వాసుదేవరావుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్ లో శక్తి ఎంటర్ ప్రైజెస్ స్థాపించాను. మనోరమ నాతొ రావటానికి వస్తుందనుకున్నాను కాని అస్వస్థతగా వున్న తండ్రిని అంటిపెట్టుకుని ఆమె రేపల్లె నుంచి కదలి రాలేదు. నేనే నెలకు పదిరోజులు అక్కడికి వెళ్ళి రావాలి.
"బిజినెస్ దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. మాకు పిల్లలు పుడుతున్నారు. కాని మనోరమలో నేనంటే వున్న హీనభావం , కసి, ద్వేషం , శాడిస్ట్ మెంటాలిటీ ఏమాత్రం తగ్గలేదు.
"నాలో ఓ కాంప్లెక్స్ ఏర్పడిపోయింది. చేతినిండా డబ్బు వుంది. హోదా వుంది. తలచుకుంటే సర్వసుఖాలు నా దగ్గరకు రెక్కలు కట్టుకుని ఎగురుకుంటూ వస్తాయి. డబ్బు విరజిమ్మి నేనేదైనా కొనుక్కోగలను. కాని మనసు లేకుండా నేనేపనీ చెయ్యలేను - ఒక్క భార్య విషయంలో తప్ప .అక్కడ భార్య కాబట్టి, ఆ పరిస్థితుల్ని బట్టి తప్పలేదు."
"వంటరితనం , తోడూ కోసం అల్లాడిపోయాను. నా జీవన వైఖరి భరించలేకపోతున్నాను. అందుకని బిజినెస్ టూర్స్ ఎక్కువగా వేసుకుని కాలక్షేపం సృష్టించుకునే వాడిని."
ఆ దశలో నువ్వు పరిచయమయ్యావు.
"ఇంట్లో ఎలా ప్రవర్తించేదానివో నాకు తెలీదు. ప్రతి వ్యక్తిలోనూ యిద్దరు మనుషులుంటారని తెలుసు కాని నాకు కనిపించే నీ రూపం, నీ సరళి , నీ ఉనికి ఎంతో సంతోషాన్ని కలిగించేవి. క్రమక్రమంగా నీవైపు ఆకర్షితుడ్నయిపోయాను.
"కానీ మళ్ళీ సంఘర్షణ. మనిషికి ఎంత చిచ్చుకు పోదామన్నా ప్రతి దశలోనూ ఈ సంఘర్షణ తప్పదనుకుంటాను" ఏ సంఘటనా పరిపూర్ణ తృప్తి నిచ్చే రూపంలో జరగదు. ఏదో రకమైన వత్తిడికి లోనవుతూనే వుండాలి.
"నీకు ఓ సంసారం, ఓ పిల్లాడు వున్నాడని తెలిసి చాలా బాధపడ్డాను. జీవితంలో నచ్చిన వ్యక్తీ ఎప్పటికో గాని దొరకటం జరగదు. తీరా దొరికాక వాళ్ళతో గత చరిత్ర బిగించి వేసి వున్న వ్యక్తిగత జీవితమూ వుండి తప్పించు కుందామన్నా వీల్లేనంత బలీయంగా వుండి , నిర్ధాక్షిణ్యంగా వెన్నాడుతూ వుంటుంది. ఒకసారి యిరున్నాక తప్పించుకు పోలేం అంతే . అవతలి మనిషి ప్రభావం సమాజ పరంగా గానీ, సొంత ఏప్ రోచ్ మెంట్ వల్ల కాని బలీయంగా చుట్టుకుని వుంటుంది. తనమీద ఒకరికి ఏ రూపంలో నైనా హక్కు యివ్వనే కూడదు , ఇచ్చామా? మన యిష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా ఆ హక్కుని ఉపయోగించుకుంటూ వుంటారు."
"నీ సంసారంలో చిచ్చుపెట్టి , నీ జీవితంలో కలవరం రేపటమిష్టం లేక దూరంగానే వుండిపోవాలని నిర్ణయించుకున్నాను. అందుకనే కొన్నాళ్ళు నీకు కనబడలేదు ."
"అంతేకాదు నీ మనస్తత్వం బాగా అర్ధం చేసుకున్నాను. నీకు స్వేచ్చగా వుండే క్రొత్త ప్రపంచంలో అడుగు పెట్టాలని వుంది గానీ, అనేక బంధనాలతో వున్న వ్యక్తిని నువ్వు స్వీకరించలేవు. నువ్వడుగు పెట్టబోయే కొత్త ప్రపంచం చాలా నిర్మలంగా, ఏ వత్తిడిలూ లేకుండా వుండాలి. నీకో స్థానం , గుర్తింపు వుండాలి. లేకపోతే నువ్వు ఇమడలేవు. అసలు రావు అవన్నీ గ్రహించే నీమీద ప్రలోభంతో నాకు పెళ్ళి కాలేదని ముందుగా అబద్దం చెప్పాను-- నామీద మొదటే నీకు ఇంప్రెషన్ పోతుందన్న భయంతో ."
"కాని ఎంత ప్రయత్నించినా నీనుంచి దూరం కాలేక, ఆకర్షణ నుంచి తప్పించుకోలేక మళ్ళీ పరిగెత్తుకు వచ్చేశాను."
"ఇద్దరం మైకంలో వున్నాం. ఈ ప్రపంచాన్ని లెక్క చెయ్యని దశలో వున్నాం. ఒకరి ప్రభావం నుంచి యింకొకరు తప్పించుకోలేకపోయాం."
"ఫలితంగా ఒకరితో ఒకరం పెనవేసుకు పోయాం"
"ఇద్దరం మనకు తెలీకుండానే నిర్ణయాలు తీసేసుకున్నాం. నాకోసం నువ్వు సంసారాన్ని త్యజించి, గతజీవితాన్ని తుడిచేసుకుని రావాలనీ, నీకోసం నిన్ను పొందటం కోసం, నాకెవ్వరూ లేరన్న అబద్దాన్ని శాశ్వతంగా అబద్దంగా వుంచాలనీ."
"అలాగే జరిగింది. టూర్ మిషతో నెలకు పదిరోజులు రేపల్లెలో వుండి రావటం."
"కాని యిలా చేస్తున్నప్పుడు నిన్ను మోసం చేస్తున్నానన్న బాధతో ఎంత మధన పడే వాడినో ఎంత కృంగిపోయేవాడ్నో నీకు తెలీదు."
"ఈ నిజాన్ని నీకు చెప్పలేకపోవటానికి కారణాలు , ప్రేమ కోసం స్త్రీ చేసినంత త్యాగం పురుషుడు చెయ్యలేడు. వ్యాపారం, ఉద్యోగ ధర్మం సమాజజీవనం యివన్నీ బలంగానో, బలహీనతతోనో అడ్డు వస్తుంటాయి. స్త్రీ తన సర్వస్వం అతనికి అర్పించేటప్పుడు బాధ్యత కూడా అప్ప చెబుతుంది - అతని సమర్ధత మీద నమ్మకముంచి కాని పురుషుడి బాధ్యత స్వీకరించేదేవరు? మళ్ళీ తన యిమేజ్ ని ఎలా సుస్థిరం చేసుకోగలడు? మనిషి సుఖంగా వుండాలంటే ఆర్ధికంగా బలంగా వుండాలి. ఈ అర్దికబలం ఒకసారి చెయ్యి జార్చుకుంటే తిరిగి అంత తేలిగ్గా లభించదు. శాశ్వతంగా లభించకపోవచ్చు కూడా. స్త్రీని సుఖపెట్టాలంటే మొగవాడు ఆర్ధికస్తోమత కలిగి వుండాలి. అందులోనూ ఈ విధంగా దూసుకొచ్చిన స్త్రీని సంతోషంగా వుంచటం అతని ప్రాధమిక కర్తవ్యం."
