ఇదివరకు నెలకు పదిహేను రోజులకు పైగా టూర్ ప్రోగ్రాం వుండేది. ఇప్పుడసలు టూర్లు వెళ్ళటం మానేశాడు. ఆఫీసులో వున్న అసిస్టెంట్ మేనేజర్ని పంపిస్తున్నాడు.
'నువ్వు టూర్లుకు ఎందుకెళ్ళటం లేదు?" అనడిగింది మనోరమ.
అతనేమీ జవాబు చెప్పలేదు.
"ఆ వన్నెలాడితో కనెక్షన్ తెగిపోగానే జీవితం మీద యింటరెస్ట్ పోయిందా?"
అతనామే వైపు చూసి ముఖం ప్రక్కకి త్రిప్పుకున్నాడు.
"ఏమిటంత కోపంగా చూస్తున్నావు? నన్ను నమిలి మ్రింగి వెయ్యాలని వుంది కదూ"
అతనప్పటికీ మాట్లాడలేదు.
"ఇదివరకయితే .....రకరకాల ప్రోగ్రాం లు చెప్పి ఆ సోకులాడిని కలుసుకుంటూ ఉండేవాడివి. పాపం ఇప్పుడా చాన్స్ పోయిందని ఉడికిపోతున్నావు అవునా?"
"మనోరమా! ఆమె నిన్ను పల్లెత్తి మాటనలేదు. నీ మీద కోపమూ పెంచుకోలేదు. చీటికి మాటికీ ఆమెను ఎందుకలా అడిపోసుకుంటావు?"
"పాపందాన్ని అడిపోసుకుంటున్నందుకు బాధగా వుందా? ఆ వగలాడిని ప్రేమించిన నీ గుండె విలవిల్లాడి పోతున్నదా?
"మనోరమా"
"ఎందుకలా అరుస్తావు నాటకంలో ఫోజు పెట్టి , ఏమిటన్నావు నన్ను పల్లెత్తు మాట అనలేదా? మాట అనటం దేనికి? నా జీవితానికే ద్రోహం చేసింది. దానిమీద వ్యామోహంతో లక్షలకు లక్షలు డబ్బు గ్రుమ్మరించావు. అది చేసిన ఈ అన్యాయం చాలదా?"
ఆమెకు జవాబు చెప్పిన కొద్దీ రేచ్చిపోతూనే వుంటుంది. ఇలాంటి ఆడవాళ్ళతో మాట్లాడకుండా మౌనంగా వున్నా ఇబ్బందే.
"ఏమిటి?" నేను నోరు నొప్పెట్టేట్టు వాగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుంటావు. నేనేంటే అంత అసహ్యంగా వుందా?" అంటుంది.
జవాబు చెప్పెనకొద్దీ మాటమీద మాట పెంచి రేచ్చిపోతూ వుంటుంది.
ఒకరోజు ఆఫీసు నుంచి ఇంటికి వెంటనే రావటానికి మనస్కరించక క్లబ్బుకి వెళ్ళి కొంతసేపు స్నేహితులతో గడిపి రాత్రి పొద్దుపోయాక వచ్చాడు.
"ఇంతసేపూ ఎక్కడ తిరిగివచ్చావూ?" అని నిలదీసి అడిగింది.
"ప్రతి చిన్న పాయింటూ విడమర్చి చెప్పాలా?"
"నువ్వు సక్రమమయిన వాడివయితే నువ్వు చెప్పా అక్కరలేదు. నేనూ అడిగేదాన్ని కాదు. వెధవపనులు చేశావు కాబట్టి అడగాల్సి వస్తోంది."
"వెధవ పన్లెం చేశాను?"
"ఆ వన్నెల విసనకర్రను మొగుడి దగ్గర్నుంచి లేవదేసుకొచ్చి ఇన్ని సంవత్సరాలు కులకటం వేదవపని కాదా?"
అతనికేం మాట్లాడాలో తోచక అవమానంతో చూస్తూ ఉండిపోయాడు.
"ఏమిటలా గుడ్లు మిటకరించి చూస్తున్నావు? దాన్ని తిడుతుంటే నన్ను చంపెద్దామన్నంత కోపమోస్తుందా?"
"అబ్బ! అసలు జీవితాలనూ, మనుషుల్ని భరించటం ఎంత కష్టం?
"చెప్పు, దాని దగ్గరకే వెళ్ళొచ్చావు కదూ?"
"అవును, వెళ్ళొచ్చాను , ఏం చేస్తావు?" అందామనుకున్నాడు. కాని అనలేకపోయాడు. చేతకాక కాదు పిరికితనంతో కాదు ఆ మాట అని ఆతర్వాత మనోరమ సృష్టించే అరాచకం తట్టుకోటానికి అతని గుండె సిద్దంగా లేదు. మాటలతో కాల్చుకుతినటం. ఊపిరి సలపకుండా చెయ్యటం, గుండెల్ని పరపర కోసేయ్యటం .....ఆమె విలక్షణమయిన శైలి.
ఆమెని ఆహనంగా చూసి లోపలి కెళ్ళిపోయాడు.
ఆమె వదిలిపెట్టలేదు. విసురుగా వెనకే వెళ్ళింది.
"మాట్లాడుతుంటే విదిలించుకుని వచ్చేస్తావెం? నన్ను చూస్తుంటే అసహ్యంగా వుందా?"
"మనోరమా! నన్ను వంటరిగా విడిచి వెళ్ళగలవా?"
"ఏం? నన్ను భరించ లేకపోతున్నావా? అంత రాక్షసిలా కనబడుతున్నానా?"
"మనోరమా ! మానసికంగా నన్నెందుకిలా చిత్రవధ చేస్తున్నావు?"
"చిత్రవధ నేను చేస్తున్నావా ? మా నాన్నగారు సర్వదాస్తి నీకు గుమ్మరించి, నిన్ను నమ్మి నన్నిచ్చి పెళ్ళి చేస్తే నన్ను మోసం చేసి, నా జీవితం నాశనం చేసింది చాలక నేను చిత్రవధ చేస్తున్నానంటావా? ఎంత చిత్రంగా మాట్లాడతావు? ఎవరో నీకు నా మీద బాగా నూరి పోశారు."
"సర్వదాస్తీ నాకిచ్చారా? ఎక్కడికక్కడ నీ అధికారం కూడా వుంచి బిగించి పెట్టారుగా."
'అలా బిగించబట్టే ఈ మాత్రమయినా పడి వున్నావు. లేకపోతే కళ్ళెం నీ చేతుల్లోకి తీసుకుని నన్ను ఆటపట్టించక పోయావా? అయినా ఇప్పుడు మట్టుకేం? నాకు తెలియకుండా బాగానే మిగుల్చుకుని ఆ కులుకులాడికి ముట్ట చెప్పావుగా."
"మనోరమా! ఆమె పేరేత్తకుండా మాట్లాడలేదా?"
"ఏం దాని పేరెత్తితే అంత మంటగా వుందా?"
అతనికేం మాట్లాడాలో తోచక ముఖం ప్రక్కకి తిప్పుకున్నాడు.
"నేనిటున్నాను, అటు కాదు."
"తెలుసు."
"అయితే అద్భుతమయిన నీ మొహాన్ని అటుకేసెందుకు త్రిప్పుతున్నావు?"
"మనోరమా! ప్లీజ్!"
* * *
