"చేతులు తలవెనక పెట్టుకో!" అన్నాడతను.
అలాగే చేశాడు నిఖిల్.
"లేచి నిలబడు!"
లేచి నిలబడుతూ బ్యూటీస్పాట్ వైపు చూశాడు నిఖిల్. అది ఆ అపరిచితుడి మీదకు లంఘించడానికి సిద్దంగా ఉన్నట్లు అతనికి తోచింది.
అది చాలా డేంజరస్ అని అతనికి తెలుసు. తుపాకీతో ఆ మనిషి బ్యూటీస్పాట్ ని తూట్లుపడేలా కాల్చేస్తాడు. ఆ తర్వాత ఇంక చేసేదేమీ ఉండదు. తొందరపడడం మంచిది కాదు.
"వద్దు బ్యూటీ!" అన్నాడు మృదువుగా.
"నడు!" అన్నాడు ఆగంతకుడు మొరటుగా.
ముగ్గురూ నడవం మొదలెట్టారు. ఎడమచేతిలో ఉన్న మడ్డుకత్తితో దారికి అడ్డంగా ఉన్న లతలను ఛేదిస్తూ ముందుకు పోతున్నాడు ఆ మనిషి.
పావుగంట తర్వాత ఆ వృక్షాలమధ్య ఉన్న ఖాళీస్థలానికి చేరుకున్నారు.
అక్కడ దృఢమైన నైలాన్ గుడ్డతో చేసిన టెంట్ వేసివుంది. టెంట్ ముందు ఎండు కట్టెలతో నెగడుచేసి వుంది. ఆ నెగడుకి అటూఇటూ కర్రల స్టాండులా అమర్చివున్నాయి. వాటిమీద నెగడుకు అడ్డంగా మరో కర్రవుంది. దానికి గుచ్చివుంది ఒక లేడిపిల్ల. మంటలో కాలుతుంది.
మంటచుట్టూ నాల్గు కుర్చీలు ఉన్నాయి. వాటిల్లో ఆలివ్ కలర్ డ్రస్సులు వేసుకుని వున్న నలుగురు మనుషులు కూర్చునివున్నారు. వాళ్ళ మొహాల్లో మైత్రీ, విరోధభావమూ రెండూ కలబడడంలేదు.
కళ్ళజోడు పెట్టుకుని ఉన్న ఒకతను అన్నాడు "నిఖిల్!?"
"అవును!" అన్నట్లు తల ఆడించాడు నిఖిల్.
"యూ ఆర్ ఏ లక్కీ ఫెలో! నువ్వు చనిపోయావని నమ్ముతున్నాడు తరుణ్!"
ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తున్నాడు నిఖిల్.
"ఏమిటి నువ్వు స్మగుల్ చేస్తున్నది?"
"నేనా?"
అతను నవ్వాడు.
"ఆ షిప్పులో ఏమిటి? గోల్డా?" చాలా యధాలాపంగా అడిగాడు. కొంచెం తటపటాయించి "అవును" అన్నాడు నిఖిల్. వీళ్ళు అసలు ఎవరయి ఉంటారో అతనికి అంతుబట్టడంలేదు. తరుణ్ తాలూకు మనుషులు కాదు. అంతవరకూ ఖాయం. పోలీసులు కూడా కారు. అదీ ఖాయమే! దొంగల్లా కూడా లేరు. మరి?
గన్ పట్టుకున్న మనిషి గన్ చెట్టుకి ఆనించి లోపలికి వెళ్ళి మరో కుర్చీ తెచ్చాడు.
"కూర్చో?!" అన్నాడు కళ్ళజోడు అతను.
కూర్చున్నాడు నిఖిల్.
"నేను జపాటా!"
ప్రశ్నార్ధకంగా చూశాడు నిఖిల్. జపాటా! ఏ జపాటా? లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఇదివరకు ఒక వీరుడు ఉండేవాడు. అతని పేరు జపాటా. ప్రజలకోసం ప్రాణం ఇచ్చిన మనిషి అతను.
అతనిపేరే పెట్టుకుని ఈ మధ్య మరొక విప్లవకారుడు బయలుదేరాడని విన్నాడు తను. విప్లవ కారుడు అనడం కంటే టెర్రరిస్టు అంటే బాగుంటుందేమో అతన్ని. చాలా తీవ్రమైనవి అతను అవలంబించే పద్దతులు. "బనానారిపబ్లిక్స్" అని అందరూ తమాషాగా పిలిచే లాటిన్ అమెరికన్ దేశాల్లో విప్లవం అనేది చాలా తేలిక పదం. అది నిత్యకృత్యం అక్కడ. ఇవాళ ఉన్న గవర్నమెంటు రేపు ఉండదు. ఎవరూ గద్దె దిగరు. దింపబడతారు. అంతే!
ఇతనేనా జపాటా అంటే?
నిశితంగా చూస్తున్నాడు నిఖిల్.
పెన్సిలులా సన్నగా ఉన్న హవానా సిగార్ తీసి అంటించాడు జపాటా.
"లాటిన్ అమెరికన్ దేశాల్లో ఉండే జపాటా బంగాళాఖాతంలోని ఈ ద్వీపంలో ఎందుకు ఉన్నాడా అని ఆశ్చర్యపడుతున్నావా?"
నిశ్చలంగా చూస్తున్నాడు నిఖిల్.
"నేను కార్లోస్ ని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను."
ఉలిక్కిపడ్డాడు నిఖిల్. కార్లోస్!
"కార్లోసా? ఎవరు కార్లోస్ ద జాకాల్?"
నవ్వాడు జపాటా.
"అవును. కార్లోస్ ద జాకాల్."
నిఖిల్ మొహంలో అపనమ్మకం కనబడింది.
"ద జాకాల్" (గుంటనక్క) అనే నిక్ నేమ్ గల కార్లోస్ అర్బన్ గెరిల్లా. ప్రపంచంలోని టెర్రరిస్టులందరిలోకీ అగ్రగణ్యుడు. అయిదేళ్ళక్రితం దాకా ప్రపంచంలో ఏమూల ఏ ఉగ్రవాదులు ఏ విధ్వంసకాండ జరిపినా దాని వెనక కార్లోస్ హస్తం ఉందనీ, ఆ మారణహోమం అతని ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరిగిందనీ అనుకునేవారు.
గతంలో మ్యూనిక్ ఒలింపిక్స్ లో ఇజ్రేలీ ఆటగాళ్ళను మూక ఉమ్మడిగా హతమార్చడం దగ్గరనుంచి చాలా రకాల దారుణాలతో అతనికి సంబంధం ఉంది.
తమ తమ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని దేశాల్లో పోలీసులకి అతను అందినా, అరెస్టు చెయ్యకుండా వదిలేశారు.
ఆ విధంగా, ఫ్రాంకెన్ స్టెయిన్ శాస్త్రజ్ఞుడు సృష్టించిన మాన్ స్టర్ లా కంట్రోలు తప్పి పెరిగిపోయాడు, కార్లోస్ ద జాకాల్. చాలా సోఫిస్టికేటెడ్ గా కల్చర్డ్ గా కనబడే టెర్రరిస్టు అతను.
విమానాలను హైజాక్ చెయ్యడం దౌత్యకార్యాలయాల మీద దాడులు జరపడం అతని ప్రాపకంలోనే ఎక్కువయిందంటారు.
