Previous Page Next Page 
మారణహోమం పేజి 39


    
    ఫ్యాంటు వేసుకున్న కాలు, నడుము దగ్గర బెల్టు, నడుముచుట్టూ తడిమి చూశాడు రివాల్వర్ కోసం. అక్కడ లేదు.
    చెయ్యి యింకా పైకి పోనిచ్చాడు.    
    ఫెర్నాండెజ్ చెయ్యి తగిలింది. రివాల్వర్ కోసం తడుముతూ అతని వేళ్ళ దగ్గరికి చెయ్యి పోనిచ్చాడు.    
    రివాల్వర్ అతనికి కనబడలేదు - అతని మొహంలో పేలేదాకా.    
    ఆ పరిమిత ప్రదేశంలో రివాల్వర్ ప్రేలుడు ఆటంబాంబు ప్రేలుడులా వినబడింది.    
    కొద్ది సెకండ్లు గడిచాక గొంతు పెకలించుకుని అన్నాడు ఫెర్నాండెజ్ "నిఖిల్!"    
    ఒక్క అంగలో అతన్ని చేరుకున్నాడు నిఖిల్.    
    "ఫెర్నాండెజ్ మై ఫ్రెండ్!" అన్నాడు విషాదంగా. అతని కళ్ళు మెల్లిగా చీకటికి అలవాటు పడుతున్నాయి.    
    ఫెర్నాండేజ్ మొహంవైపు చూస్తుంటే అతని మనసులో బాధ సుళ్ళు తిరిగింది. ఫెర్నాండెజ్ మొహంలో చాలా భాగాన్ని ఎలుక తినేసింది.    
    "నిఖిల్!" అన్నాడు ఫెర్నాండెజ్ హీనస్వరంతో "నీ స్నేహితుడిగా నేను నా విద్యుక్త ధర్మం నిర్వర్తించానా?"    
    అభిమానంగా అతని చెయ్యి నిమిరాడు నిఖిల్ "ఇది నీ కోసం, నా కోసం, స్నేహం కోసం, కాదు ఫెర్నాండేజ్! దేశంకోసం! పీడిత తాడిత ప్రజలకోసం! ఫెర్నాండెజ్! నేను మోటార్ బోట్ లో వెళ్ళి డాక్టర్ ని పిలుచుకువస్తాను.    
    "వద్దు నిఖిల్! ఈ చివరి కొద్ది నిమిషాలూ నా దగ్గరే ఉండు. దూరంగా వెళ్ళిపోకు!"    
    "ఇప్పుడేమీ కాలేదు ఫెర్నాండెజ్! నువ్వు బతుకుతావు. నిన్ను బ్రతికించుకుంటాను నేను"    
    నిస్పృహగా నవ్వాడు ఫెర్నాండెజ్.    
    "నిఖిల్! నువ్వంటే నాకెంత అభిమానమో తెలుసునా! నేనే గనక ఆడపిల్లనయి ఉంటే నీతో తప్పకుండా ప్రేమలో పడిపోయి ఉండేవాడిని!"    
    సంతోషం లేకుండా నవ్వాడు నిఖిల్.    
    "ఫెర్నాండెజ్ ధయిర్యం కోల్పోకు! నేను వెళ్ళి డాక్టర్ ని తీసుకొస్తాను!" అన్నాడు స్నేహితుడి చెయ్యి గట్టిగా వత్తుతూ.    
    అతను వెనుదిరిగి పది అడుగులు కూడా వెయ్యనేలేదు. వెనకనుంచి మళ్ళీ రివాల్వర్ పేలిన శబ్దం వినబడింది.
    తన చేతిలోని రివాల్వర్ ని కణతలకు ఆనించుకుని చివరి బుల్లెట్ నీ కాల్చేశాడు ఫెర్నాండెజ్.
    నెమ్మదిగా వెనక్కి వచ్చాడు నిఖిల్ అతని బాధ దుఃఖంగా, దుఃఖం కోపంగా, కోపం అగ్రహజ్వాలగా మారాయి.    
    మసిలిపోతున్న మనసుతోనే అనుకున్నాడతను.
    "స్నేహితుడా! ఫెర్నాండెజ్! మహామాయాజాలంలా ఉన్న ఈ వ్యవస్థని మార్చే మహోన్నత యజ్ఞంలో మరో సమిధవై పోయావు నువ్వు!    
    హితుడా! ఓ స్నేహితుడా! నీ త్యాగం, నీలాంటి మరెంతో మంది చేసిన త్యాగం వృధాపోదు! వృధా కానివ్వను నేను! నువ్వు కార్చిన రక్తమే నా ఆశయాలకు ఇంధనంగా చేసుకుని దుర్మార్గుల దుంప తెంపేస్తాను. మాయావులను మారణహోమం చేస్తాను
    అన్యాయాన్ని రూపుమాపేస్తాను ఫెర్నాండెజ్! ఈ సమాజం షేపు మార్చేస్తాను.    
    "నిజం! మై ఫ్రెండ్! నిజం"    
    అప్పుడు వినబడింది చాలా అస్పష్టంగా! అలర్ట్ గా అయిపోయాడు నిఖిల్!
    ఏమిటా శబ్దం!    
    చెవులు రిక్కించి విన్నాడు. మూసివున్న ఏ గదిలోనుంచో కుయ్యోమని ఏడుపు!    
    ఒక్కొక్క గది తలుపు తీసి చూస్తూ ముందుకెళుతున్నాడు నిఖిల్. అతనికి తెలుసు. ఏ తలుపు వెనకో ఒక తుపాకీ తనకోసం గురి చూస్తూ ఉండవచ్చని!    
    అయినా-    
    గుండెలు నీరయి పోయేటట్లు వినబడుతూ ఉన్న ఆ రోదన అతన్ని కదిలించి వేస్తోంది, మనసును కలచివేస్తోంది.    
    ఒక గది తలుపు తెరవగానే ఆ రోదన పెద్దగా, మరీ స్పష్టంగా వినబడింది. కళ్ళు చిట్లించి చూశాడు నిఖిల్.
    షెల్ఫ్ ఒకటి ఒరిగిపోయి ఉంది. దానికింద చిక్కుపోయి వుంది ఒక కుక్క, నల్లగా వుంది అది. మెడమీద తెల్లటి మచ్చ.    
    అతన్ని చూడగానే శోకం పెద్దది చేసింది కుక్క.    
    "షిట్!" అనుకున్నాడు నిఖిల్. ఆ కుక్క ఉన్న పొజిషన్ చూస్తే దానివంట్లో ఎముకలు నుగ్గునుగ్గయి పోయి ఉంటాయని పిస్తోంది. అంత బరువైన షెల్ఫ్ మీద పడ్డాక అసలు అది ఇంకా బతికి ఉండడమే ఆశ్చర్యం.    
    దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా ఆ షెల్ఫ్ ని పైకి ఎత్తాడు నిఖిల్.    
    వెంటనే మెరుపులా ముందుకి దూకింది కుక్క. ఒక గజం దూరంలో ఆగి వెనక్కి తిరిగి వెనక కాళ్ళమీద కూర్చుని నాలుక బయటపెట్టి రొప్పుతూ అతనివైపు చూసింది. దాని కళ్ళలో కృతజ్ఞత కనబడుతోంది.    
    దానివైపు పరిశీలనగా చూశాడు నిఖిల్. ఈ కుక్క ఎవరిదయి వుండవచ్చు? షిప్పులోని నావికులెవరైనా పెంచుకుంటున్నారేమో!    
    నావికులనుకోగానే గుర్తువచ్చినట్లు చుట్టూ చూశాడు నిఖిల్? ఇంజన్ చేస్తున్న శబ్దానికి ఫ్లోర్ కి బిగించిన రేకులు సన్నగా కదులుతున్నాయి. షిప్పు అలలమీద అటూఇటూ ఊగుతోంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS