అంతే!!
అది తప్ప మరే కదలికా లేదు. శబ్దమూ లేదు షిప్పులో!
నావికులంతా ఏరి? తను షిప్పులో అడుగుపెట్టగానే భయపడి సముద్రంలోకిదూకేశారా?
కుక్క చిన్నగా మొరిగింది.
అంటే ఈ కుక్క ఒక్కతే మిగిలిందా షిప్పులో?
అతను షిప్పును పరిశోధించడం మొదలెట్టాడు. కుక్కనేలనీ, గోడలనీ వాసన చూస్తూ అతనికంటే ముందు పరిగెత్తుతోంది.
ఉన్నట్లుండి చిత్రంగా మొరిగింది కుక్క. దిశను మార్చుకుని ఇనప మెట్లెక్కి మెరుపులా బ్రిడ్జివైపు పరిగెత్తింది.
దాని వెనకాలే వెళ్ళాడు నిఖిల్.
బ్రిడ్జిమీద ఒకచోట గుంపుగా భయంతో ముడుచుకు పోయి కూర్చుని ఉన్నారు అయిదుమంది సెయిలర్లు.
నావికులందరూ భయంగా ఆకాశం వైపు చూశారు.
నిఖిల్ కూడా చూశాడు.
నిర్మలంగా ఉంది ఆకాశం. అతనికేమీ ప్రత్యేకత కనబడలేదు.
పిచ్చికుక్కా ఇది. ఎందుకిలా చేస్తోంది?
అది పిచ్చికుక్క కాదనీ డానికి చాలామంది మనుషులకంటే ఎక్కువ మేధస్సు ఉందని అప్పట్లో అతనికి తెలియదు.
కుక్క అరుపుకి కారణం మరో నిమిషంలో అర్ధమయింది అందరికీ.
దూరంగా ఆకాశం నోరు చప్పరిస్తున్నట్లు చప్పుడు.
"ట్టట్టట్టట్టట్టట్టట్టట్ట......"
సుదూరంగా ఆకాశంలో పగటిచుక్కలా కనబడింది ఒకటి. కొద్దిక్షణాల తర్వాత దగ్గరయింది. దగ్గరయ్యాక తెలుస్తోంది. అది నీలం, తెలుపు రంగులలో పెయింట్ వేసి వున్న హెలికాఫ్టర్ అని.
ఆ హెలికాఫ్టర్ ని మనుషులెవ్వరూ చూడకముందే దాని శబ్దాన్ని వినకముందే కనిపెట్టేసింది ఆ కుక్క. రాడార్ లకంటే తీక్షణమైన శక్తి వుంది. దానికి విమానాలను, హెలికాఫ్టర్లనూ పసిగట్టడంలో మానవుల శ్రవణేంద్రియాల కంటే కుక్కల శ్రవణేంద్రియాలు చాలా నిశితంగా ఉంటాయి.
మరుక్షణంలో హెలికాఫ్టర్ నిప్పులు కక్కడం మొదలెట్టింది.
బాంబులు వర్షంలా పడుతున్నాయి.
ఏం జరుగుతుందో నిఖిల్ గ్రహించేలోపలే ఒక బాంబు నేరుగా షిప్పును తాకింది.
'వ్లోంప్' అనే శబ్దం!
మంటలు!
మరునిమిషంలో షిప్పు ధ్వంసం అయిపోయింది. నీళ్ళలో మునిగిపోయాడు నిఖిల్.
కొద్ది క్షణాల తర్వాత పైకిలేచి శ్వాస పీల్చుకున్నాడు. అతని కుడి చెయ్యి స్వాధీనంలో లేదు. గాయమయింది. అక్కడంతా నీళ్ళు ఎర్రగా మారుతున్నాయి అతని రక్తంతో.
నట్టనడి సంద్రంలో చెయ్యి స్వాధీనంలో లేకుండా ఈదడం ఎలా?
నిస్సత్తువగా ఒక్కచేత్తోనే ఈదడానికి ప్రయత్నించాడు నిఖిల్. అతనివల్ల కాలేదు.
మళ్ళీ మునక.
పైన హెలికాఫ్టర్ గాలిలో నిలబడివుంది.
హెలికాఫ్టర్ లోనుంచి తొంగి చూస్తున్నాడు తరుణ్. అతని పెదిమల మీద సంతృప్తితో కూడిన చిరునవ్వు ఉంది. సో! ఇవ్వాల్టితో ఈ నిఖిల్ ఆటకట్టయి పోయినట్లే!
సముద్రాన్ని ఈది అతను ఒడ్డుకి చేరలేడు.
జలసమాధి అయిపోతాడు! ష్యూర్!
అతనితోబాటే అతని పాపాలు కూడా!
నిఖిల్ నీళ్ళలో మునగడం చూశాక కాసేపు అక్కడే వుండి ఆ తర్వాత హెలికాఫ్టర్ ని ముందుకు పోనిచ్చాడు తరుణ్.
నీళ్ళలోనుంచి ఇంక పైకి రావటం అసంభవం అనిపించింది నిఖిల్ కి.
నిస్పృహ ఆవరించింది అతన్ని. ఇవాళ ఇక్కడ ఇలా అంతమైపోతుందా తన జీవితం? తను సాధించ దలుచుకున్నవన్నీ అసంపూర్ణంగా ఆగిపోతాయా? ఆత్మాహుతి దళంలా తను తయారుచేసిన అనుచరులందరూ ఏమయిపోతారు?
తను తప్పుపని చేశాడు. వాళ్ళలో నాయకత్వపు లక్షణాలు ఉన్న వాళ్ళకి సరైన శిక్షణ ఇచ్చి సెకండ్ లైన్ లీడర్స్ ని కొంతమందిని తయారు చేసి ఉండవలసింది.
ఇప్పుడనుకుని ఏం లాభం?
తను చేయదలచుకున్న పని ఒక జీవితకాలం లేటు!
అతను మరణానికి మానసికంగా తయారవుతూ ఉండగా కిందనుంచి ఎవరో పైకి తోస్తున్నట్లు భ్రాంతి!
ఎవరు?
మెత్తగా తగులుతున్న బొచ్చు అతనికి సమాధానం చెప్పింది.
కుక్క!
ప్రాణాలకు తెగించి తన ప్రాణాలు కాపాడుతోంది!
కొద్దిసేపటి క్రితం తను దాని ప్రాణాలను రక్షించినందుకు కృతజ్ఞతా పూర్వకంగానా!
ఆ ఆలోచనే, ఒక మూగజీవం తనకోసం తాపత్రయ పడుతోందన్న ఊహే, అతనికి సముద్రాన్ని ఒంటిచేత్తోకాదు సగం చేత్తోనయినా ఈదగలననే ధయిర్యాన్ని కలిగించింది. చచ్చిపోక తప్పదనే నిస్పృహకూ, బతకాలనే ఆశకీ మధ్య కేంద్రబిందువులాంటి క్షణం అది! ఆ క్షణంలో అతనికి ఆసరాగా నిలిచి ఆశవైపే తోసింది ఆ కుక్క.
