Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 42


    ఇతన్ని తప్పించుకు పారిపోవటం ఎలా!


    ఆమె ఉపాయాలకోసం వెతుకుతున్నా ఉపాయం దొరకలేదు.


    ఇంటిదగ్గర ఉండిపోయినా బాగుండేది. మంచంమీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఆమె మనసులో ఏదో భయం.


    ఏదో బెంగ మనిషిని కృంగదీస్తున్నాయి.


    అతను చాలా మొండివాడు.


    అనుకున్నపని సాధించేవరకు నిద్రపోడు. పంతంపట్టి ఉన్నాడు.


    ఎత్తుకువెళ్ళి పెళ్ళి చేసుకుంటాను అని బెదిరించాడు


    తను లెక్క చేసుకోలేదు.


    తండ్రి, అన్నయ్య, అమ్మ, వదిన ఉండగా ఇంతమంది కళ్ళుకప్పి తీసుకెళ్ళగలడా అని భావించింది.


    ఎత్తుకు పై ఎత్తు వేశాడు.


    తన గడుసుతనాన్ని చిత్తుచేశాడు.


    అతడు తనని పెళ్ళి చేసుకుంటే!


    ఆమె భయంతో ఒణికిపోయింది.


    అతనికి తనకీ పెళ్ళా! అసహ్యించుకున్నట్టుగా తలపైకి ఎత్తింది.


    అతనితో పెళ్ళి జరిగేకంటే జీవితాంతం ఇలా ఉండిపోవటం మంచిది.


    అతనిచేత తాళి కట్టించుకునేకంటే చావటం మేలు తన కంఠంలో ప్రాణం ఉండగా తన కంఠానికి తాళిని కట్టలేడు.


    అది ముమ్మాటికీ నిజం.


    తను అంటే ఏమిటో అనుకుంటున్నాడు.


    ఆడది అంటే ఆటబొమ్మ కాదు.


    మగవాడు ఆడించడానికి ఆడే బొమ్మాకాదు పాడే బొమ్మా కాదు.


    ఈ కృష్ణమౌళికి తగినట్టుగా చెయ్యాలి.


    దెబ్బకు దెబ్బ తియ్యాలి.


    అవును తియ్యాలి ఎలా!


    ఇంద్రసేన ఆలోచిస్తూ పడుకుంది.


    గుమ్మంవద్ద కాలింగ్ బెల్ మ్రోగింది.


    ఆమె తలుపు తియ్యలేదు.


    మళ్ళీ మ్రోగింది. అలా ఆగకుండా మ్రోగుతూనే వుంది.


    ఇంద్రసేన విసుగ్గా కోపంగా వెళ్లి తలుపు తీసింది.


    గుమ్మంలో మణి నిలబడివుంది.


    ఇందూ అవతారం చూసి "నువ్వు ఇంకా స్నానం చెయ్యలేదా?" అడిగింది.


    ఆమె మాట్లాడకుండా వెనుతిరిగి వెళ్ళి మంచంమీద కూర్చుంది.


    ఆమె వెంట మణి కూడా వెళ్ళి దగ్గరగా నిలబడింది.


    ఇందూ తలయెత్తి చూడ్లేదు. ఆమెకు మణి అంటే మహా కోపంగా ఉంది.


    ఆమె భుజంమీద చెయ్యివేసి "ఇందూ" అంది మెల్లగా.


    కోపంగా చూస్తూ "ముందు చెయ్యి తియ్యి" అంది కోపంగా.


    ఆమె తియ్యలేదు. స్నేహ పూర్వకంగా నవ్వింది.


    "ఇందూ నువ్వు చాలా తెలివితక్కువ దానివి" అంది.


    "నేనా!" ఉరిమి చూసింది.


    "నువ్వే"


    ఆమె మాట్లాడలేదు.


    "కృష్ణమౌళి అంతటివాడు నిన్ను కోరి పెళ్ళి చేసుకుంటానంటే కాదని తిరస్కరిస్తున్నావు. అదే నీ స్థానంలో ఎవరయినా ఉంటే సంతోషంగా అదృష్టంగా భావించి ఒప్పుకునేవారు" అంది నచ్చచెపుతున్న ధోరణిలో.


    "ఆ అదృష్టం విలువ ఇప్పుడు నీకు తెలీదు పోగొట్టుకున్న తరువాత తెలుస్తుంది"


    ఇంద్రసేన మాట్లాడలేదు.


    "ఇందూ నా మాట విని కృష్ణమౌళిని పెళ్ళి చేసుకో" అంది.


    "నేను అతన్ని పెళ్ళి చేసుకుంటే నీకు ఏమిటి లాభం!" సూటిగా ప్రశ్నించింది.


    ఆ ప్రశ్నకు చిరునవ్వు నవ్వింది.


    "అన్నీ లాభాలే! ఈ యిల్లు కళకళలాడుతుంది. అందరి మనసులు శాంతిస్తాయి. అలా చెపుతూ వెళుతుంటే చాలా లాభాలు కనిపిస్తాయి"


    "ఇందూ నువ్వు బాగా ఆలోచించుకో."


    "ఏమిటి ఆలోచించుకునేది!" కటువుగా అడిగింది.


    "పెళ్ళి విషయంలో అతనికి భార్యపు కాగలిగిన రోజున నువ్వు ఎంత పొంగిపోతావో నీకు ఇప్పుడు తెలీదు. అతను నీ మెడలో తాళికట్టిన రోజున నీవు అతనికి ఇల్లాలివి అయిన రోజున తెలుస్తుంది. నా మాట విను. నేను నీ మనసు మార్చుకోననీ మొండిపట్టుదల విడు" అంది.


    "మణీ" అంటూ అరిచింది.


    ఆమె మాట్లాడలేదు.


    "లేనిపోని మాటలు చెప్పినా నా మనసు మళ్ళించాలని చూస్తున్నావు. నా మనసు అంత సులభంగా మారదు. ఇక నువ్వు ఏం చెప్పకు వెళ్ళు అవతలకి"


    ఆమె వెళ్ళిపోలేదు.


    చిరునవ్వుతో అంది.


    "కొందరు కళ్ళు ఉండి కూడా అంధులు అవుతారు. కళ్ళతో ఏది చూడలేరు. జీవితాన్ని కోరి నరకం చేసుకుంటారు"


    "అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం!" అంటూ అరిచింది.


    "నా ఉద్దేశ్యం ఏమిటో వివరంగా చెపితే నీవు ఇప్పుడే మంటల్లోపడి దూకి ఛస్తావు" అంటూ చెప్పి మరోమాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది మణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS