ఇంద్రసేన కోపంగా చూసింది. ఆమె వెళ్ళినవైపు మణి వెళ్ళిన అయిదు నిమిషాల తరువాత కృష్ణమౌళి అక్కడకి వచ్చాడు.
అతను ఆ గదిలోకి వచ్చినా చూడనట్టే నటించింది.
"ఇందూ!" అతని కంఠస్వరం శాంత గంభీరంగా పలికింది.
ఆమె మాట్లాడలేదు.
"నీకు నేను ఏమని చెప్పాను!"
ఇందూ తలతిప్పి అటుచూసింది నిర్లక్ష్యంగా.
"నీకు నేను చెప్పింది ఏమిటి! నిన్ను స్నానంచేసి బట్టలు మార్చుకో భోజనం చెయ్యమని చెప్పానా! లేదా!" అతని స్వరం కంగ్ మంది.
"చెప్పారు" అయితే ఏమిటి అన్నట్టు ఉంది చూపుల్లో.
"చెప్తే నువ్వు ఏం చేశావు"
"మీరు చెప్తే నేను చెయ్యాలని ఉందా! నేను మీ బానిసను అనుకున్నారా!" కోపంగా చూసింది. అంతకన్నా కోపంగా చూశాడు.
"ఇంతసేపూ నేను పోనీ అని ఊరుకున్నాను. నేను చాలా మొండివాడినని నీకు తెలీదు. నేను చెప్పింది నువ్వు వెంటనే చేసి తీరాలి"
ఆమె మాట్లాడలేదు.
"ఇంతవరకూ నన్ను శాంతమంతుడుగానే చూశావు, ఇక మీద రాక్షసుడిగా కూడా చూస్తావు అర్ధం అయిందా!"
ఇందూ సమాధానం ఇవ్వలేదు.
"నేను పనివుండి ఒకచోటికి వెళుతున్నాను. వెళ్ళి రాత్రి పది గంటలకు వస్తాను. నువ్వు ఈలోగా స్నానంచేసి బట్టలు మార్చుకుని భోజనం చేసి కూర్చో నీతో మాట్లాడాలి" అన్నాడు.
"అర్ధం అయిందా నేను చెప్పినట్లు చెయ్యకపోయావో తరువాత తెలుస్తుంది, వస్తాను" అక్కడనుండి వెళ్ళిపోయాడు.
* * *
ఇంద్రసేన మతిపోయినదానిలా కూర్చుంది. మణి వచ్చి భోజనం చెయ్యమని మరీ మరీ చెప్పి బ్రతిమాలసాగింది.
"ఇందూ! అనవసరంగా అతని మనసు ఎందుకు బాధపెడతావు చెప్పు"
"స్త్రీ తన ప్రేమానురాగాలతో మగవాడిని ఓలలాడించాలి"
"అతని జీవితంలో పున్నమి వెన్నెలలు కురిపించాలి."
"నిన్ను అతను మనసారా కోరుకుంటున్నాడు"
"ప్రేమిస్తున్నాడు. అతన్ని అంతహీనంగా చూడటం అంతకు మంచిపని కాదు"
ఇందూ మాట్లాడలేదు.
"అతిశయం స్త్రీకి ఉండకూడదు. నేను చెప్పింది అర్ధం చేసుకో. నువ్వు చక్కగా భోజనం చేసి కూర్చో అతను వచ్చేస్తాడు"
"అతను నీతో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటున్నాడు ఏమిటో విను"
"వినకుండా కోపం తెచ్చుకోవటం ఏమిటి!"
"నాకు అతను అంటే అసహ్యం"
"అసహ్యమా!" ఆశ్చర్యంగా అడిగింది.
"అవును"
"ఎందుకు అసహ్యం?" సూటిగా ప్రశ్నించింది.
"ఎందుకు ఏమిటి! నా అంతస్తు ఏమిటి? అతని అంతస్తు ఏమిటి? అతనికీ నాకూ పెళ్ళి ఏమిటి! మతిలేని ఆలోచనలు అత్యాసకుపోయే దురాలోచనలు. ఇవన్నీ ఎందుకు. నేను చెపుతున్నాను విను అతను అంటే నాకు యిష్టంలేదు."
"చావనయినా చస్తానుగాని అతన్ని పెళ్ళి మాత్రం చేసుకోను. ఇది ముమ్మాటికీ నిజం" అంది ఖచ్చితంగా చెపుతూ.
ఒక్కక్షణం అలా చూసి మణి అంది.
"అంతస్తులు అంటే ఏమిటి! బావమరదళ్ళకు అంతస్తులు అడ్డుగోడలు ఎప్పుడూ కావు. ఇద్దరిలో పేదవారు అయినా ఆ ఇద్దరూ భార్యాభర్తలు కావడానికి హక్కు వుంది. ఆ హక్కును ఎవ్వరూ కాదనలేరు"
"నాకు ఎవరూ లేరు. నేను కృష్ణమౌళితో పెళ్ళికి అంగీకరించను, అతను అంటే నాకు అసహ్యం"
"అయితే నీకు ఎవ్వరూ ఎవ్వరూ ఏం చెప్పలేరు. అతని సంగతి నీకు తెలీదు. కోపం వస్తే మనిషికాడు. మంచిగా ఉన్నంతవరకే అతను చాలా మంచివాడు. పంతం, పట్టుదల వస్తే రాక్షసుడు అవుతాడు గుర్తుంచుకో" అంటూ అక్కడనుండి వెళ్ళిపోయింది.
* * *
మణి వెళ్ళిపోయినా ఆమె మాటలో చెవుల్లో మారుమ్రోగుతున్నాయి.
ఇంద్రసేన అలా ఆలోచిస్తూ కూర్చుంది.
మణి మాటలు ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తున్నాయి.
అతను నిజంగా మొండివాడే.
మొండితనంతో ఏమయినా చెయ్యవచ్చు.
