తలుపు తీసేసరికి , మసక వెల్తుర్లో ఒక వ్యక్తీ నిలబడి వున్నాడు. తేలిగ్గా గుర్తుపట్టింది వినోద్.
విసుగ్గా అతని వంక చూసి తలుపు వేసేయ్యబోయింది. అతనామె ఉద్దేశ్యం కనిపెట్టి చప్పున లోపలకు దూసుకొచ్చాడు.
"ఏమిటిది?" అంది కోపంగా.
"రాజహంసా! మరీ అంత కోపంగా వుండకు. దాని వల్ల సాధించేదేమీ లేదు. ఇప్పటికే జీవితంలో చాలా పోగొట్టుకున్నావు."
"అవన్నీ నా సొంత విషయాలు అందులో నీ ప్రమేయం దేనికి?"
అతను తాగివున్నట్లు ముఖకవళికల్ని బట్టి, మాటల్ని బట్టి తెలుస్తోంది.
"చాలా కష్టపడి నీ ఇల్లు కనుక్కుని వెదుక్కుంటూ వచ్చాను. మరీ అంత విదిలించినట్లు మాట్లాడకు. రాజహంసా!"
"నీతో ఆదరణగా మాట్లాడే అవసరమేముంది? అసలలా దూసుకువచ్చే అధికారమేవరిచ్చారు నీకు?"
"జీవితంలో అన్నీ అధికారంతో కొనలేం రాజహంసా! ఏ అధికారమూ లేకుండానే ఎన్నో పనులు చేస్తూ వుంటాం. నీకూ, నాకూ బొత్తిగా సంబంధం లేకపోలేదు. నువ్వు కొన్నాళ్ళు నా దగ్గర ఉద్యోగం చేశావు."
"అదో ఘనకార్యం కాదు."
"నాకు కోంత దగ్గరగా వచ్చావు. ఓ అందమయిన సాయంకాలం, నిన్ను కారులో షికారు తీసుకెళ్ళాను. నిన్ను పెల్లడాలన్న కోరిక నీకు వుండేది. నిన్ను నా చేతుల్లో తీసుకుని ముద్దు పెట్టుకున్నాను."
'అబ్బా౧ అందుకని నామీద సర్వాధికారాలు వచ్చేశాయనుకుంటున్నావా? ఒఅదపిల్ల అస్పష్టమయిన అవగాహనతో వున్న దశలో తనను తాను నిలద్రోక్కుకునే పరిపక్వత రాని ఈడులో ఇతరుల దురుద్దేశ్యాలను అధ్యయనం చెయ్యటానికి ఇంకా అనుభవించాలని స్థితిలో కొన్ని సంఘటనలు చెదురు మదురుగా ఇలాంటివి జరగవచ్చు. అలాగే నీతో ఒకానొక రోజు కారులో వచ్చి వుండవచ్చు. అందుకని నువ్వో పెద్ద హీరోనై పోయాననీ, నేనేదో పోగొట్టుకున్నానని అనుకోవటం లేదు."
"నువ్వు చాలా అహంకారివి"
"పోనీలే అప్పుడప్పుడూ మనుషులకు అహంకారంగా వుండటం కూడా అవసరం.
"కాని ఇప్పుడు నువ్వు మళ్ళీ మెదటికి వచ్చేశావు. కట్టుకున్న భర్తనూ నమ్ముకుని వచ్చిన మనిషిని పోగొట్టుకుని వంటరిగా మిగిలిపోయావు."
"సరే! వంటరిగానే మిగిలిపోయానయ్యా. అయితే ఏమంటావ్?"
"చూడు రాజహంసా! ఇంకా నువ్వు మంచి వయసులో వున్నావు. నీ శరీరం ఇంకా అందాలూ, సొగసులూ విరజిమ్ముతున్నది. వాటి వెనుక బోలెడు ఆశలూ, కోరికలు వుండటం సహజం. మనిషన్నాక అవకాశం తరుముకోస్తూన్నప్పుడు సుఖ పడాలి గాని, సుఖాలను దూరం చేసుకోవడం అవివేకం. నువ్వూ సుఖపడు నన్నూ సుఖపెట్టు."
"ఈ మాటలు చరిత్రలో కొన్ని లక్షల, కోట్ల సార్లు వంటరి ఆడదాని ముందు ఉద్భోదించబడి వుంటాయి. స్థిరచిత్తంతో ఉన్నవారి ముందు ఇవి తలవంచి వుంటాయి. నిస్సహాయ స్థితిలో వున్న వారిముందు గెలుపొంది వుంటాయి. ఈ జయాపజయాలు వ్యక్తుల చుట్టూ బిగించబడి వున్న పరిస్థితులివి , ఆ వ్యక్తులది కాదు."
"రాజహంసా! వ్యక్తులతో, పరిస్థితులతో ఈ చర్చ అనవసరం నువ్వు నాకు కావాలి."
"నువ్వు నాకు అక్కర్లేదు"
"నీమీది వ్యామోహంతో నా శరీరం స్వాధీనం తప్పుతోంది."
"నీ మీది అసహ్యంతో నా శరీరం నిప్పులు క్రక్కుతోంది."
"నన్ను నేను అదుపులో పెట్టుకోలేక ...... నిన్ను బలాత్కారం చేస్తే?"
"లొంగిపోవటానికీ నేను అసమర్దురాల్ని కాదు. ఇష్టం లేని ఆడదాని ప్రవర్తన ఎంత భీబత్సం సృష్టించ గలదో చవి చూస్తావు."
అతనామే కళ్ళలోకి చూశాడు. వాటిలో కనబడుతున్న ఆత్మవిశ్వాసం , హుందాతనం అతన్ని బలహీనుడ్ని చేశాయి.
"డామిట్ ' అని గొణుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు.
ఆ రాత్రంతా ఆమెకు నిద్ర పట్టలేదు. ఏడ్పు రాలేదు. ఈ ప్రపంచమంటే ఏవగింపు కలిగింది. నిశ్చలంగా , నిశ్చలనంగా ఒకర్ని తమదార్ని బతకనివ్వరు. డర్టీ ఎన్ క్రోచ్ మెంట్. అర్ధం పర్ధం లేకుండా దూసుకొచ్చి కెలుకుతూ వుంటారు. అల్లరి, అపహాస్యం తమ ప్రమేయం లేకుండానే ఎన్ని జీవితాలిలా అల్లరికి గురి కాబడుతున్నాయో. రవ్వంత సంఘటనకు కొండత సంచలనం.
మర్నాడు ఉదయం కాఫీ త్రాగి కుర్చీలో కూర్చుని వుండగా ఇంటావిడ గుమ్మంలో కొచ్చింది. తలుపులు తీసే వుండటం చేత ఆవిడ అక్కడ నిల్చోవటం అలికిడి విని తల ఎత్తగానే కనబడింది.
ఆవిడకు ముప్పయి అయిదేళ్లుంటాయి. భర్త సంపాదించిందంతా వందో, రెండొందలో ఖర్చుల కోసం చాటుగా మిగుల్చుకుని మిగిలినదంతా ఆవిడా చేతులలో పోసి భార్య పట్ల తనకు గల విధేయత ప్రకటించుకుంటూ వుంటాడు. ఆవిడ భర్త మీద, ఇంటిమీదా అధికారం చెలాయిస్తూ ఓ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నంత గొప్పతనం ఫీలవుతూ వుంటుంది.
"రండి" అంది రాజహంస మర్యాదగా.
ఆమె లోపలి కొచ్చింది.
'కూచోండి."
