దొంగలముఠా నాయకురాలిలా వుంది అనుకుంది. మనసులో లక్ష అనుమానాలు, భయాలు తలయెత్తుతూనే...
పైకి ఆ భయాన్ని ప్రకటించకుండా ధైర్యంగా ఆమె వెంట వెళ్ళసాగింది.
ఆమె నవ్వుతూ స్నేహపూర్వకంగానే ఉంది.
ఇంద్రసేనని ఎంతో జాగ్రత్తగా లోపలకు తీసుకెళ్ళింది.
బంగళా లోపల ఎంతో అందంగా ఉంది.
ఖరీదయిన ఫర్నీచర్ దానికి తగినట్టు క్రింద ఖరీదయిన కార్పెట్ పరిచివుంది.
ఆశ్చర్యంగా చూసింది.
ఈ బంగళాలో ఉన్నవాళ్ళు ఎవరోగాని చాలా గొప్పవాళ్ళు అయి ఉంటారు అనుకుంది.
అంత పెద్ద బంగళాకి డ్రయివర్, ఆమే కనిపిస్తున్నారు.
డ్రయివర్ ఆమె సూట్ కేస్ పట్టుకొచ్చి లోపల పెట్టేశాడు.
ఇంద్రసేన ఆమెవేపు చూస్తూ కంగారుగా అంది.
"నా సూట్ కేస్ ఎందుకు తెచ్చేశాడు" అంటూ ఆ మాటలకామె నవ్వి.
"స్నానంచేసి బట్టలు మార్చుకుంటారేమోనని నేనే తెమ్మన్నాను. మరీ అంత భయపడిపోతున్నారేమిటి!" అంది నవ్వుతూనే.
ఇంద్రసేన నవ్వలేదు.
"నేను ఇప్పుడు స్నానం చెయ్యను" అంది.
"మీరు ఆ గదిలోకి వెళ్లి కూర్చుండి" అంది ఆమె అటువైపు ఉన్న గదిలోకి దారి చూపిస్తూ.
ఇంద్రసేనకి అంతా అయోమయంగా వుంది. ఇక్కడికి వచ్చాక ఆమె చెప్పినట్లు వినక తప్పదు. అందుకే మౌనంగా ఆ గదిలోకి వెళ్లింది.
ఏసి రూమ్ వలన తలుపు వేసి వుంది. మెల్లగా తలుపు తీసుకుని లోపలకు అడుగు పెట్టింది.
అంతే కెవ్వుమని అరవబోయి అలా వుండిపోయింది.
మాట రాలేదు. గొంతుక తడి ఆరిపోయినట్లుగా వుంది.
వెనక్కి పారిపోవాలని ప్రయత్నించింది.
కాని కాళ్ళు నేలకు అంటుకుపోయినట్లుగా అనిపించసాగింది.
"స్వాగతం సుస్వాగతం"
"అందాలరాణికి స్వాగతం"
"ముత్యాలబొమ్మకి స్వాగతం సుస్వాగతం" అంటూ తల కొద్దిగా వంచి చేతులు చూపుతూ అన్నాడు.
కృష్ణమౌళి పుల్ సూట్ లో అందంగా, దర్జాగా నవ్వుతూ కొంటెగా చూస్తూ అంటున్న ఒక్కోమాట వింటూ అలా ఉండిపోయింది.
"మీరా!" అంది ఆశ్చర్యంగా, భయంగా.
"ఆ నేనే ఏం! ఆశ్చర్యంగా ఉందా!" అడిగాడు నవ్వుతూ.
ఆమె మాట్లాడలేదు.
"చూశావా! ఈ రోజు ఎలా నన్ను వెతుక్కుంటూ వచ్చావో" అన్నాడు. ఆ మాటల్లో హేళన తొంగిచూసింది. ఆమె మనసు ఒక్కసారి బుస్సుమంది.
ఒక్కసారి అతనివైపు కోపంగా చూసింది.
"ఏమిటి ఈ మోసం! అడుగడుగునా ఏమిటీ నాటకాలు" అడిగిందీ కోపంగా.
"మోసంకాదు."
"మరి దీన్ని ఏమిటంటారు."
"ప్రేమ అంటారు" నవ్వాడు.
"ఛీ ఛీ ఆ మాట ఉచ్ఛరించడానికి సిగ్గు అనిపించటం లేదూ!"
"సిగ్గా ఎందుకు!" అంటూ నవ్వి.
"ఇది సిగ్గు పడవలసిన విషయంకాదు. గర్వపడవలసి విషయం. ఆనాడు శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకు వెళ్ళి పెళ్ళి చేసుకున్నాడు."
"ఆహా మీరు శ్రీ కృష్ణుడు అయిపోయారని భావిస్తున్నారా! ఆ రుక్మిణి కోరి పెళ్ళాడింది ఆ శ్రీ కృష్ణుడ్ని, కాని ఈ ఇందూ మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధంగా లేదు" అంది కోపంగా.
అతను గట్టిగా నవ్వేసాడు.
"నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందో ఎందుకో తెలుసా!" "తెలుసు" పళ్ళ బిగువున కోపం ఆపుకుంటూ అంది.
"గ్రహించుకున్నావా"
"ఆహా"
"ఆ గ్రహించుకున్నదేమిటో శలవు ఇస్తారా!" కొంటెగా అడిగాడు.
"మీకు తిన్నగా బ్రతకటం ఇష్టంలేదని కోరి మీ నాశనాన్ని చేతులారా తెచ్చుకుంటున్నారని ఈ విషయం మా డాడీకి, మా అన్నయ్యకు తెలిస్తే....!" అంది కోపంగా.
"ఆ తెలిస్తే ఏం చేస్తారు"
"నన్ను అడగటం దేనికి మీకే తెలుస్తుంది."
అతను గట్టిగా నవ్వేశాడు.
"మీ నాన్న ఒక పెద్ద ఫూల్ అయ్యాడు. మీ అన్నయ్య ఒక అమ్మాయిలా చేతికి గాజులు వేసుకుని యింట్లో కూర్చున్నాడు" అన్నాడు హేళనగా.
"కృష్ణమౌళిగారూ!" ఆమె కంఠస్వరం కంగ్ మంది.
"ఆజ్ఞాపించండి ఏమిటో!" అన్నాడు హేళనగా!
"ఛీ మీతో మాటలు నాకు అనవసరం. ఇక్కడ మీ ఎదురుగా ఉండటం ఇష్టంలేదు. ఛీ ఛీ" అంటూ ఇంద్రసేన వెనక్కి తిరిగి తలుపు తీసుకుని బయటకు పరుగెత్తింది!
ఆమెను అక్కడకు తీసుకువచ్చిన మణి అన్న ఆమె ఇందుకి ఎదురు వచ్చింది.
"ఎక్కడికి వెళుతున్నావు!" ఆమె కంఠస్వరం గంభీరంగా ఉంది.
"ఎక్కడికా నా ఇష్టంవచ్చిన చోటకి" అంటూ తల ఎగరేసి చాలా పొగరుగా అంది.
