ఆమె ఆ మాటలు విని కంగారుపడ్తూ ఇందువైపు చూస్తు "విన్నావుగా నేను వెంటనే వెళ్ళాలి మా అబ్బాయికి బాగోలేదట. నీకు ఏం పర్వాలేదు. మా డ్రయివర్ చాలా మంచివాడు. నిన్ను మీ ఫ్రెండ్ యింటికి జాగ్రత్తగా తీసుకువెళ్తాడు. వెళ్ళు అంటూ కారుదిగి ఆ కారు ఎక్కుతూ అంది.
"జాగ్రత్త భయంలేదు వెళ్ళు నేను వెళ్ళి అంబికకు చెప్తానులే" అంది.
ఇంద్రసేన కంగారు పడలేదు, భయపడలేదు.
అలాగే వెళ్ళమన్నట్టు తల ఊపింది.
ఈ కారు ఇలా బయలుదేరింది.
ఇంద్రసేన ఆలోచనలో పడిపోయింది.
నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు మధ్యలో కారు సడన్ గా ఆగిపోయింది.
ఏమిటి అన్నట్టు డ్రయివర్ వైపు చూసింది.
డ్రయివర్ కంగారుగా డోర్ తెరుచుకువెళ్ళి బొనెట్ ఎత్తి చూశాడు.
ఎంతసేపు చూసినా కారు స్టార్ట్ అవలేదు.
గంట అయిపోయింది. డ్రయివర్ ఎండలో చెమటలు కక్కేస్తున్నాడు. అలసిపోయి కొంత కంగారుపడి భయపడి కొంత అతడికి చెమటలు పట్టేస్తున్నాయి.
ఇంద్రసేనకి కంగారుగా ఉంది.
"ఏమిటి ఏమైంది! ఇప్పుడు ఎలా!" భయంగా అడిగింది.
"ఫర్వాలేదమ్మా చూస్తున్నాను స్టార్ట్ అయిపోతుంది. ఎవరైనా మెకానిక్ ఉన్నాడేమో చూద్దామంటే ఊరు దగ్గరకాదు. ఎక్కడికి అయినా వెళ్దామంటే మిమ్మల్ని ఒక్కర్నీ కారులో వదిలి ఎలా వెళ్ళటం!" డ్రయివర్ కంగారు పడుతున్నాడు.
ఆ మాటలు వింటుంటే ఇంద్రసేనకి భయంలాంటిది వీపుపై జరజరా ప్రాకినట్లయి శరీరమంతా వణికినట్లయి కాళ్ళలో వణుకు ప్రారంభమయింది.
ఏడ్పు ముంచుకు వచ్చేయసాగింది.
"ఇప్పుడు ఏం చేద్దాం!" ఏడ్పు గొంతుకతో అడిగింది.
"కంగారు పడకు తల్లీ ఏం భయంలేదు" అన్నాడు డ్రయివర్ పెద్దతను చిన్నపిల్ల జడుస్తుందని గ్రహించి.
మరో అరగంట ప్రయత్నించి చూసినా కారు స్టార్టవలేదు.
ఇంద్రసేనకి కళ్ళ నీళ్ళు గిరగిరా తిరిగిపోసాగాయి.
"ఉండు తల్లి ఇటు ఏదైనా కారువెళ్తే ఆపుతాను" అన్నాడు.
ఇంద్రసేన మాట్లాడలేదు. ఆమెకు మాట రావటంలేదు.
అంతలో ఒక కారు అటుగా వెళ్తుంది.
డ్రయివర్ కారు ఆపాడు.
కారులో ఒక ఆమె కూర్చుని ఉంది. ఇంద్రసేనకంటే అయిదు సంవత్సరాలు పెద్ద వుంటుంది.
మర్యాదస్తురాలిలా కనిపించింది.
డ్రయివరు కారు ఆపి ఏమిటిని అడిగాడు.
ఈ డ్రయివర్ చెప్పాడు.
డ్రయివరు అమ్మగారి ఇష్టమన్నట్లు చూశాడు.
ఆమె వెంటనే పరిస్థితర్ధం చేసుకుని ఇంద్రసేనవేపు నవ్వుతూ చూస్తూ తన కారులో రమ్మని చెప్పింది.
ఆమెను చూస్తూనే ఇంద్రసేనకి భయంతగ్గి ధైర్యం వచ్చింది.
ఆమె అలా ఆప్యాయంగా రమ్మని పిలవటంతో ఆ కారులో కూర్చుంది.
డ్రయివర్ ఆమె సూట్ కేస్ ఆ కార్లో పెట్టి "మీరు వెళ్ళండి భయంలేదు. నా కోసం ఆలోచించకండి నేను ఎలాగలా వెళ్ళి మెకానిక్ ని తీసుకువచ్చి కారు బాగు చేయిస్తాను" అని చెప్పాడు.
ఇందూ అలాగే అన్నట్టు తలవూపింది.
కారు బయలుదేరింది.
ఆమె ఏవో మామూలుగా అడిగింది. మీరు ఎక్కడనుండి వస్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు.
ఎవరి అమ్మాయి! ఏం చదువుకుంటున్నావని, ఇందూ చెప్పింది.
కారు ఊరుచివరగా వచ్చేసింది,
ఈ వూరు ఏమిటో ఇందూకి తెలియలేదు.
"ఇక్కడ మా పిన్నిగారి యిల్లు ఉంది వెళ్ళి చూసి మళ్ళీ బయలుదేరి వెళదాం" అంది ఆమె.
వాళ్ళ కారు, వాళ్ళ కారులో తనని తీసుకువెళ్తుంది. తను అడ్డుచెప్పటం బాగుండదని సరే అది.
కారు తిన్నగా ఓ బంగళా గేట్లోకి ప్రవేశించింది. చుట్టూ ఏ యిళ్ళూ లేవు.
పెద్ద తోట మధ్యలో వుంది ఆ బంగళా.
కారు తిన్నగా గేరేజ్ లోకి వెళ్ళి ఆగింది.
గేరేజ్ లో కారు ఆగగానే గేరేజు షట్టర్స్ క్రిందకు పడిపోయాయి.
ఇంద్రసేన కారు దిగుతూ ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూసింది అటు.
షట్టర్సు ఎందుకు మూసేశారన్నట్టు ఆమెవేపు చూసింది.
ఆమె ఇందు భుజం తడుతూ "కంగారు పడకండి మళ్లీ తెరుస్తారు"
"ఇక్కడ భోజనం చేసి బయలుదేరుదాం. అందుకు మిమ్మల్ని లోపలకు రమ్మన్నాను" అంది నవ్వుతూ.
ఇంద్రసేన ఏం మాట్లాడలేకపోయింది.
గేరేజులోంచి బంగళా లోపలకు వెళ్ళడానికి తలుపు ఉంది.
ఆ తలుపు తీసుకుని ఆమె లోపలకు ప్రవేశించింది. ఆ వెంట ఇంద్రసేన కూడా వెళ్ళింది.
హాయిగా ట్రెయిన్ లో వెళ్ళిపోయినా బాగుండేది, ఈ తిప్పలు ఉండేవికావు.
మనసులో విసుక్కుంటూ అనుకుంది.
ఏమిటి ఈ రోజు ఇలా అయింది.
ఇంద్రసేనకి ఎంత ధైర్యం తెచ్చుకోవాలని ప్రయత్నించినా భయం పోవటంలేదు.
ఎవరు ఈమె!
ఎవరో తెలీదు.
నమ్మకం వచ్చేసింది.
