Previous Page Next Page 
మారణహోమం పేజి 41


    
    అతను తేలి పైకి రాగానే అతన్ని వదిలి తల మాత్రం నీటిపైన పెట్టి ఈదుతూ కొంతదూరం వెళ్ళిపోయింది కుక్క. దూరంగా నీళ్ళపైన తేలుతున్న ఒక కొయ్యను అందుకుని వెనక్కి తెచ్చింది.    
    భగ్నమైపోయిన నౌక తాలూకు ఒక శకలం ఆ కొయ్య.    
    ప్రశంసాపూర్వకంగా కుక్కవైపు చూశాడు నిఖిల్. ఆ కోయ్యని అందుకున్నాడు. నెమ్మదిగా అతని కళ్ళు మూతలు పడిపోయాయి.
    
                                                               * * *
    
    మళ్ళీ మెలకువ వచ్చేసరికి ఒడ్డున ఇసుకలో బోర్లాపడి ఉన్నాడు నిఖిల్. తీక్షణమైన ఎండ వేడిగా అతని వీపుని కాల్చేస్తోంది.    
    అతనికి కొంచెం దూరంలో కూర్చుని అతన్నే తదేకంగా చూస్తోంది కుక్క.    
    పెదిమలకు అంటిన ఇసుక తుడుచుకుని దానివైపు చూశాడు నిఖిల్.    
    "థాంక్స్! థాంక్యూ మై ఫ్రెండ్! ఇవాళ నువ్వు లేకపోతే నేను చచ్చిపోయి ఉండేవాడ్నే!" అన్నాడు ఆర్ద్రంగా.    
    తల వంకరగా పెట్టి చెవులు రిక్కించి అతను చెప్పింది శ్రద్దగా వింటోంది కుక్క.    
    "నీ పేరేమిటి డియర్!" అన్నాడు నవ్వుతూ.    
    కుక్క కూడా నవ్వుతున్నట్లు చూసింది.    
    "నీ పేరేమిటో నాకు తెలియదు. నీ వంటిమీద అందమైన మచ్చ ఒకటి ఉంది. అందుకని నిన్ను "బ్యూటీస్పాట్" అని పిలుస్తాను. సరేనా?"    
    తోకాడించింది కుక్క. అంతకుముందు దాని పేరేమిటో గానీ, ఆక్షణంనుంచి అది 'బ్యూటీస్పాట్' అయిపోయింది.    
    తదేకంగా దానివైపే చాలా సేపు చూస్తుండిపోయాడు నిఖిల్. అది చాలా మంచి జాతికుక్క అని అతనికి తెలుసు. ఆ జాతిని "పాయింటర్" అంటారు. వేటకుక్కలు అవి. వేటకు వెళ్ళినప్పుడు జంతువుని పసిగట్టితే నిశ్శబ్దంగా అయిపోయి మూతి ముందుకుజాపి ఒక కాలు ఎత్తి జంతువువున్న దిశను సూచిస్తుంది యజమానికి. వీటినే గన్ డాగ్స్ అని కూడా అంటారు.    
    ఓపిక కూడదీసుకుని లేచి కూర్చున్నాడు నిఖిల్. చుట్టూతా చూశాడు. చిన్న ద్వీపంలా ఉంది అది. దట్టంగా వృక్షాలు పెరిగి ఉన్నాయి.    
    ఆకలి  దహించేస్తోంది అతనికి.    
    హఠాత్తుగా బ్యూటీస్పాట్ బిగుసుకుపోయినట్లు కూర్చుంది. తల వంకరగా పెట్టి విన్నది. తర్వాత సముద్రంలోకి దూకేసి ఈదుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.    
    నిర్ఘాంతపోయి చూస్తున్నాడు నిఖిల్. ఏమయింది దీనికి?    
    కొద్ది నిమిషాల తర్వాత తిరిగి ప్రత్యక్షమయింది బ్యూటీస్పాట్. దానినోట్లో ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాను నిఖిల్ ముందు ఉంచింది అది.    
    చూశాడు నిఖిల్. అది చేపలకూర ఉన్న డబ్బా. షిప్పులోనుంచి కొట్టుకొని వచ్చి వుంటుంది.    
    "థాంక్స్  బ్యూటీ!" అని టిన్ను ఓపెన్ చేశాడు నిఖిల్. టిన్నులో ఉన్నదాన్ని కొద్దిగా చేతిలోకి ఓంపుకుని "కమాన్ బ్యూటీ తిను" అన్నాడు ఆప్యాయంగా.    
    బ్యూటీస్పాట్ ఆకలితో దహించుకు పోతున్నట్లు దాని మొహమే చెబుతోంది. అయినా అది ఉన్నచోటు నుంచి కదలలేదు. తోకమాత్రం మెల్లిగా ఆడిస్తోంది.    
    "తిను స్పాటీ!"    
    అతని కళ్ళలోకి వెదుకుతున్నట్లు చూసింది బ్యూటీస్పాట్. అది ఆకలిగొని ఉంది నిజమే! కానీ ఆహారంకంటే కూడా అది ప్రేమాభిమానాలకోసం ఎక్కువగా తపించి పోతోంది. అది అర్ధమయిపోతూనే వుంది.    
    లేచి దాని దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. ఆప్యాయంగా దాని తలమీద చెయ్యివేసి నిమురుతూ అన్నాడు "డియర్ బ్యూటీస్పాట్! నువ్వు ఈ క్షణం నుంచి నా ప్రాణమిత్రురాలివి! సరేనా! నా మనసులోనుంచి ఒక్కక్షణం కూడా నువ్వు మరపురావు. ఇంక తిను!"    
    సంతృప్తి చెందినట్లు చూసి అతని చేతిలోని ఆహారాన్ని తినడం మొదలెట్టింది బ్యూటీ.    
    ఆరోజు నుంచి అతన్ని కొట్ట యజమానిగా అంగీకరించింది బ్యూటీ హృదయపూర్వకంగా!    
    దానికి పెట్టక తను కూడా తిన్నాడు నిఖిల్. తిన్న తర్వాత దాహం వేసింది. వెక్కిళ్ళు మొదలయ్యాయి.    
    ఆదుర్దాగా అడవి అంతా వెదకడం మొదలెట్టారు ఇద్దరూ మంచి నీళ్ళ కోసం.    
    అడవి అంతా తిరిగినా ఎక్కడా ఒక వాగుగానీ, వంకగానీ, చలమగానీ, సరస్సుగానీ కనబడలేదు.    
    ఆగకుండా వెక్కిళ్ళు వస్తున్నాయి నిఖిల్ కి.    
    చటుక్కున ఒక చోట ఆగింది బ్యూటీ. ముందుకాళ్ళతో తవ్వడం మొదలెట్టింది.    
    ఇసుక ప్రదేశం అది. తను కూడా ఒక చెట్టుకొమ్మను విరిచి త్రవ్వడం మొదలెట్టాడు నిఖిల్.    
    అడుగు లోతు కూడా త్రవ్వకముందే నీళ్ళు ఊరడం మొదలెట్టాయి.    
    స్వచ్చమైన తియ్యటినీరు!    
    "థాంక్స్ స్పాటీ! థాంక్స్ ఎలాట్!" అన్నాడు నిఖిల్ నీళ్ళు తాగి మొహం తడుపుకున్న తర్వాత అతను చెబుతున్నది వినిపించుకోనట్లు తల పంకించి విన్నది స్పాటీ. వెంటనే అరవడం మొదలెట్టింది.    
    కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. నిఖిల్ వెనక్కి తిరిగేసరికి ఒక మనిషి నిలబడి వున్నాడు అక్కడ. అతని చేతిలో స్టెన్ గన్ ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS