింది.
ఈ దెబ్బతో కష్ణమౌళి ఆట కట్టు అనుకుంది కసిగా.
అక్కడ వున్న బటన్ నొక్కింది.
మణి తలుపు తెరుచుకు వచ్చింది.
ఎందుకు పిలిచావు అన్నట్లు.
ఇందూ మనసులోనే కోపాన్ని దిగమింగుకుంటూ పైకి చిన్నగా నవ్వింది.
"మణీ" అంది మెల్లగా.
"ఏమిటి!"
"నేను.... నేను...." అంది మెల్లగా.
"ఏమిటో చెప్పు"
"నేను మనసు మార్చుకున్నాను. నీవు చెప్పినట్లే వింటాను"
"అంటే!" అనుమానంగా చూసింది.
"అదే ఆయన్ని పెళ్ళి చేసుకుంటాను" మెల్లిగా చెప్పింది.
మణి క్షణంసేపు అలాచూసి.
"అయితే చాలా సంతోషమే! వెళ్ళి స్నానంచేసి బట్టలు మార్చుకో భోజనం చేద్దువుగాని"
"ఇప్పుడా!
'బాగుంది ఇంకెప్పుడు భోజనం చేస్తావు వెళ్ళి స్నానంచేసిరా' అన్నది మణి.
ఇంద్రసేన ఉషారుగా తన పెట్టి వద్దకు వెళ్ళి బట్టలు తీసుకుంటూ ఓరగా మణివైపు చూసింది.
మణి ఆమెవైపు చూడలేదు.
ఇందు ఉషారుగా బాత్ రూమ్ వైపు వెళ్ళింది. స్నానంచేసి బట్టలు మార్చుకు వచ్చేసరికి మణి భోజనం సిద్ధంగా అక్కడ టేబుల్ పై పెట్టింది.
ఇంద్రసేనకి నిజంగా ఆకలి వేసింది.
ఆవురావురుమంటూ భోజనం చేసింది.
ఆమెకు బెంగ భయం పోయాయి.
ఆ స్థానంలో ధైర్యం వచ్చింది. ఉషారు వచ్చింది.
"నాకు చాలా సంతోషంగా ఉంది" అంది మణి.
"ఎందుకు?" నవ్వుతూ అడిగింది ఇంద్రసేన.
"నా మాట విన్నందుకు"
"ఓ అదా" నవ్వింది.
"ఈ మాట కృష్ణమౌళి వింటే చాలా సంతోషిస్తాడు" అంది మణి.
ఇంద్రసేన మూతి బిగించింది.
సంతోషిస్తాడా! చెప్తా చెప్తా అనుకుంది మనసులో. కృష్ణమౌళి అంటేకాదు, ఈ ఇంద్రసేన అంటే ఏమిటో తెలుస్తుంది అనుకుంది కసిగా.
మణి వెళ్ళిపోతూ "కాస్సేపు పడుకొని నిద్రపో."
అలాగే అంటూ తలఊపి మణివైపు చూస్తూ అంది.
"ఆయన ఎప్పుడు వస్తారు!" అడిగింది.
"నేను ఆయనతో నా మనసులో మాట ఎలా జెప్పటం!"
ఇందు సిగ్గు నటించింది.
మణి ఆమెవైపు ఓరగా చూసింది.
చిన్నగా నవ్వుతూ "నేను ఉన్నానుగా నీ మనసంతా విప్పి నేను చెప్తాను ఆయనకి సరా"
సరే అన్నట్టు తల ఊపింది.
మణి వెళ్ళిపోయాక మనసులో నవ్వుకుంది ఇందూ.
పిచ్చి మణీ తన మాటలు నమ్మేసింది.
కృష్ణమౌళి అంటే తనకి ఇష్టం అంటే పొంగిపోయింది.
అతను చాలా సంతోషిస్తాడు అని చెప్తా.
ఈ యింట్లోంచి బయటపడే వరకు తెలివితేటలు ఉపయోగించి తరువాత చెప్తాను అనుకుంది మనసులో కోపంగా.
...... ......
తలుపువద్ద చప్పుడు అవటంతో అటు చూసింది.
కృష్ణమౌళి నవ్వుతూ గుమ్మంవద్ద నిలబడి వున్నాడు.
ఇందు చటుక్కున లేచి నిలబడింది.
అతను క్షణంసేపు అలా రెప్పవాల్చకుండా చూశాడు ఆమెవైపు.
తలఎత్తి అతనివైపు చూసింది.
