"రాజా! అలా మాట్లాడకు. ఇంత గొప్ప మన అనుబంధాన్ని అలాంటి బాషతో భరించలేకపోతున్నాను."
"ఇది 'గొప్ప' అని మనమిద్దరం పేరు పెట్టుకుంటే చాలదు దిలీప్ ఇతరులనుకోవాలి . ఇంతకాలమూ వాళ్ళకీ ఎవరికీ తెలీకుండా రహస్యంగా వుంచగలిగావు కాబట్టి గౌరవంగానే బ్రతికాం కాని ఈనాడు.....అందరికీ తెలిసి పోయింది. వాళ్ళకు నన్ను చూసి నవ్వుకోటానికి అలుసుగా చూడటానికి, కించపరచేలా మాట్లాడటానికి కావలసినంత అవకాశమిచ్చావు. ఉంపుడుగత్తె అన్న బిరుదును ప్రసాదించావు. ఇన్నాళ్ళూ అనుభవించిన అనందం థ్రిల్ అన్నీ మంటగలిసిపోయాయి. ఇహ పరిస్థితి తప్పించటం నీ తరం కాదు. దిలీప్ మనోరమకు అద్భుతమైన కవచముంది. నాకు లేదు. అందరి ద్రుష్టి నాపైనే ఉంటుంది. దిలీప్! ఓ చితం చెప్పనా? నాగరికత ఎంతో పెరిగింది , మనమెంతో నవనాగరికులం అని మనుషులు భుజాలేగరేసుకుంటారు , కాని మనస్తత్వాలు మాత్రం ఆటవికులు కంటే హీనమైన దశలో నుంటాయి. అంతవరకే.....ఆ తర్వాత .....ముందుకు దూసుకుపోయిన కొద్దీ ప్రతి అంశం లోనూ అనాగరికంగానే ప్రవర్తిస్తాడు. నేనెంతో ఎదిగాను దిలీప్. దేన్నయినా పోగొట్టుకుంటానికి సిద్దపడతాను గాని, ఈ వికారాలు మాత్రం భరించలేను.
"రాజా!"
'అంతే దిలీప్ మన చరిత్ర చివరి కొచ్చేసింది. ఈ క్షణం నుంచే మనం విడిపోతున్నాం.
22
దిలీప్ దూరమయ్యాక రాజహంస ఆ యింట్లో నుంచి వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంది. ఎందుకంటె ఆమెకీ 'సభ్య' సమాజంలో ఎన్నో పరిచయాలున్నాయి. వాళ్ళంతా యింటికి వస్తూ వుంటారు. ఈ సంగతి తెలిశాక పనిగట్టుకుని మరి వస్తారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు యింకోటి మాట్లాడుతూంటారు. ఇరుగు పొరుగు ఆమెని అదోలా చూస్తారు. ఇవన్నీ తాను తట్టుకోలేదు.
ఇల్లు తన పేరునే వుంది. లాకర్ లో కొన్ని లక్షల ఖరీదు చేసే బంగారు ఆభరణాలున్నాయి. బ్యాంక్ లో మూడు లక్షల దాకా క్యాష్ వుంది. ఇవన్నీ దిలీప్ తనంటే వుంటే ప్రేమ కొద్దీ అమర్చాడు. ఒక మూడ్ లో అన్నీ తిరిగి అప్పజేప్పాయాలనుకుంది. కాని తాను బ్రతకాలి. బ్రతకటానికి ఓ మార్గం వుండాలి. ఈ దశలో ఉద్యోగం చెయ్యలేదు. కనీస అవసరాలకు సరిపోయే జీతమొచ్చే ఉద్యోగమూ రాదు. విరక్తిగా వున్న ఈ స్థితిలో ఆమెకు యింట్లోంచి బయటకు రావలనిపించలేదు. ఈ ఇల్లు అమ్మేశయినా , అద్దె కిచ్చయినా ఊరి శివార్లలో వున్న యింకో ప్రాంతానికి వెళ్ళిపోవాలి. అమ్మటం అంటే అంత తేలిగ్గా అవదు. టైం తీసుకుంటుంది. పైగా అంత డబ్బ అవసరం లేదు. అందుకని అద్దె కివ్వటానికే నిశ్చయించుకుంది. మొదట నాలుగయిదు రోజులపాటు మనసు స్థిమిత పడే దాకా యింట్లోనే వంటరిగా గడిపింది. ఎక్కడ్నుంచి ఫోన్లు రాకుండా ప్లగ్ తీసేసింది. ఎక్కువ భాగం మంచం మీద పడుకుని నిద్రపోతూ గడిపింది.
ప్రతి మనిషి జీవితంలోనూ యిలాంటి పరిణామ దశ లుంటాయి. ఎంతో చలాకీగా వుండేవాళ్ళు ఈ పరిస్థితుల్ని బట్టి ఒక్కొక్క దశలో కొంత కాలంపాటు అచేతనంగా అయిపోతారు. రోజులు వాళ్ళకి తెలీకుండానే స్తబ్ధత తో గడిచిపోతాయి .
రాజహంస ఏమాలోచిస్తున్నది? ఆమె మనసులో ఏమున్నది? అసలు మనిషిలోని పూర్తి ఆలోచనలు, మనసు గురించి ఎంత మేధావయినా చెప్పలేడు. ఎందుకంటె వాటికి స్పష్టమైన రూపం వుండదు. మాటలకూ స్పష్టమైన రూప ముంటుంది. మనసుకి వుండదు. ఇది ఓ చిత్రమైన చారిత్రక సత్యం. ప్రపంచంలో అన్నిటికన్నా అద్భుతం మనసే.
* * *
పదిరోజులు గడిచిపోయాక రాజహంస యింట్లోంచి బయటికొచ్చింది.
నాలుగయిదు రోజులపాటు అక్కడికి చాలా దూరంగా వున్న ప్రాంతాలలో యిళ్ళ కోసం వెదికింది. అలా శ్రమపడగా మలక్ పేటలో ఓ యిల్లు ఆమెకు కొంతవరకూ నచ్చింది. ఆ యింట్లో రెండు భాగాలున్నాయి. ఒక భాగంలో యింటి వాళ్ళుంటారు. రెండో భాగంలో అద్దె కివ్వటం కోసం కేటాయించారు. ఆ పోర్షన్ తీసుకోవాలని రాజహంస నిర్ణయించుకుంది. అలా గాకుండా ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వున్న ఇల్లు తీసుకుందామా అని ఆమె ఆలోచించకపోలేదు. కాని తాను వంటరి ఆడది. ఎంత నిబ్బరంగా వుందామన్నా కొన్ని సమయాల్లో తెలీకుండానే ఏదో భయం అవహిస్తున్నది. మనుషుల పొత్తు వద్దనుకున్నా, ఆ సవ్వడి, ఉనికి దగ్గర్లో లేకుండా మరీ ఏకాంతాన్ని ఆశ్రయించటం శుష్క హృదయం మీద మరింత దెబ్బ కొడుతుంది.
తన యింటిని అద్దె కిచ్చేసి, కొత్త ఇంట్లోకి మారిపోయింది.
* * *
ఒక్కోసారి ఏ వ్యపకమూ లేని స్థితిలో కూడా రోజులు చకచకా గడిచి పోతుంటాయి. ప్రస్తుతం రాజహంస అలాంటి స్థితిలోనే వుంది. నాలుగయిదు రోజులకోసారి బయటకొస్తుంది. దగ్గర్లో వున్న మార్కెట్ లో వస్తువులు తీసుకుని యింటి కెళ్ళి పోతుంది. ఎక్కువసేపు పడుకుని వుంటుంది. నిద్రో, నిద్ర కాదో తెలీని భావరహితస్థితి . మెలకువగా వున్నప్పుడు ఊరికినే అలా వాలు కుర్చీలో కూచుని వుంటుంది. పుస్తకాలేమీ చదవాలనిపించటం లేదు. టి.వి అన్ చేసి కదిలే బొమ్మల్ని అనాసక్తంగా స=చూస్తూ వుంటుంది.
"ఓరాత్రి ....తొమ్మిది గంటల వేళ బయటనుంచి ఎవరో తలుపు తట్టిన చప్పుడయితే కుర్చీలోంచి లేచింది. ఆ యింటికి కాలింగ్ బెల్ లేదు. కావాలని పెట్టించుకోలేదు.
