"ఇన్ని కారణాలవల్ల ఈ రహస్యాన్ని రహస్యంగా వుంచేశాను."
"వాసుదేవరావుగారు చనిపోయారు. ఇహ మనోరమకి అక్కడ వుండే అవసరం లేదు. శాశ్వతంగా యిక్కడ వుండే ఏర్పాటుతో యిక్కడికి వచ్చేసింది.
"చూపులతో మనిషిని తినేయ్యటం మనోరమ ప్రత్యేకత. ఆమె చూపులు చేతలు అనుక్షణం నన్ను వెన్నంటాయి. ఏ అనుమాన మొచ్చిందో ఏమో నామీద నిఘాలు కూడా పెట్టింది.
"నాలో చిత్రవధ మొదలయింది. గత కొన్ని నెలలుగా నాలో నువ్వు చూస్తోన్న మార్పుకి కారణం యిదే. ఏమి భయంకర పరిణామాలు జరుగుతాయో, నిన్ను పోగొట్టుకుంటానెమో - ఈ సంఘర్షణతోనే నలిగిపోయాను."
"ఈ రహస్యం కాపాడుకోవాలని నేనిన్నాళ్ళు తాపత్రయ పడింది. ప్రపంచానికి జడిసి కాదు. నిన్ను పోగొట్టు కుంటానని.
"చివరకు....
"ఏదయితే నేను జరగకూడదనుకున్నానో అది జరిగిపోయింది. పూల రాశిలో కార్చిచ్చు చెలరేగింది."
21
గదంతా చీకటి వ్యాపించింది. కొన్ని నిముషాలు ఆ చీకట్లోనే మౌనంగా కూర్చున్నారు. ఇహ దుస్సహమనిపించి రాజహంస లేచి బెడ్ లైట్ అన్ చేసి వచ్చింది .
'ఇప్పుడెం జరుగుతుంది?' అనడిగింది రాజహంస.
"రాజా! ఏం జరిగినా.....నిన్ను విడిచి నేనుండలేను"
ఆమె ఏమీ మాట్లాడలేదు.
"రాజా! మాట్లాడవేం?"
ఆమె అప్పటికీ పెదవి కదపలేదు.
"రాజా! రాజా! అలా మౌనంగా వుండకు. నేను భరించలేను. నాకేదయినా మార్గం చెప్పు."
"నువ్వు మొగవాడివి . నీకు నేను మార్గం చెప్పాలా దిలీప్" అంది. ఆమె మాటల్లో కోపం లేదు. కసి లేదు. ద్వేషం లేదు. హృదయాన్ని వ్యక్తం చేసే స్వచ్చతతో కూడిన వేదన వుంది.
"ఇంతకాలం .....పరిస్థితి విషమంగా తయారుకాలేదు. కాబట్టి సత్యాన్ని గోప్యంగానే వుంచి నిన్ను పరిరక్షించుకుంటూ వచ్చాను. ఇప్పుడంతా బట్టబయలయిపోయింది. నేనూ ఓ నిర్ణయం తీసుకున్నాను."
ప్రశ్నార్ధకంగా చూసింది.
"నువ్వు లేని నా జీవితం లేదు. నువ్వు చేసిన పనే నేను చేస్తాను. నువ్వేలాగయితే నీ సంసారాన్ని త్యజించి వచ్చేసావో, అలాగే నేను కూడా తెగతెంపులు చేసుకుని వచ్చేస్తాను . ఇద్దరం ఎటయినా వెళ్ళిపోదాం."
రాజహంస నవ్వింది. అంతకన్నా ఏమీ మాట్లాడలేదు.
"జవాబు చెప్పవేం రాజా?"
"అలా ...జరగదు."
"ఎందుకని?"
"అసలు లేచిపోవట మనేది ఓ అసహ్యమయిన విషయం. తప్పనిసరి పరిస్థితుల్లో అది ఒకసారి జరిగింది రెండో సారి ఆ భయంకరమయిన అసహ్యాన్ని ఆహ్వానించలేను."
"ఇది లేచిపోవటం కాదు. చట్టరీత్యా వాళ్ళందరితో తెగతెంపులు చేసేసుకుంటాను.
"ఆ కొందరి విషయంలో అదంత తేలికేం కాదు. ఒక విధంగా చెప్పాలంటే అసంభవం కూడా. మనోరమ ఎటు వంటిదో ఒక్కసారి కలుసుకోగానే అర్ధమయిపోయింది. మనోరమ పాండురంగ కాదు. పాండురంగ దుర్మార్గుడయి వుంటే నేనక్కడ్నుంచి వచ్చేసినా వెంటాడి వెంటాడి కాల్చుకు తినటానికి ఏ చట్టమూ , పోలీసులు అడ్డు వచ్చేవారు కాదు. చరిత్రలో అలాంటి దృష్టాంతాలెన్నో వున్నాయి. ఇంకోసారి నేను చెబుతాను. పాండురంగ నీచుడు అయినట్లయితే ఈపాటికీ ఎన్నో రకాల సమస్యలు , ఆశాంతి విషపూరిత వాతావరణం సృష్టిస్తూ వుండేవాడు. చట్టానికీ పోలీసులకీ భయపడని మొండివాళ్ళని వాళ్ళు తన్నినా, హెచ్చరికలూ చేసిన లెక్క చేయని సిగ్గులేని వాళ్ళని ఎవరూ ఏం చెయ్యరు. పైగా ప్రజలు కూడా వాళ్ళనే సమర్ధిస్తారు. . ఆ మనోరమ మనం ఎక్కడికి వెళ్ళినా వెంటాడుతుంది. అల్లరి చేస్తుంది. ప్రజల దృష్టిలో నాదే తప్పయినట్లు నిరూపించి నేరస్తురాల్ని చేస్తుంది. అంతేకాదు, నన్నో ఉంపుడు గత్తేగా చలామణి చేస్తుంది. ఆ అవమానాన్ని, అలాంటి స్థానాన్ని నేను భరించలేను దిలీప్."
అతను దిగ్భ్రమగా వింటున్నాడు.
"మొదట్నుంచీ ఇలాంటి స్థితి నాకు రాకూడదనే కోరుకుంటూ వచ్చాను. ఎంతోమంది ప్రలోభాలు కల్పిస్తూ సాయాని కొచ్చినా కఠినమయిన మనస్సుతో నిరాకరిస్తూ వచ్చాను. దిలీప్! ఒక మాటడుగుతాను చెప్పు మీ ఆవిడకు సముచితమైన స్థానముందో బహిరంగంగా ఆమెతో ఎలా తిరగ్గలవో , ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతే స్థానం, గౌరవం నాకు లభించేటట్లు బహిరంగంగా స్వేచ్చగా నాతో జీవించగాలవా? ఇప్పుడు మనిద్దరం మాట్లాడుకుంటున్న ఈ సన్నివేశంలోకి మీ ఆవిడా చిచ్చుకు వస్తుంది. ఏమి తొట్రుపాటు లేకుండా, కలవరపాటు లేకుండా, గిల్టీ కాన్షస్ నెస్ లేకుండా, నిర్భయంగా బిహేవ్ చెయ్యగలవా? 'రాజా నాకు కావాలి. ఆమె లేకుండా నేను బతకలేను' అని తనముందు ప్రకటించగలవా? 'ఈ రాత్రికి యిక్కడే వుంటాను. నువ్వు వెళ్ళిపో' అని ఆవిడతో చెప్పగలవా?"
అతని ముఖంలో నెత్తురు చుక్కలేదు.
"చెప్పలేవు. అది నీ బలహీనత. చేతకానితనం అని ఎత్తి పొడవటం లేదు. అది సమాజం ఆమెకిచ్చిన గౌరవం. తాళిబొట్టు ఆమె కిచ్చిన బలం. వాటి ఆధారంగా ఆమె తనకు తానుగా తెచ్చుకున్న శక్తి. నువ్వు తిట్టినా, కొట్టినా కన్విస్ చెయ్యటానికి ప్రయత్నించినా ఎవ్వరికీ నీ మీద సింపతీ లభించదు. నువ్వ్వు తిరుగుబోతువంటారు. నన్ను ఉంపుడు గత్తె నంటారు. 'అదిగో అది వాడి కీప్ రా' అంటారు"
