కానీ -
నిఖిల్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.
కానీ, కార్లోస్ ద జాకాల్ అయిదేళ్ళ నుంచి కనబడడం లేదు. చనిపోయాడని నమ్ముతున్నారు అందరూ. అతఃన్ని ఎలా కలుస్తాడు జపాటా? అసలు ఏమిటి ఇదంతా?
అతని మొహంలో కనబడుతున్న సందేహాన్ని చూసి నవ్వాడు జపాటా.
"అందరూ చనిపోయాడని నమ్ముతున్న జాకాల్ క్రితం నెల పారిస్ లో సర్ఫేస్ అయ్యాడు" అన్నాడు కూల్ గా.
తల పంకించాడు నిఖిల్. ఈ సంభాషణంతా ఎక్కడికి దారితీస్తోందో అతనికి అంతుపట్టలేదు.
"అతనితో చాలా మాట్లాడదలచుకున్నాను నేను. అందుకని సురక్షితంగా ఉండే ప్రదేశం ఏదా అని ఆలోచించాను. ఇండియన్ ఓషన్ శాంతి సముద్రం లాంటిది. ఇక్కడ ఇంతవరకూ గొడవలు ఏవీ లేవు. శ్రీలంకలో మొదలయ్యాయి అనుకో. మొత్తం మీద ఈ ప్రాంతం కామ్ గా ఉంటుంది. అందుకని ఇక్కడ కలుసుకుందామని కబురంపాను జాకాల్ కి."
"ఎందుకు?"
"నాకొక అధ్బుతమైన అయిడియా వచ్చింది."
"ఏమిటది?"
"ప్రశ్నలు నేను అడుగుతాను. నువ్వు ఇండియన్ రాబిన్ హుడ్ లాంటివాడివి. ఏమిటి నీ వ్యాపకం? బంగారం స్మగుల్ చెయ్యడమేనా?"
ఉద్రేకంతో నిఖిల్ మొహం ఎర్రబడింది.
"బంగారం స్మగుల్ చేస్తున్నాను. నిజమే! కానీ నా కోసం కాదు! ప్రజల కోసం! కూటికీ గుడ్డకీ లేని కోటానుకోట్ల ప్రజల కోసం! డబ్బున్న వాళ్ళకి బంగారం మీద మోజు విదేశాల్లో అతి చవగ్గాకొని ఇక్కడ చాలా లాభానికి అమ్ముతాను. ఆ లాభాన్ని స్వలాభానికి ఎప్పుడూ ఉపయోగించను నేను. ప్రతి పైసా ప్రజలకోసం ఖర్చుపెడతాను. ప్రజలకోసం స్మగ్లింగే కాదు. దోపిడీ దారుల్ని దారికాచి దోచుకోవడం దగ్గరనుంచి ఏమైనా చేస్తాను."
నెమ్మదిగా నవ్వాడు జపాటా.
"తెలుసు నిఖిల్! మాకు తెలుసు! ఇక్కడే కాదు, ఎక్కడ ఏం జరిగినా మాకు తెలుస్తూనే ఉంటుంది. మరి నేను స్మగ్లింగ్ చేస్తాను. కిడ్నాపింగ్ చేసి రాన్ సమ్ డబ్బు గుంజుతుంటాను. నేనే పన్నులు వేసి వసూలు చేస్తూ ఉంటాను.
ఇదంతా నాకోసం అనుకున్నావా నిఖిల్? కాదు! నా కోసం నేను ఎప్పుడూ ఏమీ చేసుకోను. నేనేం చేసినా అది నా ప్రజల కోసం! మన పద్దతిలోనే వెళ్ళే అందరూ అంతే నిఖిల్! ప్రజలకోసం బతుకుతాం మనం! అవునా? అందుకే మనమందరం కలుసుకోవాలి. మనసు విప్పి మాట్లాడుకోవాలి"
"జాకాల్ ఏం చేస్తాడు?"
నవ్వాడు జపాటా.
"జాకాల్ ఏం చేస్తాడు?" అన్నాడు జపాటా నిఖిల్ గొంతుని అనుకరిస్తూ. "జాకాల్ ఏం చేస్తాడు? నిఖిల్ ఏం చేస్తాడు? జపాటా ఏం చేస్తాడు?
బ్రదర్! అందరం చేసేది ఒకటే! మనలో ఒక్కొక్కళ్ళకీ ఒక సిద్దాంతం ఉంది. ఆ సిద్దాంతాన్ని అమలులో పెట్టేందుకు మేం టెర్రరిజమ్ ని మెయిన్ వెపన్ గా వాడుతున్నాం. నువ్వు చేస్తున్నదీ అదే. దానికి నువ్వేం పేరు పెట్టినా సరే! మొత్తానికి మనందరి ఆశయం గవర్నమెంట్లని గాడిదల్ని చేసి మన పనులు సాధించుకోవడం, కాదంటావా?"
ఏమీ మాట్లాడలేదు నిఖిల్. ఈ పేరు మోసిన టెర్రరిస్టులతో తన పేరు కూడా కలపడం అతనికి ఇబ్బందిగా ఉంది.
మొహం చిట్లించి "మీరేం చెప్పబోతున్నారు?" అన్నాడు ఉదాసీనంగా.
"నేను చెప్పను. నా ప్లాను నేను అబూనిడాల్ కి చెప్పాను. అతను కూడా వస్తాడు ఇక్కడికి. అతను కూడా అవునంటే ముందుకు ప్రొసీడ్ అవుదాం. ఇండియాలో నువ్వు చీఫ్ గా ఉంటావు."
అబూ నిడాల్!
అక్కడి గాలి, ఆ అక్షరాల కలయిక వినగానే భయంతో గడ్డకట్టుకు పోయినట్లయి పోయింది.
ఆబూ నిడాల్! పాలెస్తీనియన్ టెర్రరిస్టు! ఉగ్రవాదానికి ఊపిరిలాంటి వాడు!
అబూ నిడాల్! యూదులమీదా, ఇజ్రేలీ స్థావరాల మీదా జరిగిన ప్రతి టెర్రరిస్టు చర్యతోనూ ప్రత్యక్ష సంబంధం ఉన్నవాడు.
ఆబూ నిడాల్, ప్రపంచంలో ఎక్కడ ఏ ప్లేసు హైజాక్ అయినా ఎక్కడ ఏ గ్రనేడ్ పేలినా ప్రజలు పెదిమల మీదకు ముందుగా వచ్చేపేరు!
ఆబూ నిడాల్, కార్లోస్ ద జాకాల్ లాంటి ఉగ్రవాదిని మరుగుజ్జుగా మార్చేసి ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిన అర్బన్ టెర్రరిస్టు!
ఆబూ నిడాల్! ఆబూ నిడాల్! ఆబూ నిడాల్!
నిఖిల్ ది ఫోటోగ్రాఫిక్ మెమొరీ. ఒకసారి కన్నదీ విన్నదీ జన్మలో మర్చిపోడు. చదివిన పుస్తకాలలోని ప్రతి పేజీ, ప్రతిలైనూ ప్రతి అక్షరమూ వాటిలోని ప్రతిఫోటో, ప్రతి బొమ్మా కూడా అతను ఎప్పుడూ కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకోగలడు.
పాలస్తీనియన్ ఉగ్రవాది అబూనిడాల్ ని గురించి చాలా విన్నాడు నిఖిల్, చాలా చదివాడు కూడా. ఆ వివరాలన్నీ అతని మనోనేత్రంముందు రక్తాక్షరాలతో మెదిలాయి. అతని రూపం మనోఫలకంమీద ఫ్లాష్ అయింది.
ఇవాళ అబూనిడాల్ "ది మోస్ట్ వాంటెడ్ మాన్" చాలా దేశాలు అతన్ని పట్టుకోవాలని రాత్రింబగళ్ళు వెన్నంటి వేటాడుతుంటాయి. చట్టాలను ధిక్కరించి, ప్రపంచాన్ని ఎదిరించి బ్రతుకుతున్న మనిషి అతను. అతని పేరు చెబితే భూగోళం మీద ఉన్న సభ్యతా, సంస్కారంగల ప్రజలందరూ గడగడలాడిపోతారు. పాశవికమైన పాపాలు చేసి ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు అతను.
అతని పేరు ఖలీల్ బన్నా లేదా మహమ్మద్ అబ్దుల్ జైడేన్, లేదా ఆబూ ఖలీల్. కానీ ఆబూ నిడాల్ అంటేనే అందరికీ అర్ధమవుతుంది. పాలెస్తీనా దేశ స్థాపన కోసం ఎంత హింసాకాండ అయినా చేస్తానని ప్రతిజ్ఞ పూనాడు అతను. ప్రభుత్వాన్ని లొంగదీసి అప్నులు చేయించుకోవాలంటే హింస తప్ప వేరే మార్గం లేదని నమ్ముతాడు అతను.
