Previous Page Next Page 
సౌందర్య దీపం - 2 పేజి 41


    "ఛీ నీవు ఒక ఆడదానివా! ఒక ఆడదాన్ని బంధించి ఇక్కడికి లాక్కువస్తావా?"


    "నేను నిన్ను లాక్కువచ్చానా?"


    "నీ కారు చెడిపోతే మా కారు ఆపించి అందులో దర్జాగా కూర్చున్నావు, ఇంకా పైగా నన్ను అంటున్నావా!" అంది మణి కోపంగా.


    ఇందూ వెంటనే మాట్లాడలేకపోయింది.


    "ఇక్కడికి వచ్చినందువలన నీకు ఏమిటీ నష్టం!" అడిగింది.


    "ఆ మాట అడగడానికి నువ్వు ఎవరు!" అంది ఇందూ కోపంగా.


    "నేను కృష్ణమౌళిగార్కి స్నేహితురాల్ని" అంది శాంతంగా.


    "ఓహో" అంటూ వెటకారంగా చూసింది.


    "ఒట్టి స్నేహితురాలివేనా లేక ఇంకా ఏమైనా...!" అంటూ హేళనలా అదోలా చూసింది ఇందూ.


    "ఇంకా ఏమైనా అంటే!" అడిగింది మణి.


    "అదే" అంది నవ్వుతూ.


    "ఆ అదే ఏమిటో నీలా రోడ్లుపట్టుకు తిరిగేవాళ్ళకి తెలుస్తుంది. మా లాంటి వాళ్ళకు తెలీవు" అంది చాలా శాంతంగా.


    "ఏమన్నావ్!" కోపంగా అరిచింది.


    "నోరు మూసుకు లోపలకు పదమన్నాను" అంది.


    "ఎంతపొగరు నీకు! నన్ను ఆజ్ఞాపించడానికి నువ్వు ఎవరు!" కాలితో నేలను బలంగా తన్నింది ఇంద్రసేన. "ఎవరు!" అన్న గంభీర స్వరం వినిపించటంతో ఒక్కసారి వెనక్కితిరిగి చూసింది.


    గది గుమ్మం వద్ద కృష్ణమౌళి నిలబడి ఉన్నాడు.


    ఒక్కక్షణం ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. "ఎవరు అనుకుంటున్నావు!" అన్నట్టున్నాయి ఆమె చూపులు.


    నన్ను నువ్వు అంత చులకన చేస్తున్నావా! నేను ఎవరో నీకు తెలుసా! నా పంతం పట్టుదల ఏమిటో నీకు ఇంకా తెలీదు అన్నట్లు కోపంగా చూశాడు.


    హు అన్నట్లు నిర్లక్ష్యంగా చూసింది.


    "ఆవిడ ఎవరో నాకు అనవసరం. నేను ఈ యింట్లో ఒక్క క్షణం ఉండను" అంటూ ముందుకి అడుగువేసి పరుగెత్తబోయింది.


    వెంటనే చెయ్యిపట్టి ఆపాడు.


    "ఛీ" అంటూ విదిలించుకోబోయింది.


    అతడు ఆ చేతిని వదిలి పెట్టలేదు.


    మణి అక్కడనుండి వెళ్ళిపోయింది.


    ఇంద్రసేన అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది.


    కృష్ణమవుళి నవ్వకుండా ఆమె వైపు రెప్ప వాల్చకుండా చూడసాగాడు.


    "వదలండి" అంటూ అరిచింది.


    "వదలను" మొండిగా చెప్పాడు.


    "వదలకపోతే చంపేస్తాను" ఇందూ ఉరిమి చూసింది.


    "ఆ" అంటూ ఆ చేతిని మెలిపెట్టి దగ్గరకు విసురుగా లాక్కున్నాడు.


    "అబ్బా!" అంటూ చిన్నగా అరిచింది.


    అతను లాగిన విసురుకి వెళ్ళి అతని గుండెలపై పడింది.


    కృష్ణమౌళి ఆమెను రెండు చేతులతో బంధించి దగ్గరకు తీసుకుంటూ మృదువుగా చెప్పాడు.


    "ఇందూ!"


    ఆమె మాట్లాడ. పళ్ళు బిగించి అతని పట్టునుండి విడిపించుకోడానికి ప్రయత్నించింది.


    "నువ్వు నీ యింటికి వచ్చావు ఇందులో నువ్వు కోపం తెచ్చుకోవలసింది ఏం లేదు"


    "నా యిల్లా!" కంపరంగా చూసింది.


    "నీ యిల్లే!"


    "ఆ మాట మీరు నా దగ్గర అనవలసింది కాదని మీకు లక్షసార్లు చెప్పాను. మీ భార్య ఎవరో ఆవిడ దగ్గర చెప్పండి నన్ను వదలండి నేను వెళ్ళాలి" అంది కోపంగా.


    "ఎక్కడికి!" అడిగాడు హేళనగా.


    "మా యింటికి"


    "మీ యింటికా!" అంటూ నవ్వి "మీ యింటిదగ్గర నీకోసం ఎవరు ఎదురు చూడటంలేదు. నువ్వు హాయిగా మీ ఫ్రెండ్ యింటికి చేరుకున్నావు అనుకుంటున్నారు" అన్నాడు.


    "ఆ" అయోమయంగా చూసింది!


    "చూడు నువ్వు ఇక్కడ బందీవయ్యావన్న సంగతి చెట్టుమీద పిట్టకు కూడా తెలీదు. నీవు ఇక్కడ రాణీలా ఉండొచ్చు" అన్నాడు.


    ఇంద్రసేన మాట్లాడలేదు. ఆమెకు నోటమాట రాలేదు.


    "ఇందూ!" అంటూ ఆమె తలని ప్రేమగా నిమురుతూ.


    "ఇన్నాళ్ళ నా కల ఫలించేరోజు వచ్చింది. నువ్వు నా దానివి నేను నీ కృష్ణని."


    "నువ్వు అనవసరంగా ఆలోచించి లేనిపోనివి ఊహించి విన్నదానిని పెద్ద రభస చేస్తున్నావు అని నాకు తెలుసు అందుకే నీకు చెపుతున్నాను"


    ఇందూ ఏదో కోపంగా చెప్పబోయింది!


    "నువ్వు స్నానంచేసి బట్టలు మార్చుకుని భోజనం చెయ్యి మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. నీకంతా వివరంగా చెప్తాను" అన్నాడు. ఆమెను మాట్లాడనివ్వకుండా బలవంతంగా గదివద్దకు తీసుకెళ్ళాడు లోపలకు తోస్తూ.


    గదిలోకి వెళ్ళాక తలుపులు మూసేసుకుంది.
    
                                                               58


    గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకుని వెక్కివెక్కి ఏడ్వసాగింది ఇంద్రసేన.


    అనుకోకుండా ఇక్కడికి వచ్చి పడింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS